ఈఎంఐ విధానం వచ్చాక మన దేశంలో ఖరీదైన ఎలక్ట్రానిక్స్, లగ్జరీ వస్తువుల వినియోగం, కొనుగోలు పెరిగింది అంటే అతిశయోక్తి కాదు. ముందు కొనాలి.. తర్వాత నెలకు ఇంత అని ఈఎంఐ చెల్లించాలి. తాజాగా పెళ్లి ఖర్చు కోసం కూడా ఓ కంపెనీ ఈఎంఐ ఆఫర్ ప్రకటించింది. ఆ వివరాలు..
పెళ్లి అంటే ఎంత ఖర్చు ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వివాహం మొదలైన దగ్గర నుంచి డబ్బులు మంచి నీళ్లలా ఖర్చవుతూనే ఉంటాయి. ఇక చాలా మంది అప్పు చేసి అయిన సరే.. గ్రాండ్‌గా వివాహం చేసుకోవాలని భావిస్తారు. జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగే వేడుక కనుక ఎంత ఖర్చు చేయడానికి అయినా వెనకాడరు కొందరు. పెళ్లి ఎంత సింపుల్‌గా చేసుకుందాం అనుకున్నా.. 5 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. కాస్త గ్రాండ్‌గా అంటే 10, 15 లక్షలు ఆ మొత్తం పెరుగుతూనే ఉంటుంది. చాలా మంది యువత మరీ ముఖ్యంగా అబ్బాయిలు.. ఈ ఖర్చు గురించి భయపడే.. వివాహం చేసుకోవాలంటే ఆలోచిస్తారు. కొన్ని బ్యాంక్‌లు లోన్‌లు ఇస్తాయి కానీ ఆ మొత్తం దేనికి సరిపోదు. రోజుల తరబడి వేచి చూడాలి. అయితే ఇక బాధలు లేవు.. మేం లోన్ ఇస్తాం.. ముందు మీరు సంతోషంగా పెళ్లి చేసుకొండి..తర్వాత తీరిగ్గా పే చేయండి అంటూ బంపరాఫర్ ప్రకటించింది ఓ కంపెనీ. ఆ వివరాలు..
ఓ ట్రావెల్ కంపెనీ ఈ బంపరాఫర్‌ను ప్రకటించింది. మ్యారీ నౌ.. పే లేటర్ అనే ఆప్షన్‌ను తీసుకువచ్చింది. ట్రావెల్ కంపెనీ ఫిన్‌టెక్ సంస్థ.. సంకష్, రాడిసన్ హోటల్స్ భాగస్వామ్యంతో మ్యారీ నౌ.. పే లేటర్ స్కీమ్‌ను ప్రారంభించింది. దేశంలో పెరుగుతున్న వివాహ మార్కెట్ ట్రెండ్‌ను అందిపుచ్చుకోవడం కోసం ఈ ఆఫర్‌ను ప్రకటించింది. మ్యారీ నౌ పే లేటర్ పథకం ప్రస్తుతం రాడిసన్ హోటల్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. అది కూడా రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రమే. ఇక త్వరలోనే ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని ప్రముఖ ప్రదేశాలతో పాటు జైపూర్, చండీగఢ్, పుణెలోని హోటళ్లలో కూడా ఈ స్కీమ్‌ను ప్రారంభించనున్నారు. దశలవారీగా దేశ వ్యాప్తంగా దీన్ని ప్రారంభించాలని భావిస్తున్నారు.
ఈ సందర్భంగా సంకాష్ సహ వ్యవస్థాపకుడు సీఈవో ఆకాష్ దహియా మాట్లాడుతూ.. ‘‘ఈ ఏడాది చివరి నాటికి రాడిసన్ హోటల్స్‌లో ఈ ఆఫర్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ స్కీమ్ గురించి కనుక్కోవడానికి రోజుకు సగటున 50కి పైగా కాల్స్, ఎంక్వయిరీలు వస్తున్నాయి. ఇక గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు పేరు గాంచిన రాజస్థాన్, ఆగ్రా తదితర చోట్ల ఈ ప్రత్యేక ఆఫర్‌ను అందించడంపై ప్రస్తుతానికి దృష్టి పెట్టాం’’ అని తెలిపాడు.
తమ వివాహం కారణంగా కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురు కాకూడదని భావించే వారికి ఇది బాగా ఉపయోగపడుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి ఈ ఆఫర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.