కొత్త ఏడాదిలోనూ ఉద్యోగాల కోత కొనసాగుతోంది. ఆర్థిక మాంద్యం, కరోనా మళ్లీ పడగ విప్పడంతో గ్లోబల్ ఈ కామర్స్ దిగ్గజాలు కాస్ట్ కట్టింగ్ కు సిద్ధమవుతున్నాయి. తాజాగా, ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ 18,000 మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు ప్రకటించింది. గతంలో 10 వేల మంది తొలగిస్తామని ప్రకటించిన సంస్థ, ఇప్పుడు మరో 8 వేల మందిని కూడా ఇంటికి పంపనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు అమెజాన్ సీఈఓ ఆండీ జస్సీ ఉద్యోగులకు ఓ లేఖ రాశారు.
ఉద్యోగాల కోతపై అమెజాన్ గతేడాది నవంబరులోనే ప్రకటన చేసింది. అప్పుడే కొంతమందికి ఉద్వాసన పలికింది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అస్థిర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలోనే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని సంస్థ సీఈఓ ఆండీ జెస్సీ ఓ ప్రకటనలో తెలిపారు. సంస్థ నుంచి ఎవరెవరిని తొలగిస్తామనే విషయం జనవరి 18 నుంచి తెలియజేయనున్నారు. అయితే, ఉద్వాసనకు గురయ్యే వారికి తమ సహకారం ఉంటుందని జస్సీ తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీలతో పాటు, ఆరోగ్య బీమా ప్రయోజనాలు, కొత్త ఉద్యోగాల వేటలో సాయం చేస్తామని ప్రకటించారు. కరోనా మహమ్మారి విలయతాండవం చేసిన నాటి నుంచి తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో పడ్డ పలు కంపెనీలు, కాస్ట్ కట్టింగ్ లో భాగంగా ఉద్యోగులకు ఉధ్వాసన పలుకున్నాయి. అమెజాన్ కూడా అదే విధానం అనుసరిస్తోంది.
కాగా, 2020 ప్రారంభం నుంచి 2022 ఆరంభం వరకు ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ తమ సిబ్బందిని దాదాపు రెండింతలకు పెంచుకుంది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు చివరి నాటికి కంపెనీలో ప్రపంచవ్యాప్తంగా 15.4 లక్షల మంది పనిచేస్తున్నారు. పండగలు, ఆఫర్ సీజన్‌లలో వచ్చే అనూహ్య గిరాకీకి అనుగుణంగా అమెజాన్ అదనంగా మరింత మందిని నియమించుకుంటుంది. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ చివరి నాటికి అమెజాన్ కంపెనీలో 1.54 మిలియన్ల మంది ఉద్యోగులు ఉన్నారు. మరోవైపు.. టెక్ దిగ్గజం గూగుల్ కూడా 10వేల మందిని బయటకు పంపేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే గూగుల్ రివ్యూస్ అండ్ డెవలప్‌మెంట్ (గ్రాడ్) అనే ఓ నూతన పనితీరు సమీక్షా వ్యవస్థను ఇప్పటికే గూగుల్ పరిచయం చేసింది. దీనిద్వారా దాదాపు 6 శాతం ఉద్యోగులను లో-ర్యాంకింగ్ కేటగిరీలోకి సంస్థ తీసుకెళ్లనున్నది. ఇదే జరిగితే 10,000 మంది ఉద్యోగాలను కోల్పోయే వీలుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
#ICYMI | ETtech top story of the day – Amazon layoffs to impact over 18,000 employees, says CEO Andy Jassyhttps://t.co/0pfyum2WTn pic.twitter.com/eB5eE7IQU0
— ETtech (@ETtech) January 5, 2023