ప్రస్తుతం చాలా మంది ఉద్యోగం కన్నా సొంత వ్యాపారం ప్రారంభించేందుకు ఎక్కువుగా ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు ప్రస్తుతం స్టార్టప్ బూమ్ నడుస్తుండటంతో వారి కలలను నిజం చేసుకోవటానికి అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. కాకుంటే.. పెట్టుబడి పెట్టేందుకు ఆర్థిక స్తోమత సరిపోక కొందరు వెనుకడుగు వేస్తుంటారు. ఒకవేళ అప్పో.. సొప్పో.. చేసి పెట్టుబడి పెట్టినా.. మొదటి రెండు, మూడేళ్ళలో వారనుకున్న లాభాలు రాకపోతే.. వెంటనే ఆ బిజినెస్ మూసేస్తున్నారు. వీటన్నిటికీ చక్కని పరిష్కారం చూపే దిశగా గూగుల్ అడుగులు వేసింది. ‘గూగుల్ స్టార్టప్ స్కూల్’ పేరిట స్టార్టప్ కంపెనీలకు గైడ్ చేసేందుకు ముందుకొచ్చింది.
‘స్టార్టప్ స్కూల్’ అనేది ప్రారంభ కంపెనీలకు అవసరమైన అన్ని వ్యూహాలు సమకూర్చడంతో పాటు స్టార్టప్ వ్యవస్థాపకులను సన్నద్ధం చేయడానికి రూపొందించబడింది. ప్రభావవంతమైన ప్రొడక్ట్ వ్యూహాన్ని రూపొందించడం, ప్రొడక్ట్ విలువపై ప్రత్యేక క్లాస్ లు, రోడ్‌మ్యాపింగ్, అవసరాలను బట్టి ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, రాబోవు తరాల కోసం యాప్‌లను రూపొందించడం.. ఇలా పలు అంశాలపై శిక్షణ ఇస్తుంది. ఈ శిక్షణ తొమ్మిది వారాల పాటు ఉంటుంది.
ఈ ప్రోగ్రామ్ ఎంచుకునేవారిని సమర్థవంతమైన స్థాపకునిగా మార్చడం, ఎలాంటి ప్రణాళికలు, వ్యూహాలు అమలుచేయాలన్న దానిపై అవగాహన కల్పించడం, సరైన ఉద్యోగులను ఎలా నియమించుకోవాలో తెలిపే సూచనలు చేయడం సహా వారి వెన్నంటే ఉంటామంటూ భరోసా నింపుతుంది. దేశంలోని టైర్ II, టైర్ III నగరాల్లోని 10,000 స్టార్టప్‌లకు గైడ్ చేసేందుకు స్టార్టప్ స్కూల్‌ను ప్రారంభించారు.
ప్రస్తుతం 70వేలకు పైగా స్టార్టప్‌లతో భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద స్టార్టప్‌ల జన్మస్థలంగా ఉంది. ఎక్కువ మంది తమ కంపెనీలను విజయవంతంగా IPOలు లేదా యునికార్న్ హోదాకు చేరుస్తున్నారు. వీరిని చూశాక మరింత యువత స్టార్టప్ రంగంపై ద్రుష్టి సారిస్తున్నారు. ప్రస్తుతానికి స్టార్టప్‌ల బిజినెస్ బెంగళూరు, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌కు వంటి నగరాలకే పరిమితమైన రానున్న రోజుల్లో చిన్న చిన్న పట్టణాలకు కూడా విస్తరించనుంది. ఈ సమయంలో గూగుల్ స్టార్టప్ స్కూల్ ను ఎంచుకోవడం సరైన నిర్ణయమే అని నిపుణులు భావిస్తున్నారు.