మార్చి 8.. సృష్టి గతిని, స్థితిని మార్చివేసిన మహిళ రోజు ఈరోజు. అలాంటి మహిళ బాగుంటే లోకం బాగుంటుంది. మరి మహిళల కోసం, మీ కోసం ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా?
ఈరోజు మహిళలు కూడా అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారు. ఉద్యోగ బాధ్యతలను, కుటుంబ బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ అద్భుతంగా రాణిస్తున్నారు. దీని కోసం ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తున్నాయి. మహిళలు అన్ని విధాలుగా అన్ని రంగాల్లో మగాళ్లతో పాటు సమానంగా ఎదగాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది.
ఈ క్రమంలో అనేక పథకాలను కూడా తీసుకొచ్చింది. ముఖ్యంగా మహిళల ఆర్థిక స్వాతంత్య్రం కోసం, మహిళా సాధికారిత కోసం ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోంది. కానీ చాలా మందికి ఆ పథకాల గురించి సరైన అవగాహన లేదు. దీని వల్ల కొంతమంది మాత్రమే ప్రయోజనం పొందుతున్నారు. మరి మహిళల కోసం భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ఆ పథకాలు ఏంటో తెలుసుకోండి.
మగవారిలా మహిళలు కూడా వ్యాపారం చేసి వృద్ధిలోకి వచ్చేందుకు కావాల్సిన ఆర్థిక సహకారాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. సొంతంగా వ్యాపారం చేయాలనుకునే మహిళలకు భారతీయ మహిళా బ్యాంకు బిజినెస్ లోన్ ఇస్తోంది. మహిళల నేతృత్వంలో నడిచే తయారీ కంపెనీలకు ఈ పథకం కింద రూ. 20 కోట్ల వరకూ రుణాన్ని అందజేస్తారు. మైక్రో, చిన్న తరహా పరిశ్రమలకు రూ. కోటి వరకూ ఎలాంటి తనఖా లేకుండా రుణాన్ని అందిస్తారు. వడ్డీ రేటు 10.15 శాతం ఉంటుంది.
కేటరింగ్ బిజినెస్ చేయాలనుకునే మహిళల కోసం అన్నపూర్ణ పథకం పేరుతో ప్రభుత్వం రూ. 50 వేల వరకూ రుణాలను అందిస్తోంది. ఈ డబ్బుతో వంట పాత్రలు, వంట సామాగ్రి సహా ఇతర వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చు. బ్యాంకుని బట్టి, ప్రాంతాన్ని బట్టి వడ్డీ రేటులో మార్పు ఉంటుంది. ఈ లోన్ ని మూడేళ్ళ లోపు ఎప్పుడైనా చెల్లించవచ్చు.
ట్రేడ్ రిలేటెడ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ అసిస్టెన్స్ అండ్ డెవలప్మెంట్ స్కీం ఒకటి ఉంది. ఈ పథకం ద్వారా మహిళలకు ఉత్పత్తుల తయారీ, సేవలు, వ్యాపార రంగాల్లో కావాల్సిన ఋణం, శిక్షణ వంటి సహకారాన్ని ప్రభుత్వం అందిస్తోంది. మొత్తం ప్రాజెక్టు ఖర్చులో 30 శాతం వరకూ ప్రభుత్వం గ్రాంట్ కింద అందజేస్తుంది.
ఉద్యోగం చేసే మహిళల కోసం ప్రత్యేకంగా వర్కింగ్ ఉమెన్ హాస్టల్ పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. వారి పిల్లల సంరక్షణ కోసం ఈ వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ లో ఏర్పాట్లు ఉంటాయి. నెల ఆదాయం రూ. 50 వేల కంటే తక్కువ ఉన్న మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
2017లో కేంద్ర ప్రభుత్వం మహిళా శక్తి కేంద్రాలు అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా మహిళలకు కావాల్సిన నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ఆయా ప్రాంతాల్లో మహిళా శక్తి కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి కావాల్సిన దాంట్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగం, ఉపాధి అవకాశం కలిపిస్తోంది ప్రభుత్వం.
ఈ మహిళా ఈ హాత్ పథకాన్ని 2016లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పథకాన్ని కేంద్ర శిశు, మహిళాభివృద్ధి శాఖ పర్యవేక్షిస్తోంది. ఇది ఒక ద్విభాషా మార్కెటింగ్ ప్లాట్ ఫామ్. మహిళా వ్యాపారవేత్తలు, స్వయం సహాయక సంఘాలు, లాభాపేక్ష లేనటువంటి సంస్థలు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునేందుకు ఏర్పాటు చేయబడిన వేదిక ఈ మహిళా ఈ హాత్.
ఆల్రెడీ వ్యాపారం చేసే మహిళలు తమ వ్యాపారాన్ని మరింత విస్తరించాలి అనుకుంటే గనుక వారికి స్త్రీ శక్తి పథకం కింద ఎస్బీఐ బ్యాంకు రూ. 50 లక్షల వరకూ పర్సనల్ లోన్ ఇస్తుంది. అయితే ఈ వ్యాపారంలో మహిళల వాటా కనీసం 50 శాతం ఉండాలి. ఎలాంటి తనఖా లేకుండా రూ. 5 లక్షల వరకూ రుణమిస్తారు. మహిళా దరఖాస్తుదారు క్రెడిట్ హిస్టరీ, వ్యాపార అవసరాలను బట్టి తీసుకునే రుణంపై వడ్డీ రేటు మారుతుంది. ఈ రుణాన్ని ఏడాది నుంచి ఐదేళ్లలోపు చెల్లించాలి.
చిన్న చిన్న వ్యాపారాలను చేయాలనుకునే మహిళల కోసం ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ ఈ కామర్స్ ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద ఒక్కో మహిళకు రూ. 25 లక్షల వరకూ ఎలాంటి తనఖా లేకుండా లోన్ ఇస్తారు. ఇవే కాకుండా ముద్ర లోన్, డేనా శక్తి పథకం, మహిళా ఉద్యమ్ నిధి యోజన, సెంట్ కళ్యాణి యోజన, ప్రధానమంత్రి రోజ్ గార్ యోజన, ఉద్యోగిని స్కీం, సింధ్ మహిళా శక్తి పథకం ఇలా మహిళల కోసం ఎన్నో పథకాలు అమలులో ఉన్నాయి.
సాధారణ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ఫీచర్లతో పాటు మహిళల కోసం పలు ప్రత్యేక ప్రయోజనాలను ప్రభుత్వ రంగ బ్యాంకులు కల్పిస్తాయి. మహిళల ఆర్థిక సాధికారితకు అనుగుణంగా ప్రయోజనాలను సవరిస్తూ ఉంటాయి. ప్రత్యేక సందర్భాల్లో రాయితీలు, రివార్డులు అందజేస్తాయి. షాపింగ్, ఫుడ్, వెల్ నెస్, ఎంటర్టైన్మెంట్ వంటి వాటిలో మహిళల కోసం ప్రత్యేక ఆఫర్లు అందజేస్తారు.
రుణాలకు సంబంధించి వడ్డీ రేట్లలో కొంత రాయితీని కూడా ఇస్తాయి బ్యాంకులు. అలానే పిల్లల కోసం మహిళలు ప్రత్యేకంగా జూనియర్ ఖాతా తెరిచే అవకాశం కూడా ఉంటుంది. పొదుపు ఖాతాకు అనుసంధానంగా రికరింగ్ డిపాజిట్, సిప్ చేసినవారికి కొన్ని బ్యాంకులు నెల కనీస బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయాలన్న నిబంధనలను వర్తింపజేయడం లేదు.
మహిళలకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేటులో చాలా వరకూ బ్యాంకులు రాయితీనిస్తున్నాయి. సందర్భాన్ని బట్టి 0.05 శాతం నుంచి 0.5 శాతం వరకూ రుణాలపై డిస్కౌంట్ పొందే వీలు ఉంటుంది. గృహ రుణం తీసుకుంటే ఈ ప్రయోజనం ఉంటుంది. ఉమ్మడిగా తీసుకునే రుణాల్లో ప్రధాన దరఖాస్తుదారుగా మహిళ ఉంటే వడ్డీ రేటు తగ్గుతుంది. కొన్ని బ్యాంకులు మహిళలు తీసుకునే కారు లోన్ పై కూడా వడ్డీ రేటు తగ్గిస్తున్నాయి. వడ్డీ రేటులోనే కాదు.. లోన్ ప్రాసెసింగ్ ఫీజులోనూ కొన్ని బ్యాంకులు మినహాయింపునిస్తున్నాయి.
కుటుంబం కోసం అలుపెరగని బాటసారిలా నిరంతరం శ్రమించే మహిళల భద్రత కోసం బీమా తప్పనిసరి. మహిళలు ఖచ్చితంగా బీమా పాలసీ తీసుకునేలా ప్రోత్సహించడం కోసం పలు బీమా కంపెనీలు ప్రీమియంలో తగ్గింపునిస్తున్నాయి. పురుషులతో పోలిస్తే మహిళల కోసం ప్రవేశపెట్టిన ఆరోగ్య, జీవిత బీమా పాలసీలకు సంబంధించి ప్రీమియం తక్కువగా ఉన్నాయి.
సుకన్య సమృద్ధి యోజన పథకంతో ఆడపిల్లలు ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. ఈ పథకం ద్వారా ఆడపిల్లల భవిష్యత్తు బంగారం అవుతుంది. ఇది ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం. ప్రభుత్వ మద్దతుతో నడిచే పథకం. ఈ పథకంలో నెలకి, ఏడాదికి ఇంత అని పెట్టుబడి పెడితే పిల్లలు ఎదిగే నాటికి మంచి సొమ్ము ఇస్తుంది. ఈ పథకంపై ప్రస్తుతం ప్రభుత్వం 7.60 శాతం వడ్డీ ఇస్తుంది.
బాలికలకు పదేళ్ల వయసు వచ్చే వరకూ ఏ సంవత్సరంలో అయినా ఈ ఖాతా తెరవచ్చు. 21 ఏళ్ళు పూర్తయిన తర్వాత బాలికకు మెచ్యూరిటీ సొమ్ము వస్తుంది. ఆ సొమ్ము బాలిక ఉన్నత చదువుల కోసం ఉపయోగపడుతుంది. ఒక బాలికకు ఒక ఖాతా మాత్రమే తెరిచే అవకాశం ఉంటుంది. ఒక కుటుంబం నుంచి ఇద్దరు బాలికలకు మాత్రమే ఖాతా తెరిచే వీలు ఉంటుంది. ఈ ఖాతాను పోస్టాఫీస్ లేదా అనుమతి ఉన్న ఏ బ్యాంకులో అయినా తెరవచ్చు. ఖాతాను తెరవడానికి బాలిక జనన ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది.
ఇవే మహిళల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, ప్రయోజనాలు. స్వయంశక్తితో ఎదగాలి, వ్యాపారం చేసి వృద్ధిలోకి రావాలి అని ఆలోచించే మహిళలు ఈ పథకాల ద్వారా లబ్ది పొందండి. ఆర్థికంగా ఎదిగేందుకు ఈ పథకాలు మీకు ఉపయోగపడతాయి. మీకు తెలిసిన మహిళా స్నేహితులకు, మహిళలకు ఈ పథకాల గురించి చెప్పండి. వారి ఆర్థిక ఎదుగుదలకు తోడ్పడండి. మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి మహిళా సాధికారిత కోసం, మహిళలు ఆర్థిక తోడ్పాటు కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకాలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.