పల్లెటూరులోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ లక్షలు సంపాదించుకునే అవకాశం ఉంది. తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం పొందవచ్చు. అదెలాగో చూసేయండి.
పల్లెటూర్లలో ఉండి, సొంతంగా భూమి ఉన్న వారికి ఈ వ్యాపారం బాగా ఉపయోగపడుతుంది. వ్యవసాయమే అయినా ఇది సరిగ్గా చేస్తే రైతులకు లాభసాటి వ్యాపారం అవుతుంది. మంచి కమర్షియల్ బిజినెస్ ఇది. బొప్పాయి సాగు గురించి తెలిసే ఉంటుంది. ఫిబ్రవరి-మార్చి నెలల్లో గానీ.. జూన్-జూలై నెలల్లో గానీ.. అక్టోబర్-నవంబర్ నెలల్లో గానీ బొప్పాయి పంట వేస్తారు. ఈ కాలాల్లో అయితేనే బొప్పాయి సాగుకి అనుకూలంగా ఉంటుంది. ఒక మూడు లక్షలు పెట్టుబడి పెట్టుకుంటే ఏడాదిలోనే పెట్టుబడి తీసేయగా అదనంగా రూ. 3 లక్షలు లాభం పొందవచ్చు. బొప్పాయి సాగు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఎకరం భూమిలో ఎన్ని మొక్కలు పడతాయి? ఎంత ఆదాయం ఉంటుంది? లాభమెంత? వంటి వివరాలు మీ కోసం.
బొప్పాయి పంట వేయడం నుంచి దిగుబడి వచ్చేంత వరకూ మొత్తం ఖర్చు రూ. 2,42,500 నుంచి రూ. 2,47,500 అవుతుంది. మొక్కకి మొక్కకి మధ్య 1.8 x 1.8 మీటర్ దూరం ఉండేలా నాటాలి. అంటే 6 అడుగుల దూరం ఉండాలి. లేదంటే 1.5 x 1.5 మీటర్ దూరం అంటే 5 అడుగుల దూరం ఉండేలా నాటుకోవచ్చు. ఒక ఎకరానికి ఆరడుగుల గ్యాప్ ఇస్తే 1500 మొక్కలు పడతాయి. 5 అడుగుల గ్యాప్ ఇస్తే 1700 మొక్కలు పడతాయి. మొక్కలు నాటిన 9వ నెల నుంచి పంట చేతికొస్తుంది. రెండున్నర సంవత్సరాల వరకూ దిగుబడి ఉంటుంది. 2 నెలలకొకసారి దిగుబడి ఉంటుంది. అంటే మొక్కలు నాటిన 11 నెలలు ఎలాంటి ఆదాయం ఉండదు కానీ 11 నెలలో చేతికి పెట్టిన పెట్టుబడి వచ్చేస్తుంది.
ఎకరంలో 1500 మొక్కలు వేస్తే ఒక్కో మొక్క యావరేజ్ గా 20 నుంచి 40 కాయలను ఇస్తుంది. అంటే ఒక్కో చెట్టు 20 కిలోల దిగుబడి ఇచ్చినా గానీ 1500 చెట్లకు 30 వేల కిలోలు (30 టన్నులు) కాయలు ఇస్తుంది. బయట మార్కెట్లో కిలో బొప్పాయి రూ. 20 ఇస్తారు. అంటే 30 టన్నులకు రూ. 6 లక్షలు ఆదాయం వస్తుంది. ఇందులో పెట్టుబడి రూ. 3 లక్షలు తీసేసినా గానీ రూ. 3 లక్షలు లాభం ఉంటుంది. 9వ నెలలో కాపు కాయడం మొదలుపెట్టాక ప్రతీ 2 నెలలకొకసారి దిగుబడి వస్తూనే ఉంటుంది. ఇలా రెండున్నరేళ్ల వరకూ దిగుబడి వస్తూనే ఉంటుంది. ఈ ఆదాయమే కాకుండా.. అంతర్గత పంటలు వేసుకోవచ్చు. కూరగాయలు లాంటివి వేసుకుంటే అదనంగా కొంత ఆదాయం సమకూరుతుంది. కష్టపడడం, మంచి ఎరువు వేసి మొక్కలను బాగా చూసుకుంటే ఆశించిన ఫలితం ఉంటుంది. పొలం చుట్టూ గ్రీన్ నెట్ పెట్టించుకుంటే మొక్కలు గాలికి పడిపోకుండా ఉంటాయి.
గమనిక: పైన తెలుపబడిన వివరాల్లో మార్పులు ఉండవచ్చు. ఆయా ప్రాంతాల వారీగా కాస్ట్ అనేది ఉంటుంది. పెట్టుబడి వ్యయం పెరగొచ్చు, తగ్గచ్చు. అలానే పంట వేసే ముందు అనుభవజ్ఞుల సూచనలు, సలహాలు తీసుకోవాల్సిందిగా మనవి.