బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ప్రేక్షకాదరణ కోసం ఎన్నో అవస్థలు పడుతోంది. అన్ని సీజన్లతో పోలిస్తే ఈసారి కాస్త ఆదరణ తగ్గిందనే చెప్పాలి. ఈ వారం హైలెట్స్ చూసుకుంటే కెప్టెన్సీ పోటీదారుల టాస్కులో ఈసారి కూడా గొడవలు, ఊహించని విషయాలు చాలానే అయ్యాయి. అన్నింటిలో ముఖ్యంగా గీతూ రాయల్‌పై బాలాదిత్య కేకలు వేశాడు. అది కూడా అలా ఇలా కాదు చాలా అగ్రెసివ్ అయ్యాడు. కానీ, ఆమె అనని మాటకు గీతూపై ఉగ్రరూపం దాల్చాడు. నా ఎడ్యుకేషన్, నా ప్రొఫెషన్‌ని తక్కువ చేసి మాట్లాడకు అంటూ గోల చేశాడు. తీరా అనింది సూర్య అని చెప్పగానే వెంటనే సైలెంట్ అయ్యి అతనితో తమ్మడు అని మాట్లాడాడు. అంటే అక్కడ వాళ్లు అన్న మాట బాలాదిత్యకు ఇబ్బంది కలిగించలేదు. గీతూ అనిందేమో అని అంత గోల చేశాడు. బాలాదిత్య అలా చేసే సరికి ఇప్పుడిప్పుడే మాస్కు తీస్తున్నాడు అని అందరూ అనుకుంటున్నారు.
ఇంక కెప్టెన్ విషయానికి వస్తే కెప్టెన్సీ పోటీదారుల టాస్కులో ఫైనల్ ఘట్టానికి సూర్య, రేవంత్, బాలాదిత్య చేరుకున్నారు. ఆ టాస్కులో రేవంత్‌కు అందరికంటే ఎక్కువ మాలలు వచ్చాయి. రేవంత్ ఈ వారం కెప్టెన్‌గా అవతరించాడు. ఫినోలెక్స్ సింహాసనంపై కూర్చొని తన కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించాడు. హౌస్ మొత్తం రేవంత్‌ని స్వీకరించారు సరేగానీ.. అంతా అదేదో అతనికి పనిష్మెంట్ ఇచ్చేందుకు ఎంచుకున్నట్లు కనిపించింది. ఎందుకంటే ఎవరి కెప్టెన్సీ అయినా నీ కోసమే ఎక్కువ బజర్లు వచ్చాయి. సో నువ్వు కెప్టెన్ అయితే ఎలా ఉంటుందో చూడాలని ఉంది అంటూ ఓట్లు వేశారు. అంతేకాకుండా ఎవరైనా పనిష్మెంట్ ఇస్తే నువ్వు వాదిస్తావు.. అదే నువ్వు పనిష్మెంట్ ఇచ్చినప్పుడు ఎవరైనా వాదిస్తే ఎలా ఉంటుందో నీకు కూడా అర్థమవుతుంది అంటూ చెప్పుకొచ్చారు.
ఇంక ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారని అంతా ఎదురు చూశారు. నామినేషన్స్ లో మొత్తం 8 మంది ఉన్నారు. బాలాదిత్య, చలాకీ చంటి, అర్జున్, ఫైమా, వాసంతి, ఆదిరెడ్డి, మెరీనా, ఇనయా సుల్తానా నామినేషన్స్ లో ఉన్నారు. వారిలో ఎవరు నామినేషన్స్ నుంచి సేవ్ అవుతారు? ఎవరు ఇంటి నుంచి బయటకు వచ్చేస్తారు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్ ప్లాన్ చేశారు. హౌస్ నుంచి చలాకీ చంటిని పంపేశారు. అవును ఈ విషయంలో ప్రేక్షకులు కూడా కాస్త షాకవుతున్నారు. ఎందుకంటే అర్జున్, వాసంతి, మెరీనా కంటే చంటి ఏమీ తక్కువ ఆడటం లేదు కదా అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే శుక్రవారం ఎపిసోడ్‌లో చంటి అన్నం తినకుండా నన్ను పంపేయమని అడుగుతాను అంటూ గోల చేశాడు. మరి ఆ మాటలను సీరియస్‌గా తీసుకుని పంపుతున్నారా? లేక ఓటింగ్ ప్రకారమే పంపుతున్నారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి ఎలిమినేషన్‌పై చంటి ఏవిధంగా స్పందిస్తాడో చూడాలి.