ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ యుగం నడుస్తోంది. బయటకి వెళ్లాలన్నా.. ఇంట్లో ఉన్నా ఫోన్ తప్పనిసరిగా చేతిలో ఉండాల్సిందే. అంతలా ఫోన్లకు అడిక్ట్ అయిపోయాం. దీన్ని అవకాశంగా తీసుకుంటున్నాయి టెలికాం సంస్థలు. టెలికాం సంస్థల మధ్య పోటీ వల్ల అమాంతం తగ్గిపోయిన మొబైల్ టారిఫ్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. గత ఏడాది దాదాపు అన్ని ప్రధాన టెలికాం సంస్థలు 25 శాతం వరకు టారిఫ్ ధరలు పెంచాయి. దీంతో మొబైల్ యూజర్లపై అదనపు చార్జీల భారం పడింది. యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (ఆర్పూ)ను మెరుగుపరుచుకునేందుకు ప్లాన్‌ల ధరలను పెంచామని సంస్థలన్నీ కారణాలు చెప్పాయి. ఇదే తంతును ఈ సంవత్సరం కూడా కొనసాగించే దిశగా సంకేతాలు ఇస్తున్నాయి.
2022 లో మరోసారి మొబైల్ రీఛార్జ్ ధరలు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ఆ దిశగా సంకేతాలు ఇచ్చాయి. గత ఏడాది మొబైల్ టారిఫ్ ధరల పెంపుతో ప్రధాన టెలికాం సంస్థలు అన్ని లాభాల బాట పట్టాయి. ముఖ్యంగా భారతీ ఎయిర్‌టెల్‌కు మూడో త్రైమాసికంలో లాభాలు బాగా కలిసొచ్చాయి. మరోవైపు ఎయిర్‌టెల్‌లో గూగుల్ పెట్టుబడులు కంపెనీకి మరింత ఉపశమనాన్ని కలిగించాయి. కానీ, డిసెంబర్ త్రైమాసికంలో నికర లాభం 3 శాతం అంటే.. రూ. 854 కోట్ల నుంచి రూ. 830 కోట్లకు పడిపోయినట్టు ఆ సంస్థ పేర్కొంది. దీనినికారణంగాచూపుతూ మరో సారి టారిఫ్ ధరలు పెంచేందుకు ఎయిర్‌టెల్ సిద్ధం అవుతోంది. రాబోవు 3 లేదా 4 నెలల్లో గానీ.. లేదా ఈ ఏడాదిలో ఎప్పుడైనా మొబైల్ టారిఫ్ ధరల పెంపు ఉండవచ్చని ఆ సంస్థ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ప్రస్తుతమున్న 163 రుపాయల యూజర్ సగటు రాబడిని 2022లో 200 రుపాయలకు తీసుకూరావాలని కంపెనీ భావిస్తోందని సమాచారం.
మరోవైపు 2022 లో టారిఫ్ పెంపు ఉండొచ్చని వొడాఫోన్ ఐడియా సీఈవో రవీందర్ టక్కర్ కూడా ఇటీవల అభిప్రాయడ్డారు. గత పెంపు దాదాపు రెండు సంవత్సరాల తర్వాత జరిగిందని, ఈసారి అంత సమయం ఉండదని స్పష్టం చేశారు. మరోవైపు కస్టమర్లు క్రమంగా తగ్గుతుండడం కూడా వొడాఫోన్ ఐడియాకు ఆందోళనగా మారింది. ఈ నేపథ్యంలో ఆర్పూను పెంచుకునేందుకు చార్జీల పెంపే మార్గమని ఆ సంస్థ భావిస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతానికి రిలయన్స్ జియో నుంచి ఎలాంటి సంకేతాలు లేనప్పటికీ.. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా టారిఫ్ ధరలను పెంచితే..జియో సైతం అదే బాటలో నడిచే అవకాశం అధికంగా ఉంది. గత ఏడాది నవంబర్‌లోనూ రోజుల వ్యవధిలోనే మూడు టెలికాం సంస్థలు ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరను పెంచేశాయి. మొత్తంగా చూస్తుంటే ఈ సంవత్సరం మరోసారి మొబైల్ యూజర్లకు చార్జీల షాక్ తగిలేలానే కనిపిస్తోంది.