అసంఘటిత రంగాల్లోని కార్మికులకు సామాజిక ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2019లో ఈ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం పేరు.. ‘ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన‘. ఈ పథకం కింద లబ్ధిదారునికి రూ. 60 ఏళ్లు నిండిన తర్వాత ప్రతి నెలా 3000 రూపాయలు పెన్షన్ రూపంలో అందిస్తారు. అలాగే, లబ్ధిదారుని మరణానంతరం పెన్షన్‌లో 50% లబ్ధిదారుని జీవిత భాగస్వామికి కుటుంబ పెన్షన్‌గా ఇవ్వబడుతుంది. ఈ పథకంలో ఎలా చేరాలి? ఏయే రంగాల వారు అర్హులు? అన్నది ఇప్పుడు చూద్దాం..
పీఎం శ్రమ్ యోగి మాన్ ధన్ స్కీమ్‌లో చేరాలని భావించే వారు ఒక విషయం తప్పక తెలుసుకోవాలి. వయసు ప్రాతిపదికన ప్రతి నెలా కొంత మేర డబ్బులు కడుతూ వెళ్లాలి. ఈ మొత్తం నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు ఉంటుంది. మీరు ఏ వయసులో ఈ స్కీమ్‌లో చేరారనే అంశం ప్రాదిపదికన మీరు చెల్లించాల్సిన మొత్తం ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు 18 ఏళ్ల వ్యక్తి పాలసీ తీసుకుంటే రోజుకు రూ. 2 చెల్లించాల్సి ఉంటుంది. అంటే 18 ఏళ్ల వయసులో చేరితే నెలకు రూ.55, అదే 40 ఏళ్లలో చేరితే నెలకు రూ.200 చెల్లించాలి. ఇలా కడుతూపోయాక 60 ఏళ్లు నిండాక ప్రతి నెల పెన్షన్ అందిస్తారు. దీని వల్ల లబ్ధిదారులకు వయసు మల్లిన తర్వాత ఆర్థిక భద్రత ఉంటుందని చెప్పుకోవచ్చు. డబ్బులు నేరుగా వారి వారి బ్యాంక్ ఖాతాల్లోనే జమ అవుతాయి.
నెలకు రూ.15 వేల లోపు ఆదాయం పొందుతూ..18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న అసంఘటిత రంగాల కార్మికులు ఈ పథకానికి అర్హులు. అంటే.. వీధి వర్తకులు, వ్యవసాయ కార్మికులు, రిక్షా డ్రైవర్లు, నిర్మాణ కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఇటుక బట్టీ కార్మికులు, చెప్పులు కుట్టేవారు, రాగ్ పికర్స్, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, తోలు కార్మికులు.. మొదలైన అసంఘటిత రంగ కార్మికులు అర్హులు అన్నమాట.
ఈ పథకంలో చేరాలని భావించే వారు మాన్ ధన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదా దగ్గరిలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి, అవసరమైన డాక్యుమెంట్లు అందించి పథకంలో చేరొచ్చు. ఆధార్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ తప్పనిసరి.