ప్రస్తుతం బంగారం, వెండి ధరలు రోజురోజుకు పడిపోతున్నాయి. నిన్న ఉన్న ధర ఇవాళ ఉండడం లేదు. ద్రవ్యోల్బణం పెరుగుతుండడంతో బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో బంగారం మీద పెట్టుబడి పెట్టడం మంచిదేనా? ఇప్పుడు బంగారం కొంటే భవిష్యత్తులో ఎంత వరకూ పెరగచ్చు? మార్కెట్ నిపుణులు ఏం చెబుతున్నారు?
బంగారం ధరలు ఎప్పుడు పడిపోతాయి, ఎప్పుడు పెరుగుతాయో అనేది ఎవరూ చెప్పలేరు. అంచనా మాత్రం వేయగలరు. ఈ ఏడాది ఆరంభంలో అంటే జనవరి 1న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,200 పలికితే.. ఆ మరుసటి రోజే రూ. 55,040 కి తగ్గింది. జనవరి 26న గరిష్టంగా రూ. 57,930 పలికింది. జనవరి 31న రూ. 57,270 తో ముగిసింది. ఫిబ్రవరి నెలలో 6 సార్లు బంగారం, వెండి ధరలు తగ్గాయి. గత ఏడాది నవంబర్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,800 ఉంటే.. ఇప్పుడు రూ. 52,000 ఉంది. 24 క్యారెట్ల బంగారం అయితే 10 గ్రాముల ధర రూ. 56,730 ఉంది. 2022 నవంబర్ తో పోలిస్తే బంగారం ధర రూ. 5,200 పెరిగింది. అలానే వెండి ధర కూడా భారీగా పెరిగింది.
అయితే రానున్న కాలంలో బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ధరలు తగ్గినా ఈ ధరలు తాత్కాలికమే అని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2023 దీపావళి నాటికి 10 గ్రాముల బంగారం ధర రూ. 65 వేలకు చేరుకుంటుందని గ్రీన్ పోర్ట్ ఫోలియో స్మాల్ కేస్ సహ వ్యవస్థాపకుడు దివం శర్మ అంచనా వేశారు. అలానే కిలో వెండి ధర రూ. 80 వేలకు చేరుకుంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52 వేలు ఉంది. దివం శర్మ చెప్పిన దాని ప్రకారం.. ఇప్పుడు కొంటే గనుక దీపావళి నాటికి 10 గ్రాముల వద్ద రూ. 13 వేల నుంచి రూ. 15 వేల వరకూ మిగుల్చుకోవచ్చు.
100 గ్రాముల బంగారం వద్ద రూ. 1,30,000 నుంచి రూ. 1,50,000 వరకూ లాభం పొందవచ్చు. ఉదాహరణకు ఇవాళ 5 లక్షల 20 వేలు పెట్టి 22 క్యారెట్ల బంగారాన్ని 100 గ్రాములు కొనుగోలు చేస్తే.. ఈ 8 నెలల్లో బంగారం ధర రూ. 6 లక్షల 50 వేల నుంచి 6 లక్షల 70 వేలు అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక వెండిపై కూడా ఆ స్థాయిలోనే లాభం ఉంటుందని అంటున్నారు. ఇవాళ కిలో వెండి ధర రూ. 71,800 ఉంది. ఉదాహరణకు ఇప్పుడు వెండి కొనుగోలు చేస్తే దీపావళి నాటికి 9 వేలకు పైగా అదనంగా లాభం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మొత్తం మీద బంగారం, వెండి ధరలు తగ్గుతున్నా.. దీపావళి నాటికి భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు బంగారం కొనాలనుకునేవారికి తగిన సమయంగా భావించవచ్చునని చెబుతున్నారు.