హైదరాబాద్ లో స్థలం కొనాలంటే కొనలేని పరిస్థితి. స్థలం కొనలేకపోతున్నామని బాధపడకండి. హైదరాబాద్ లో కొనడం కంటే ఏపీలో డెవలప్ కానున్న ఏరియాలో కొనడం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ ధరలు చాలా తక్కువ పలుకుతున్నాయి. అయితే ఏడాదిలో 25 శాతం వృద్ధి రేటు ఉంటుందని చెబుతున్నారు. ఇది హైదరాబాద్ లో హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ఏరియాల్లో ఫ్లాట్ ధరలు పెరుగుతున్న వృద్ధి రేటు కంటే ఎక్కువ.
హైదరాబాద్ అంటే మనకి గుర్తొచ్చేది హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ఇవే కదా. ఈ ఏరియాల్లో స్థలాల కొనుగోళ్లు తగ్గిపోయాయి. అలానే ఇళ్ల కొనుగోళ్లు కూడా తగ్గిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య తక్కువగా ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. అందరూ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనే స్థలాలు, ఇల్లు, ఫ్లాట్ లు కొనుగోలు చేస్తున్నారు. దీంతో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ తగ్గుముఖం పట్టింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్ లో కొనడం కంటే ఏపీలో ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయడం ఉత్తమమని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఏపీ రూపురేఖలు మారబోతున్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ముఖచిత్రం మారనుందని అంటున్నారు.
ఒకప్పుడు ఉత్తరాంధ్ర అంటే వలసలు గుర్తొచ్చేవి. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి పూర్తిగా మారనుంది. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఉత్తరాంధ్రకు కేంద్ర బిందువుగా మారనుంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగుతాయి. రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర ఐటీ హబ్ గా మారనుంది. అలానే అదానీ డేటా సెంటర్ తో రాష్ట్ర ముఖ చిత్రమే మారిపోనుంది. గత నెలలో ఏపీ సీఎం వైఎస్ జగన్ విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. మొత్తం రూ. 4,592 కోట్ల వ్యయంతో 2,203 ఎకరాల విస్తీర్ణంలో జీఎంఆర్ సంస్థ ప్రతిష్టాత్మకంగా ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తోంది. ఈ ఎయిర్ పోర్ట్ వస్తే దేశీయ, అంతర్జాతీయ రవాణా సదుపాయం పెరుగుతుంది.
హైదరాబాద్ లో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించిన తరహాలోనే అత్యున్నత ప్రమాణాలతో భోగాపురం ఎయిర్ పోర్ట్ ని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభమవ్వడం మరియు ఇతర అభివృద్ధి కార్యకలాపాలు మొదలవ్వడంతో.. విజయనగరం మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ ఏడాదిలో రియల్ ఎస్టేట్ వేగంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా-ఏపీ ఛాప్టర్ స్టేట్ జనరల్ సెక్రటరీ కె. సుభాష్ చంద్రబోస్ చెప్పిన దాని ప్రకారం.. కనీసం 25 శాతం పెరుగుదల అయితే కనిపిస్తుందని అన్నారు. విజయనగరం జిల్లాలో ఇప్పుడు ల్యాండ్ కొన్నవారికి తక్కువ సమయంలో భారీ లాభాలు పొందే అవకాశం ఉంటుంది.
ఈ ఏరియాలో చదరపు అడుగు స్థలం రూ. 1000, రూ. 1300, రూ. 2 వేల మధ్యలో ఉన్నాయి. భోగాపురంలో అయితే సగటున చదరపు అడుగు రూ. 1,550 పలుకుతోంది. అంటే గజం రూ. 13,950 ఉంది. 150 గజాల స్థలం కొనుగోలు చేస్తే రూ. 20,92,500 అవుతుంది. రియల్ ఎస్టేట్ కనీసం 25 శాతం వృద్ధి చూసుకుంటే.. ఆ రూ. 20 లక్షల పెట్టుబడి కాస్తా రూ. 25,50,000 అవుతుంది. అంటే నిపుణులు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే కనీసం రూ. 5 లక్షలు లాభం ఉంటుంది. ఒక్కసారి ఎయిర్ పోర్ట్ లాంఛ్ అయితే భూముల ధరలకు రెక్కలు వస్తాయి. అప్పుడు కొనాలన్నా కొనలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి విజయనగరంలో ముఖ్యంగా భోగాపురం చుట్టుపక్కల గ్రామాల్లో పెట్టుబడి పెడితే హైదరాబాద్ లో పెట్టినట్టే.
గమనిక: ఈ కథనం అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. పైన చెప్పిన వాటిలో మార్పులు ఉండచ్చు. అలానే ప్రాపర్టీ కొనే ముందు నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాల్సిందిగా మనవి.