బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. దాదాపుగా ఆఖరి మజిలీకి చేరుకుంటోంది. ఇప్పటికే 11 వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు కూడా హౌస్‌లో కాస్త గొడవలు, ఆర్గుమెంట్లు బాగానే జరుగుతున్నాయి. రెండోసారి కెప్టెన్ అయిన రేవంత్.. ఇంట్లోని సభ్యులకు కడుపునిండా అన్నం కూడా పెట్టడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. రేషన్ చివరివరకు దాచిపెట్టి నువ్వు మంచి కెప్టెన్ అవ్వడానికి మా కడుపులు ఎందుకు కాలుస్తున్నావ్? అంటూ ఇంటి సభ్యులు ప్రశ్నిస్తున్నారు. అలాగే అందరీ మధ్య ఇంకా ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతూనే ఉంది. అదే విషయం నామినేషన్స్ ప్రక్రియలో కూడా కనిపిస్తూనే ఉంది. దాదాపుగా అంతా మొదటి నుంచి టార్గెటెడ్‌గానే నామినేషన్స్ చేస్తున్నారు.
ఇంక 12వ వారం నామినేషన్స్ విషయానికి వస్తే.. ఈసారి సీక్రెట్ రూమ్‌లో కూర్చోబెట్టి నామినేట్ చేయాలని కోరారు. శ్రీహాన్, ఫైమా, రోహిత్, శ్రీసత్య, రాజ్, ఇనయా, ఆదిరెడ్డి నామినేషన్స్ లో ఉన్నారు. ఇంక ప్రస్తుతం హౌస్‌లో ఫ్యామిలీ ఎపిసోడ్ నడుస్తోంది. మొదటిగా ఆదిరెడ్డి వాళ్ల భార్య-కుమార్తె హౌస్‌లోకి ఎంటర్ అయ్యారు. హౌస్‌లోకి వచ్చిన కవితతో ఆదిరెడ్డి తన గేమ్ గురించి అడిగితెలుసుకున్నాడు. ఎలా ఆడుతున్నాను? బాగా ఆడుతున్నానా? డాన్స్ ఎలా చేస్తున్నాను? అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. డాన్స్ విషయంతో కవిత.. నీ డాన్స్ చూసి నవ్వుకుంటున్నాం అంటూ చెబుతాడు. నువ్వు కూడా నవ్వుతున్నావా అంటూ ఆదిరెడ్డి ఫన్నీగా రియాక్ట్ అవుతాడు.
గేమ్స్ లో మాత్రమే కొట్టుకోవాలని.. విడి సమయాల్లో మాత్రం కలిసి ఉండాలంటూ కవిత కోరుతుంది. అయితే ఆదిరెడ్డి నన్ను కూడా కొట్టమంటావా అంటూ ప్రశ్నించగా.. నువ్వు ఏమైనా తోపా? అంటూ కవిత రియాక్ట్ అవుతుంది. ఇంక ఆదిరెడ్డి కుమార్తె హద్విత పుట్టిన రోజు వేడుకలను బిగ్ బాస్ హౌస్‌లో నిర్వహించారు. భార్య కవితతో కలిసి ఆదిరెడ్డి కేక్ కట్ చేశాడు. ఆదిరెడ్డి కుమార్తెను చూస్తూ రేవంత్ బాగా ఎమోషనల్ అయిపోయాడు. తన భార్య, పుట్టబోయే బిడ్డను గుర్తుచేసుకుని రేవంత్ ఏడ్చేశాడు. ప్రోమో మొత్తంలో రేవంత్ ఏడవడం చూసి అంతా ఎమోషనల్ అవుతున్నారు. అయితే రేవంత్ కోసం ఎవరు హౌస్‌లోకి వస్తారు అనేది చెప్పలేం. ఎందుకంటే అతని భార్య గర్భవతి కాబట్టి వచ్చే పరిస్థితిలో ఉన్నారో లేదో చూడాలి. ప్రస్తుతం ఈ ఫ్యామిలీ ఎపిసోడ్ కచ్చితంగా ప్రేక్షకులను ఎమోషనల్ చేయడం ఖాయం.