కరోనా మహమ్మారి సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రంగాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. ఎందరో ఉపాధి కోల్పోయారు. మరెందరో అయినవారిని పోగొట్టుకొని అనాథలుగా మారారు. ఇంతటి క్లిష్ట సమయంలోనూ ఒక వెలుగు వెలిగింది అంటే ఐటీ రంగం మాత్రమే. ఎన్నో కొత్త నియామకాలు చేపట్టి ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందించింది. ఇంతటి ప్రగతి సాధించిన ఐటీ రంగం నేడు తీవ్ర సంక్షోభంతో అతలాకుతలమయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఒక్క మన దేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇదే సమస్య.
ఇటీవల ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఎడాపెడా తీసివేస్తున్న ఘటనలు ఎక్కువయ్యాయి . అమెజాన్ మొదలుకుని ట్విట్టర్ వరకూ ఇదే దారిలో వెళుతున్నాయి. తొలుత మూన్‌లైటింగ్, ఆ తర్వాత బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్, ప్రస్తుతం కాస్ట్ కటింగ్.. ఇలా కారణాలు ఏవైనా ఐటీ రంగంలో ఉద్యోగాల కోతల కాలం నడుస్తోంది. తాజాగా మరో దిగ్గజ ఐటీ కంపెనీ కూడా ఇదే బాటలో వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అమెరికా దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఒకటైన ‘సిస్కో’ భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధపడినట్లు వార్తలొస్తున్నాయి. ఒకేసారి 4,100 ఉద్యోగులను తీసేయాలని సిస్కో నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనంతటికి కారణం ఐటీ రంగం మాంద్యం దిశగా అడుగులు వేస్తుండడమే అని నిపుణులు చెప్తున్నారు. 2008 నాటి గడ్డు పరిస్థితులు మరోసారి పునరావృతమయ్యే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వీస్తున్న మాంద్యం గాలులు ఐటీరంగాన్ని నేరుగా తాకాయి. రానున్న 6 నెలల నుంచి ఏడాది లోపు ఐటీరంగానికి ఎక్కువగా మాంద్యం తీవ్రత ఉంటుందని ప్రపంచ దేశాల సీఈఓలు హెచ్చరిస్తున్నారు. ఇటీవల అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ బహిరంగంగానే మాంద్యంపై భయం వ్యక్తం చేశారు. ఎడాపెడా అప్పులు చేసి చేతులు కాల్చుకోవద్దని కంపెనీలను, ప్రజలను హెచ్చరించారు. వీటిని దృష్టిలో పెట్టుకొని టెక్ కంపెనీలు ఇప్పటికే దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టాయట. అందులో భాగంగానే ఉద్యోగులను తొలగించడంలో తమ వ్యూహాలను అమలుపరుస్తున్నాయన్నని నిపుణులు చెప్తున్నారు.