బ్యూటీపార్లర్‌కు వెళ్లి వస్తానని ఎంతో సాధారణంగా ఇంట్లో నుంచి స్కూటీపై బయటకు వెళ్లిన ఆ యువతి… తెల్లారేసరికి చెరువు గట్టున విగతజీవిగా తేలడం ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. నవ్వుతూ వెళ్లిన కూతురు శవంగా మారడంతో ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలిపోతున్నాయి. ఒంటిపై తీవ్ర రక్తగాయాలు, విరిగిన చేయి… ఇవన్నీ చూస్తుంటే ఇదొక సాధారణ మరణం కాదని, ముమ్మాటికీ ఒక దారుణమైన హత్యని అందరూ అనుమానిస్తున్నారు. అసలు ఆ రోజు ఆయేషా మీరాకు ఏం జరిగింది… అనేది మిస్టరీగానే ఉంది…
ప్రకాశం జిల్లా దర్శి పట్టణానికి చెందిన షేక్ రహమత్‌బాషా కుమార్తె షేక్ ఆయేషా మీరా . డిగ్రీ పూర్తి చేసి, తన భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటున్న యువతి ఆమె. అయితే, ఈ నెల 5వ తేదీ మధ్యాహ్నం సమయంలో ఆమె జీవితంలో ఊహించని మలుపు తిరిగింది. ‘స్నేహితులు పిలుస్తున్నారు, బ్యూటీపార్లర్‌కు వెళ్లి వస్తాను’ అని తన స్కూటీపై ఇంట్లో నుంచి బయటకు వెళ్ళింది ఆయేషా. సాయంత్రం అవుతున్నా కూతురు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. బంధువులు, తెలిసిన వాళ్ళ ఇళ్లలో వెతికిచూశారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో కంగారుపడిన తండ్రి రహమత్‌బాషా… అదే రాత్రి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా వెంటనే రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు.

పోలీసులు గాలింపు చేస్తుండగానే… మరుసటి రోజు ఉదయం దర్శి సమీపంలోని ఎన్‌ఏపీ చెరువు వద్ద ఒక యువతి మృతదేహం పడి ఉందన్న వార్త స్థానికంగా దావానలంలా పాకింది. పరుగులు పెట్టి వెళ్లి చూసిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా గుండెలు బాదుకుని రోదించారు. అది ఆయేషా మృతదేహమేనని తేలింది. ఆయేషా ఒంటిపై తీవ్రమైన రక్తగాయాలు ఉన్నాయి. ఒక చేయి పూర్తిగా విరిగిపోయిన స్థితిలో ఉంది. చెంపలపై బలంగా ఎవరో కొట్టినట్లు కమిలిన గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నట్లు సమాచారం..అయితే ఇన్ని గాయాలు, ఇంత హింస చూశాక… ఇది ఆత్మహత్య కానే కాదు, ఎవరో అత్యంత క్రూరంగా కొట్టి చంపి అక్కడ పడేశారనే అనుమానాలకు బలం చేకూరుతోంది.”
ఇక ఈ కేసులో ఇప్పుడు పోలీసులకు కొన్ని కీలక ఆధారాలు దొరికాయి. సంఘటన జరిగిన రోజు ఆయేషా స్కూటీ వద్ద కొంతమంది యువకులు, యువతులు ఉన్నట్లు స్థానికులు గమనించినట్లు సమాచారం. ‘స్నేహితులు పిలిచారు’ అని వెళ్లిన ఆయేషాకు, ఆ స్నేహితులకు మధ్య ఏదైనా గొడవ జరిగిందా? లేక ఎవరైనా ఆమెను మోసపూరితంగా అక్కడికి రప్పించి హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.ఆయేషా ఉపయోగించిన మొబైల్ ఫోన్ కాల్ డేటా రికార్డ్స్ ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆమె చివరిగా ఎవరితో మాట్లాడింది? ఆ రోజు ఆమెను ఎవరు రమ్మన్నారు? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. క్లూస్ టీమ్ సేకరించిన వేలిముద్రలు, పోస్టుమార్టం నివేదిక ఈ కేసులో అసలు నిజాన్ని బయటపెట్టే అవకాశం ఉంది.
కంటిపాపలా పెంచుకున్న కూతురు ఇలా విగతజీవిగా మారుతుందని ఆ తల్లిదండ్రులు కలలో కూడా ఊహించి ఉండరు. ‘స్నేహితుల ముసుగులో మా బిడ్డను పొట్టనబెట్టుకున్న హంతకులను వదలొద్దు… మాకు న్యాయం చేయండి’ అంటూ ఆ తండ్రి పడుతున్న వేదన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది.తప్పు చేసిన ఎంతటి వారైనా చట్టం ముందు శిక్ష అనుభవించాల్సిందే. ఆయేషా మృతి వెనుక ఉన్న అసలు నిజాలు బయటికి రావాలి, హంతకులకు కఠిన శిక్ష పడాలంటూ స్ధానికులు సైతం డిమాండ్ చేస్తున్నారు. డిగ్రీ చదివి భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఉన్న యువతి ఇలా విగతజీవిగా మారడంతో దర్శి పట్టణంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి
