మన చుట్టూ జరిగే, మన మధ్యలో నుంచి పుట్టే కథల్ని సరైన సినిమాగా తీయాలే గానీ కచ్చితంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. అలాంటి కాన్సెప్ట్ తో తీసిన సినిమానే ‘కొరమీను’. గతేడాది డిసెంబరు 31న థియేటర్లలో రిలీజైనప్పటికీ.. పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. అలానే చాలామందికి తెలియకుండానే థియేటర్లలో నుంచి మాయమైపోయింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ప్రత్యక్షమైపోయింది. ఆనంద్ రవి, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, శత్రు, హరీష్ ఉత్తమన్ తదితరులు నటించిన ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం!
ఏసీపీ సీతారామరాజు అలియాస్ మీసాల రాజు(శత్రు).. విజయవాడ నుంచి వైజాగా టాన్స్ ఫర్ అవుతాడు. కానీ డ్యూటీలో జాయిన్ కావడానికి ముందురోజు రాత్రే.. జాలారిపేటలోని కొందరు అతడి మీసాలు గీసేస్తారు. దీంతో అవమానం తట్టుకోలేకపోతాడు. దీనికి కారణం ఎవరా అని ఆలోచిస్తుంటాడు. అదే టైంలో జాలారిపేటలో యువరాజుగా ఆటలు సాగిస్తున్న కరుణ(హరీష్ ఉత్తమన్)పై ఏసీపీ దృష్టిపడుతుంది. ఇక కరుణకు అతడి దగ్గర డ్రైవర్ గా చేసి మానేసిన కోటి(ఆనంద రవి) మధ్య గొడవ జరుగుతుందని మీసాల రాజు తెలుసుకుంటాడు. మరి ఏసీపీ.. తన మీసాలు గీసేసింది ఎవరని కనిపెట్టాడా లేదా? చివరకు ఏం జరిగింది? ఈ స్టోరీలో మీనాక్షి (కిశోరి దాత్రక్), ముత్యం (జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్) రోల్ ఏంటి? అనేది తెలియాలంటే మాత్రం కచ్చితంగా సినిమా చూడాల్సిందే.
ఇద్దరి మధ్య ఇగో వస్తే.. అది ఎంతదూరం వరకు వెళ్లింది? చివరకు ఎవరు గెలిచారు అనేదే ఈ సినిమా. ఈ తరహా కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చుండొచ్చు. కానీ ఈ సినిమా మాత్రం నెక్స్ట్ లెవల్! ఇది మాత్రం గ్యారంటీ. సాధారణంగా మలయాళం, తమిళంలో ప్యూర్ నేటివిటితో వచ్చే సినిమాల్ని చూసి మనం మురిసిపోతుంటాం. అలాంటి కాన్సెప్ట్ తో తీసిన సినిమానే ‘కొరమీను’. స్టోరీ అంతా కూడా వైజాగ్ జాలారిపేటలో ఉంటుంది. అస్సలు పక్కదారి పట్టడం ఉండదు. చాలా నేచులర్ లొకేషన్స్, ఆ యాస బాగా నచ్చేస్తుంది. చూస్తున్నంతసేపు కూడా మీరు సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతారు.
మీసాల రాజు మీసాలని ముసుగు వేసుకున్న ముగ్గురు వ్యక్తులు గీయడం, ఎవరు చేశారా అని ఏసీపీ ఆలోచించే సీన్స్ తో డైరెక్ట్ గా కథలోకి వెళ్లిపోతాం. ఆ తర్వాత ఒక్కో క్యారెక్టర్ ఎంట్రీ ఉంటుంది. అలా గంటలో స్టోరీ సెటప్ అంతా అయిపోతుంది. అక్కడ నుంచి అసలు ఆట మొదలవుతుంది. మీసాలు ఎవరు గీశారా అనే క్వశ్చన్ దగ్గర మొదలైన మనకు చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి. వాటన్నింటినీ చివరి గంటలో ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ వస్తుంటారు. చూస్తున్న మనకు షాక్ ల మీద షాక్ లు తగులుతుంటాయి. ట్విస్టుల రివీల్ అవుతుండేసరికి మనకు యమ థ్రిల్లింగ్ గా అనిపిస్తూ ఉంటుంది. క్లైమాక్స్ చూసిన తర్వాత మాత్రం.. సింపుల్ కథని కూడా ‘అరే.. భలే తీశార్రా’ అనిపిస్తుంది.
ఇదే సినిమాలో కొన్ని సీన్లు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఆలోచింపజేసేలా ఉంటాయి కూడా. హీరో కోటి కంటే ముందు హీరోయిన్ మీనాక్షి.. విలన్ కరుణని ఇష్టపడుతుంది. అతడికి ఐ లవ్ యూ కూడా చెబుతుంది. ఈ క్రమంలోనే ఓసారి ఏకంతంగా కలుస్తారు కూడా. ఇక్కడ ట్విస్టు ఏంటంటే.. విలన్ దగ్గరికి హీరోయిన్ తెచ్చి, బయట కాపాలా కాసేది హీరో కోటినే. మరో సీన్ లో.. అబ్బాయిలు ఎక్కువమంది అమ్మాయిలతో తిరిగితే ఒకలా, అమ్మాయిలు ఎక్కువగా అబ్బాయిలతో తిరిగితే మరోలా ఆలోచిస్తారు అనే విషయాన్ని చాలా చక్కగా చెప్పాడు. ఇక ‘కళ్లు కూడా ఎన్నాళ్లయిని ఏడుస్తాయి సర్.. వాటికి కూడా వేరే పనులుంటాయి కదా’, ‘దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కానీ పేదోడికి ఇంకా స్వాతంత్ర్యం రాలేదు’ అనే డైలాగ్స్ మనల్ని ఆలోచింపజేస్తాయి. ఇలా చిన్న సినిమానే కదా అనుకున్న మిమ్మల్ని.. ‘కొరమీను’ చాలా విషయాల్లో సర్ ప్రైజ్ చేస్తుంది!
ఈ సినిమాలో ఎవరూ కూడా నటీనటుల్లా అనిపించరు. ఎందుకంటే అంత సింపుల్ గా అలా చేసుకుంటూ వెళ్లిపోయారు. ఆనంద్ రవి, హరీష్ ఉత్తమన్, శత్రు.. తమ తమ క్యారెక్టర్స్ కు పూర్తి న్యాయం చేశారు. హీరోయిన్ కిశోరి దాత్రక్ కు ఇది ఫస్ట్ సినిమానే అయినప్పటికీ.. అసలు అలా అనిపించదు. ఇక రాజా రవీంద్ర, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, గిరి తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక స్టోరీ-స్క్రీన్ ప్లే-డైలాగ్స్ తో ఆనంద్ రవి ఆకట్టుకుంటే.. దాన్ని మరో లెవల్ కి తీసుకెళ్లిన డైరెక్టర్ శ్రీపతి మెప్పించాడు. పేరుకే చిన్న మూవీ గానీ.. సినిమాటోగ్రఫీ మాత్రం చాలా రిచ్ గా ఉంది. ముఖ్యంగా బీచ్ విజువల్స్ నచ్చేస్తాయి. మ్యూజిక్ కూడా సినిమాకు కరెక్ట్ గా సరిపోయింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఓటీటీలో ఓ మంచి నేటివిటీ ఉన్న థ్రిల్లర్ చూడాలనుకుంటే మాత్రం అమెజాన్ ప్రైమ్ లో తెలుగులోనే అందుబాటులో ఉన్న ‘కొరమీను’ ట్రై చేయొచ్చు.
చివరగా: రియలస్టిక్ థ్రిల్లర్ మూవీ.. ఈ ‘కొరమీను’!
రేటింగ్: 2.5 /5