ఆర్జే సూర్య అనగానే టక్కున గుర్తు పట్టడం కష్టం. కానీ ఇస్మార్ట్ న్యూస్‌లో వచ్చే కుర్రాడు అనగానే వెంటనే గుర్తు పడతారు. మిమిక్రీ చేస్తూ.. ఆయా నాయకులు, సెలబ్రిటీల వాయిస్‌ను అచ్చుగుద్దినట్లు దించేస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు ఆర్జే సూర్య. తాజాగా ప్రారంభమైన బిగ్‌బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు సూర్య. అయితే నేడు ఈ స్థాయికి ఎదిగిన సూర్య జీవితంలో ఎన్నో కష్టాలను చవి చూశాడు. ఒకానొక దశలో జీవితంలో అన్ని పోగొట్టుకున్నాడు. ఆఖరికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కూడా అతడిని వదిలేసి వెళ్లింది. ఆ సంఘటన సూర్య జీవితాన్ని మార్చేసింది. తనను వద్దనుకున్నవారు.. తనను అందుకోలేనంత ఎత్తుకు ఎదగాలని నిర్ణయించుకున్నాడు. ఆ దిశగా కృషి చేసి.. జీవితంలో ఎదిగాడు సూర్య. ఎందరికో స్పూర్తిగా నిలుస్తున్న సూర్య జీవిత విశేషాలు..
సూర్య స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లాలోని పశువల్లంక గ్రామం. సూర్య తండ్రి రోజువారి కూలీ. అతడికి ఓ తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక 1996లో వచ్చిన తుపానులో సూర్య స్వగ్రామం నామరూపాలు లేకుండా నాశనం అయ్యింది. దాంతో అతడి కుటుంబం భీమవరం వలస వెళ్లింది. సూర్య చిన్నతనంలో ఎన్నో ఆర్థిక కష్టాలు అనుభవించాడు. బాల్యంలో ఒక్క రోజు కూడా కడుపునిండా భోజనం చేయలేదంటే.. ఎంతటి దుర్భర పరిస్థితులు చవి చూశాడో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి నేపథ్యంలో చదువుకోవడం అంటే అత్యాశే అవుతుంది. కానీ సూర్య తండ్రిని ఒప్పటించి ఓ పూట బడికి వెళ్తూ.. మరోపూట కిల్లీ కొట్టులో షోడాలు శుభ్రం చేసేవాడు.
ఇలా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న తరుణంలోనే సూర్య తమ్ముడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వైద్యానికి లక్షల్లో ఖర్చవుతుందని తెలిపారు డాక్టర్లు. చేతిలో చిల్లగవ్వ కూడా లేకపోవడంతో.. వైద్యం అందక.. కళ్లముందే తమ్ముడు చనిపోయాడు. ఈ సంఘటన సూర్య జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఆ బాధ నుంచి బయటపడి జీవితంలో ముందుకెళ్లాడు. ఈ క్రమంలో మిమిక్రీపై ఆసక్తి ఉండటంతో దాన్ని ప్రాక్టీస్ చేసేవాడు. అదే అతడికి జీవితాన్ని ప్రసాదిస్తుందని అప్పుడతడికి తెలియదు.
ఇలా సాగిపోతుండగా.. పీజీలో ఉండగా ఓ యువతిని ప్రేమించాడు సూర్య. ఎంతో కష్టపడి తల్లిదండ్రులను కూడా ఒప్పించాడు. ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకునేలా అమ్మాయి తల్లిదండ్రులను కూడా ఒప్పిస్తాడు. అంతా బాగుంది అనుకున్న సమయంలో ప్రేమించిన అమ్మాయి చేసిన పని సూర్య జీవితాన్ని మలుపు తిప్పింది. తల్లిదండ్రులను వదిలి రావాల్సిందిగా ఆ అమ్మాయి సూర్యకు కండిషన్ పెట్టింది. ఆరు నెలలు ప్రేమించిన అమ్మాయి కోసం కనిపెంచిన తల్లిదండ్రులను వదులుకోవడం కరెక్ట్ కాదని భావించిన సూర్య.. ప్రేమించిన అమ్మాయిని వదులుకున్నాడు.
ఇలా చిన్నతనం నుంచి అన్ని వదులుకుంటూ వస్తున్న సూర్య.. ఆ నిమిషం జీవితంలో ఎదగాలని నిర్ణయించుకున్నాడు. నేడు తనను కాదనుకున్నవారు తనను అందుకోలేని స్థాయికి చేరాలని నిర్ణయించుకున్నాడు. ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాడు. తొలుత ఓ ఎఫ్ఎం చానెల్లో ఉద్యోగంలో చేరాడు. అక్కడ తనకు మంచి గుర్తింపు రావడంతో.. ఆ తరువాత వరుస అవకాశాలు సూర్యను వెదుక్కుంటూ వచ్చాయి. ప్రస్తుతం ఇస్మార్ట్ న్యూస్‌లో పని చేస్తున్నాడు. బిగ్‌బాస్ హౌజ్‌లో ప్రవేశించాడు సూర్య. టైటిల్ విన్నర్ కావడమే తన గోల్ అన్నాడు సూర్య. అతడికి ఆల్ ది బెస్ట్ చేబుతున్నారు నెటిజనులు.