ప్రపంచంమంతా డిజిటల్ మయం అవుతోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని పుచ్చుకొని అబివృద్ది వైపు పరుగులు పెట్టడమే కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాం. ఈ క్రమంలో నగదు చలామణికి ప్రత్యామ్నాయంగా భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) తీసుకొచ్చిన డిజిటల్ రూపాయి అందుబాటులోకి వస్తోంది. ఈ మేరకు ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. పైలట్ ప్రాజెక్టు ప్రాతిపదికన డిసెంబర్ 1 నుంచి డిజిటల్ కరెన్సీని ప్రారంభించనున్నట్టు ప్రకటించింది.
దేశంలో చలామణిలో ఉన్న పేపర్ కరెన్సీ, నాణేల మాదిరిగానే.. దీనికీ విలువ ఉంటుంది. వినియోగదారులు, వ్యాపారులకు.. బ్యాంకుల ద్వారా వీటిని పంపిణీ చేస్తారు. బ్యాంకులు అందించే డిజిటల్ వాలెట్ ద్వారా.. ఈ రూపాయితో లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. లేకపోతే.. మొబైల్ ఫోన్లు, ఇతర పరికరాల్లోనూ నిల్వ చేసుకోవచ్చు. చివరికి.. వ్యక్తి, వ్యాపారి మధ్య కూడా ఈ డిజిటల్ రూపాయితో లావాదేవీలు జరుపుకోవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఎలాగైతే ప్రస్తుతం క్యూఆర్ కోడ్ ద్వారా ఆన్ లైన్ లావాదేవీలు జరుగుతున్నాయో.. అదే తరహాలోనే ఈ రూపాయితో చెల్లింపులు జరుపుకోవచ్చు.
దేశంలో డిజిటల్ లావాదేవీలు పెంచడంతోపాటు భౌతిక కరెన్సీ నిర్వహణకు అయ్యే ఖర్చును తగ్గించుకోవడంలో భాగంగా ఆర్‌బీఐ ఈ డిజిటల్ రూపాయి తీసుకొస్తోంది. ఆలా అని ఇది క్రిప్టో కరెన్సీ కాదు. బిట్‌కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీల మాదిరిగా డిజిటల్ రూపాయిని మైనింగ్ చేయలేరు. డిజిటల్ రూపాయి వర్చువల్ కరెన్సీ కాబట్టి దానికి ఎటువంటి రిస్క్ ఉండదు. దీన్ని ఆర్‌బీఐ జారీ చేస్తుంది. బ్యాంకులు పంపిణీ చేస్తాయి. దీన్ని సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)గా వ్యవహరిస్తారు.
Operationalisation of Central Bank Digital Currency – Retail (e₹-R) Pilothttps://t.co/Coh632lCwU
— ReserveBankOfIndia (@RBI) November 29, 2022
పైలట్ ప్రాజెక్టులో భాగంగా..ముందుగా ముంబయి, ఢిల్లీ, భువనేశ్వర్, బెంగళూరు నగరాల్లో మాత్రమే ఈ డిజిటల్ రూపాయిని అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ఆర్బీఐ పేర్కొంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,హెచ్డీఎఫ్సీ, కోటక్ మహీంద్రా బ్యాంకులకు ఈ-రూపాయిని విస్తరించనున్నట్టు వెల్లడించింది. దశల వారీగా.. ఇతర నగరాలకు కూడా విస్తరించనున్నట్లు తెలిపింది. అనంతరం దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ దీనిని అందబాటులోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నట్టు రిజర్వు బ్యాంకు వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న కరెన్సీ నోట్లకు ఇది ప్రత్యామ్నాయం కాదు. ప్రస్తుతం ఉన్న నగదు కూడా కొనసాగుతుంది. అదనపు చెల్లింపు అవకాశాలను కల్పించడానికే సీబీడీసీని తీసుకొచ్చినట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది.
#RBI digital rupee to launch tomorrow#DigitalRupee #Banking
Here’s a list of banks offering digital wallet transaction:https://t.co/4plh6jJvqb
— Zee News English (@ZeeNewsEnglish) November 30, 2022