ఇనయా సుల్తానా.. ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. అదే రామ్ గోపాల్ వర్మ బ్యూటీ ఇనయా అంటే అంతా ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఇండస్ట్రీలో ఒ స్టార్‌గా ఎదిగేందుకు ఎంతో కృషి చేస్తోంది. ఇప్పటికే కొన్ని అవకాశాలు వచ్చినా.. బ్రేక్ మాత్రం రాలేదు. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 హౌస్‌లో ఉన్న ఈ బ్యూటీ ఏ మేరకు రాణిస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మొదటి టాస్కులో ఇనయా సుల్తానా డేంజర్ జోన్‌లో ఉందనే చెప్పాలి. క్లాస్, మాస్, ట్రాష్ అనే టాస్కులో ఇనయా ట్రాష్ కేటగిరిలో నామినేట్ అయ్యింది. ఈ కేటగిరిలో ఉండే వాళ్లు నేరుగా నామినేట్ అవుతారు. ఇంట్లో సభ్యులు చెప్పే అన్ని పనులు చేయాలి.
వీళ్లకి బెడ్ రూమ్ యాక్సెస్ ఉండదు. లాన్ లో వండుకుని, హాల్‌లో పడుకోవాలి. ఇన్ని కష్టాలు తప్పుతాయిలే అనుకుంటే.. ఆదిరెడ్డితో ఒక టాస్కు ఆడి ఇనయా ఓడిపోయింది. అంటే మళ్లీ టాస్కులో పోటీ పడేందుకు ఆమెకు దాదాపుగా అవకాశం దక్కకపోవచ్చు. అంటే ఈ వీక్ నామినేషన్స్ లో ఇనయా సుల్తానా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. గలాటా గీతూ ఇనయతో మొదటిరోజే వైరం పెట్టుకుంది. అలా గీతూ వల్ల ఇనయాకి ఎంతో కొంత నష్టం కలిగేలా ఉంది. ఇనయా ట్రాష్‌లో ఉండేందుకు ఒకరకంగా గీతూ కూడా కారణం అని చెప్పొచ్చు. ఇప్పటికే వారి మధ్య క్లియర్‌గా యుద్ధం మొదలైపోయింది. ఒకరినొకరు నామినేట్ చేసుకోవడం మొదలు పెట్టారు.
బిగ్ బాస్ ఇచ్చిన ఈ టాస్కులో భాగంగా ట్రాష్ కేటగిరీలో ఉండే సభ్యులు వారి జీవితంలో వారికి ఎవరు ముఖ్యం, ఎవరికి మీరు ఒక స్టార్‌గా ఉంటారో చెప్పండి అంటూ టాస్క్ ఇచ్చాడు. అందులో ఇనయా సుల్తానా మొదటగా మాట్లాడి అందరి హృదయాలను కదిలించింది. ఇనయా జీవితంలో ఎన్ని కష్టాలు పడింది, ఎందుకు అసలు ఇండస్ట్రీకి వచ్చింది, తన లైఫ్ గోల్ ఏంటో చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. తన మాటలు వింటూ కీర్తీ భట్ సైతం తన కుటుంబాన్ని గుర్తుచేసుకుని వెక్కి వెక్కి ఏడ్చేసింది. మొదటి టాస్కులోనే బిగ్ బాస్ ఇంట్లోని సభ్యుల హృదయాలను ద్రవింపజేశారు. అందరిలో ముఖ్యంగా ఇనయా సుల్తానా స్టోరీ అందరినీ కంటతడి పెట్టించింది.
“మా నాన్న ముజిబర్ రెహ్మాన్.. రెండేళ్ల క్రితం చనిపోయారు. నాన్నకు ఇండస్ట్రీలోకి రావాలని ఎంతో ఉండేది. వచ్చి కొన్నాళ్లు ట్రై చేశారు. కొన్ని అవకాశాలు వచ్చే సమయంలో మా కోసం వెనక్కి వచ్చేసి మాతో ఉండిపోయారు. ఆయన అనుకున్నది సాధించలేకపోయారు. ఆయన కలను నెరవేర్చేందుకు నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి హాస్టల్ ఉండేదాన్ని. తినడానికి సరిగ్గా తిండి కూడా ఉండేది కాదు. ఒక్కోసారి హాస్టల్‌లో కర్రీస్ అయిపోతే అన్నంలో నీళ్లు పోసుకుని తినేదాన్ని. ఎన్నో రోజులు ఆకలితో పస్తులు కూడా పడుకున్నాను. నాకు మా నాన్న హీరో.. ఆయన కలను నెరవేర్చాలి. నన్ను చూసి మా నాన్న గర్వపడుతున్నాడు అనుకుంటున్నా. ఐ లవ్ యూ డాడీ” అంటూ ఇనయా సుల్తానా ఏడ్చేసింది. తన లైఫ్ స్టోరీ తెలుసుకుని ఇంట్లోని సభ్యులు సైతం ఎంతో బాధపడ్డారు. ఇనయా సుల్తానా గతంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.