వెనుకటి రోజుల్లో ఆడవాళ్లని ఇంటికే పరిమితం చేసేవాళ్లు. వారిని వంటింటి కుందేళ్లుగా భావించేవారు. కానీ, రోజులు మారాయి. ఆడవాళ్లు కూడా అన్నింటిలో మేము కూడా సగం అంటూ పరుగులు పెడుతున్నారు. ప్రతి రంగంలో ఆడవాళ్ల భాగస్వామ్యం పెరిగింది. వాళ్లు కూడా కుటుంబ భారాన్ని మోసేందుకు ముందుకు వస్తున్నారు. కొందరైతే తమ కుటుంబానికి పెద్ద దిక్కులా మారుతున్నారు. హౌస్ వైఫ్స్ కూడా ఇప్పుడు సంపాదనపై దృష్టి సారిస్తున్నారు. భర్తకు తోడుగా తాము కూడా నాలుగు డబ్బులు సంపాదించాలని పూనుకుంటున్నారు. కొందరు ఉద్యోగాలు చేస్తుంటే.. ఇంకొందరు ఇంటి పట్టునే ఉంటూ చిన్న చిన్న వ్యాపారాలను ప్రారంభిస్తున్నారు. అలా ప్రారంభించడమే కాకుండా.. సక్సెస్ కూడా అవుతున్నారు. అలా తక్కువ పెట్టుబడితో.. ఎక్కువ లాభాలు తీసుకొచ్చే కొన్ని బిజినెస్ ఐడియాలను ఇప్పుడు చూద్దాం.
దాదాపు అందరు హౌస్ వైఫ్స్ కి వంటలు చేయడం బాగానే వచ్చే ఉంటుంది. ఈ రోజుల్లో చిన్న చిన్న పార్టీలు, యానివర్సీలు, బర్త్ డేలు, నైట్ అవుట్లు అంటూ అందరూ పార్టీలు చేసుకుంటూ ఉంటారు. కానీ, అవన్నీ దాదాపు 50 మందిలోపు అతిథులతోనే ఉంటూ ఉంటాయి. కాబట్టి వాళ్లు ఇళ్లలో తక్కువ మందికి వంటచేసే వారికే ఆర్డర్లు ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా హోమ్ ఫుడ్ అనే భావన కూడా ఉంటుంది. కాబట్టి ఇంట్లో మీ వాళ్ల సాయంతో క్యాటరింగ్ స్టార్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికోసం పెద్దగా పెట్టుబడి కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే సమానులతోనే వంట చేయచ్చు. సరుకులు కూడా అడ్వాన్స్ తీసుకున్న డబ్బుతోనే కొనుగోలు చేయచ్చు.
ఆడవాళ్లకు అందంపై శ్రద్ధ కాస్త ఎక్కువని అందరికీ తెలిసిందే. అయితే ప్రతి చిన్న అవసరానికి బ్యూటీపార్లర్‌కు వెళ్లలేరు. ఐబ్రోస్, ఫేషియల్ వంటి వాటి కోసం ఇంటి దగ్గర్లో ఉండే వాళ్లనో లేదా ఇంటికి వచ్చి చేసే వారికే ప్రాధాన్యత ఇస్తారు. మీరు చాలా తక్కువ ఖర్చుతోనే బ్యూటషియన్ కూడా నేర్చుకోవచ్చు. తర్వాత చిన్నగా మీ ఇంట్లోనే దానిని స్టార్ట్ చేయవచ్చు. లేదా మీ కాలనీల్లో ఉండే వారికి ఇంటికి వెళ్లి సర్వీస్ అందించవచ్చు. బ్యూటీషియన్‌తో పాటుగా వారికి కావాల్సిన బ్యూటీ ప్రొడక్ట్స్ ని కూడా మీరే సేల్ చేయవచ్చు.
ప్రస్తుతం బొటిక్స్ చాలా మంచి డిమాండ్ ఉంది. కానీ, అంతా బొటిక్‌లో తమ డ్రెస్సులు, బ్లౌజ్‌లను డిజైన్ చేయించుకోలేరు. ఎందుకంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. మీకు టైలరింగ్‌లో ప్రవేశం ఉంటే.. ట్రెండ్‌ని ఫాలో అవుతూ కొత్త డిజైన్స్ ని తక్కువ ధరలో ఇంటి వద్దే స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే మంచి ఆదాయం పొందవచ్చు. మీరు చేసే సాధారణ టైలరింగ్‌కే కొత్త మెళకువలను అద్దితే ఎక్కువ ఆదాయం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా ఇంటి వద్దే టైలరింగ్ చేసుకుంటూ ఉన్నా కూడా మంచి ఆదాయాన్నే పొందవచ్చు.
కాస్త నైపుణ్యం ఉంటే ఇంటి వద్ద ఉంటూనే ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. హ్యాండ్ క్రాఫ్ట్స్ కి మంచి డిమాండ్ ఉంది. షోకేస్‌లో పెట్టుకునే వస్తువులు. జనపనారతో చేసే సంచులు, న్యాప్కిన్స్, ఒత్తులు, గిఫ్ట్ ఆర్టికల్ తయారు చేయడం. వంటి వాటికి మంచి గిరాకీ ఉంది. తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారాలను ప్రారంభించవచ్చు. కావాల్సిందల్లా నైపుణ్యం, వ్యాపారం చేయాలి అనే కసి మీలో ఉండాలి.
మీరు ఫ్రాంచైజీలు అనే పదాన్ని వినే ఉంటారు. ప్రస్తుతం ఫ్రాంచైజీల ట్రెండ్ నడుస్తోంది. తక్కువ పెట్టుబడితో ఫ్రాంచైజీలను అందించేవాళ్లు చాలా మందే ఉన్నారు. హౌస్ వైఫ్స్ మీ ఫ్రెండ్స్ తో కలిసి తక్కువ పెట్టుబడితో వీటిని స్టార్ట్ చేయచ్చు. గుర్తింపు పొందిన ఫ్రాంచైజీకి చెందిన కెఫేని స్టార్ట్ చేస్తే మంచి లాభాలను పొందవచ్చు.
గతంతో పోలిస్తే.. ప్రస్తుతం అందరికీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగిందనే చెప్పాలి. అందరూ యోగా, జుంబా డాన్స్ వంటి వాటివైపు మొగ్గు చూపుతున్నారు. హౌస్ వైఫ్స్ గా ఉన్నవారిలో చాలా మందికి యోగా, జుంబా డాన్సులు వంటివి వాటిలో ప్రవేశం ఉండే ఉంటుంది. అలాంటి వారు పర్సనల్ యోగా, లేదా ఆన్‌లైన్ యోగా క్లాసులను ప్రారంభించడం మంచిది. వాటికి మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది, ఆదాయం కూడా బాగా ఉంటోంది. ముఖ్యంగా ఇప్పుడు ప్రెగ్నెన్సీ యోగాకు డిమాండ్ బాగా పెరిగింది.