వ్యాపార ప్రపంచంలో కేఫ్ కాఫీడేకు ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. అయితే 2019లో కేఫ్ కాఫీడే వ్యవస్థాపకులు అయిన వీ.జి సిద్దార్థ ఆత్మహత్య చేసుకోవడంతో ఒక్కసారిగా ఆ పరిశ్రమ కుంగుబాటుకు లోనైంది. ఇక సిద్ధార్థ మరణం తర్వాత బిజినెస్ పగ్గాలు చేపట్టింది ఆయన సతీమణి మాళవిక కృష్ణ. కొద్ది రోజుల్లోనే కంపెనీకి ఉన్న అప్పుల్లో సగం అప్పులను తీర్చి ప్రపంచాన్ని అబ్బురపరిచింది. ఈ నేపథ్యంలోనే బిజినెస్ వరల్డ్ లో ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే? అనుబంధ సంస్థల నుంచి ప్రమోటర్ల కంపెనీలకు నిధులు మళ్లించారనే ఆరోపణలపై కేఫ్ కాఫీడేకు రూ. 26 కోట్ల రూపాయల జరిమానా విధించింది మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ.
కేఫ్ కాఫీడే.. పడిలేచిన ఓ వ్యాపార సామ్రాజ్యం. భర్త మరణంతో వ్యాపార పగ్గాలను చేపట్టింది మాళవిక కృష్ణ. వ్యాపార పగ్గాలు చేపట్టిన అతికొద్ది కాలంలోనే కంపెనీకి ఉన్న సగం అప్పులను తీర్చి ఔరా అనిపించింది. ఇదిలా ఉంటే.. ‘మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు’ కేఫ్ కాఫీ డే పై భారీ జరిమానా పడింది. వివరాల్లోకి వెళితే.. తాజాగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కేఫ్ కాఫీడేకు రూ. 26 కోట్ల జరిమానా విధించింది. ఈ మెుత్తాన్ని 45 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది. కాఫీ డే ఎంటర్ ప్రైజెస్ కు సంబంధించిన ఏడు అనుబంధ సంస్థల నుంచి కాఫీ డే ప్రమోటర్ కు చెందిన మైసూర్ అమాల్గమేటెడ్ కాఫీ ఎస్టేట్ కు రూ. 3,535 కోట్లు మళ్లించినట్లు సెబీ తన దర్యాప్తులో గుర్తించింది. ఈ మెుత్తం లోంచి 2022 సెప్టెంబర్ 30 నాటికి రూ. 110.75 కోట్లను మాత్రమే అనుబంధ సంస్థలు వసూలు చేయగలిగాయని సెబీ పేర్కోంది.
దాంతో అనైతిక వ్యాపార విధానాలు, మోసపూరిత కార్యకలాపాలు, నిబంధనల ఉల్లంఘనలను పరిగణంలోకి తీసుకున్న సెబీ.. రూ. 25 కోట్ల జరిమానా విధించింది. దీనితో పాటుగా నమోదిత, వెల్లడి నిబంధనల ఉల్లంఘనకు గాను మరో రూ. కోటిని విధించింది. అలాగే మైసూర్ అమాల్గమేటెడ్ కాఫీ ఎస్టేట్స్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థల నుంచి రావాల్సిన బకాయిలన్నింటినీ, వడ్డీతో కలిపి వసూలు చేసేందుకు చర్యలు చేపట్టాలని నిర్దేశించింది. సిద్దార్థ మరణం తర్వాత ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న కేఫ్ కాఫీడేకు ఇది పెద్ద దెబ్బగానే అభిప్రాయ పడుతున్నారు వ్యాపార నిపుణులు.