దేశంలో ఏ ధరలు పెరిగినా, పెరిగకపోయినా మాంస ప్రియులకు నష్టం లేదు కానీ, చికెన్ ధరలు పెరిగాయంటే మాత్రం ఆందోళన చెందుతారు. ఆదివారమే కాదూ మిగిలిన రోజుల్లో కూడా చికెన్ లాంగించేసే వారికి చికెన్ ధర పెరిగిందే.. ఆ వార్తే మింగుడు పడదు. అలాంటిది వాటి ధరలు తగ్గుతున్నాయంటే.. ?
దేశంలో ధరలు పెరుగుతున్నాయి అంటే జనాలు చూసేదీ నిత్యావసరాల సరుకుల వైపు కాదూ. బంగారం, డీజిల్, పెట్రోల్ ధరల వైపే. ఆ తర్వాత చూసేదీ చికెన్ ధరలనే. ఎందుకంటే మన దేశంలో మాంసాహార ప్రియులు ఇష్టంగా తినేదీ చికెన్నే. నాన్ వెజ్ కేటగిరిలో ఇది లేందే ముద్ద దిగదు. చికెన్ ప్రియులైతే.. దీంతో ఏ వంటకం చేసినా లొట్టలేసుకుని లాంగించేస్తారు. అందుకే చికెన్ ధరలు పెరుగుతున్నాయంటే అయ్యే తూకంలో లేదా కంచంలో ఓ ముక్క తగ్గిపోతుందే అని భావిస్తుంటారు. ఇటీవల కాలంలో కిలో చికెన్ ధర రూ 220కి పెరిగిన చికెన్ ధరలు.. ఇప్పుడిప్పుడే నేల చూపులు చూస్తున్నాయి.
నెల రోజుల క్రితం పెరిగిన చికెన్ ధరలు.. ఇటీవల తగ్గుతూ వస్తున్నాయి. గతంలో కిలో చికెన్ ధరరూ. 220 పెరిగి, చికెన్ ప్రియులను భయపెట్టిన ధర.. ఇప్పుడు ఊరట కలిగిస్తోంది. ప్రస్తుతం కిలో చికెన్ ధర రూ. 160కి చేరింది. అంటే సుమారు 60 రూపాయలకు తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ కొంతమంది రిటైల్ వ్యాపారులు ధరలు తగ్గించకుండా పాత ధరలకే అమ్ముతుండటంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రాయిలర్ కోడి లైవ్ రూ. 90కి పడిపోవడంతో పెంపకం దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటి పెంపకానికి అయ్యే ఖర్చు కూడా రావట్లేదని బాధపడుతున్నారు.
చికెన్ దారిలోనే కోడిగుడ్డు ధర కూడా నడుస్తుంది. కోడిగుడ్డు ధరలు పడి రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. జనవరిలో వంద కోడి గుడ్ల ధర రూ.555 ఉండగా, ప్రస్తుతం రూ. 440 ఉంది. అంటే సుమారు 115 రూపాయల మేర తగ్గింది. అయితే రీటైల్ ధరల్లో మాత్రం మార్పులు చోటుచేసుకోవడం లేదు. ఒక్కో కోడి గుడ్డు ధరను రూ. 6 నుండి 7 రూపాయల మధ్య అమ్ముతున్నారు. కోడి, కోడిగుడ్డు రేట్లు తగ్గడంపై కోళ్ల రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. ట్రాన్స్ పోర్ట్, లేబర్ చార్జీలు పెరుగుతున్నాయని, వీటికి సరైన ధరలు రావడం లేదని అన్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. చికెన్ ధరల తగ్గుదలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.