ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్ సర్వీసెస్ తన ఖాతాదారులకు కోలుకోలేని షాకిచ్చింది. ఇప్పటికే రకరకాల చార్జీలను పెంచేసి కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న ఎస్‌బీఐ కార్డ్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
మీరు ఎస్‌బీఐ కార్డు వాడుతున్నారా..? అయితే మీపై ఇక బాదుడు షురూ అయినట్లే. మొదట వివిధ ఆఫర్ల పేరుతో కస్టమర్లకు దగ్గరైన ఎస్‌బీఐ కార్డు రోజులు గడుస్తున్న కొద్దీ ఆ సేవలను కుదిస్తూ వస్తోంది. ఈ మద్యనే రెంట్ పేమెంట్ ఛార్జీల్ని ఏకంగా 100 శాతం పెంచిన ఎస్‌బీఐ కార్డు.. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇది ఎస్‌బీఐ కార్డు వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపనుంది. అదేంటన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ఎస్‌బీఐ కార్డ్స్ మేనేజింగ్ సంస్థ ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్ సర్వీసెస్ నిర్ణయం తీసుకుంది. ఎస్‌బీఐ కార్డు క్యాష్‌బ్యాక్ సర్వీసులలో భారీగా కోతలు విధించేందుకు సిద్ధమైంది. డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంజ్ బెనిఫిట్స్‌ను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్ సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో పాటు జ్యువెల్లరీ, స్కూల్ అండ్ ఎడ్యుకేషనల్ సర్వీసులు, యుటిలిటీస్, ఇన్సూరెన్స్ సర్వీసెస్ కార్డ్స్, మెంబర్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్/క్వాసీ క్యాష్, రైల్వేస్ వంటి సేవలకై చేసే చెల్లింపులపై ఇకపై ఎలాంటి క్యాష్‌బ్యాక్ ఇవ్వబోమని స్పష్టం చేసింది. అంటే ఇకపై ఎస్‌బీఐ కార్డ్‌తో పేమెంట్లకు వీటిలో ఎలాంటి క్యాష్‌బ్యాక్ రాదన్నమాట.
ఇదొక్కటే కాదు.. ఎస్‌బీఐ కార్డ్స్ ఇతర క్యాష్‌బ్యాక్‌ల్లోనూ పెద్ద ఎత్తున కోతలు విధించింది. ఎస్‌బీఐ కార్డ్‌తో ఆన్‌లైన్‌లో అయినా, ఆఫ్‌లైన్‌లో అయినా చెల్లింపులు చేసినప్పుడు ఒక స్టేట్‌మెంట్ సైకిల్‌లో గరిష్టంగా రూ.5 వేల వరకు మాత్రమే క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. దీనిపై పరిమితులు విధిస్తూ తాజాగా ప్రకటన విడుదల చేసింది. కాగా, ఈ ఏడాది మార్చిలో ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్.. రెంట్ పేమెంట్ ఛార్జీల్ని ఏకంగా 100 శాతం పెంచిన సంగతి తెలిసిందే. గతంలో ఇది రూ.99కి అదనంగా పన్నులు ఉండగా.. మార్చి నుంచి రూ.199 ప్లస్ జీఎస్‌టీ అయింది. ఈ నిర్ణయమే కస్టమర్లపై భారం అనుకుంటే ఇప్పుడు ఈ నిర్ణయం మరింత భారం కానుంది.