ప్రస్తుతం ప్రపంచమంతా డిజిటల్ నగదుపైనే నడుస్తుండడంతో అందరూ బ్యాంకుల మీదే ఆధారపడుతున్నారు. ఒకప్పుడు డబ్బు దాచుకోవాలంటే బీరువాల్లో దాచుకునేవారు. ఇప్పుడు బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి దాచుకోవాల్సిన పరిస్థితి. అయితే చాలా మంది ఎదుర్కునే సమస్య. ఉన్నట్టుండి బ్యాంకులో డబ్బులు కట్ అయిపోతాయి. చాలా మందిని వెంటాడుతున్న సమస్య ఇదే. కొన్ని బ్యాంకులు లావాదేవీలు ఎక్కువ జరిపినందుకు బల్క్ ఛార్జెస్ పేరుతో కొంత డబ్బు కట్ చేస్తాయి. కొన్ని బ్యాంకులు ఏటీఎం విత్ డ్రా పరిమితి దాటితే సర్వీస్ ఛార్జెస్ వసూలు చేస్తాయి. ఈ క్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తమ ఖాతాదారుల నుంచి కొంత అమౌంట్ ని కట్ చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఉన్నట్టుండి సడన్ గా తమ ఖాతా నుంచి రూ. 147.50 డెబిట్ అయినట్లు గుర్తించిన ఎస్బీఐ ఖాతాదారులు.. ఎందుకిలా కట్ అయ్యాయో అని ఆందోళన చెందుతున్నారు. అయితే బ్యాంకులు ఖాతాదారులకు అందించే వివిధ సేవలకు గాను కాలానుగుణంగా కొన్ని ఛార్జీలను వసూలు చేస్తాయి. డిజిటలైజేషన్ పెరగడంతో ఎస్బీఐ కూడా ఖాతాదారులకు అందించే సేవలకు ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించుకుంది. ఎస్బీఐ డెబిట్ కార్డు కోసం వార్షిక నిర్వహణ రుసుముగా రూ. 147.50 వసూలు చేస్తోంది. డెబిట్ కార్డులతో ఏటీఎంలలో నగదు విత్ డ్రా చేసుకోవడం, ఆన్ లైన్ షాపింగ్ చేయడం వంటివి చేస్తుంటారు.
ఈ సేవ అందిస్తున్నందుకు గాను స్టేట్ బ్యాంక్ ఛార్జీలు వసూలు చేస్తుంది. ఎస్బీఐ బ్యాంక్ తమ ఖాతాదారులకు రకరకాల డెబిట్ కార్డులను అందజేస్తుంది. క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్ లెస్, యువ, గోల్డ్, కాంబో, మై కార్డ్ వంటి డెబిట్ కార్డులు ఉన్నాయి. డెబిట్ కార్డులను బట్టి ఛార్జీలు ఉంటాయి. క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్ లెస్ డెబిట్ కార్డులకు వార్షిక నిర్వహణ రుసుము కింద రూ. 125. 18 శాతం జీఎస్టీ రూ. 22 తో కలిపి రూ. 147.50 వసూలు చేస్తారు.
ఇక యువ, గోల్డ్, కాంబో, మై కార్డ్ డెబిట్ కార్డుల నిర్వహణ కోసం వార్షిక రుసుము కింద.. రూ. 175, జీఎస్టీ రూ. 31.50 కలిపి మొత్తం రూ. 206.50 వసూలు చేస్తుంది. ప్లాటినం డెబిట్ కార్డుకి రూ. 250, జీఎస్టీ రూ. 45.. మొత్తం రూ. 295 వసూలు ఛార్జ్ చేస్తుంది. ప్రైడ్/ప్రీమియం బిజినెస్ డెబిట్ కార్డు మీద రూ. 350, జీఎస్టీ రూ. 63తో కలిపి రూ. 413 వసూలు చేస్తుంది. అయితే ఈ ఛార్జీలు ఏడాదికి ఒకసారి మాత్రమే ఉంటాయి. ప్రతి నెలా ఈ ఛార్జీలు ఉండవు. కాబట్టి ఖాతాదారులు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఒకవేళ కొత్త డెబిట్ కార్డు పొందాలన్నా లేక పాత డెబిట్ కార్డుని మార్చుకోవాలనుకుంటే రూ. 300, జీఎస్టీ రూ. 54తో కలిపి రూ. 354 చెల్లించాల్సి ఉంటుంది.