టూత్ పేస్టులు, ఫేస్ క్రీములు, ఆయింట్మెంట్ ట్యూబ్ లు వంటి వాటి మీద కొన్ని రంగుల చారలు ఉంటాయి. ఎరుపు, నలుపు, నీలం, పచ్చ రంగుల్లో ఉంటాయి. చాలా మందికి ఇవి ఎందుకు ఉంటాయో తెలియదు. మీరు గమనిస్తే టూత్ పేస్ట్ లేదా బాడీ లోషన్ మీద వివిధ రంగుల చారలు ఉంటాయి. అయితే కొంతమంది అది ఒక కలర్ కోడ్ అని, ఆ కలర్ కోడ్ ని డీకోడ్ చేస్తే అవి ఏ పదార్థాలతో తయారయ్యాయో కనిపెట్టవచ్చునని అనుకుంటారు. టూత్ పేస్ట్ అడుగున నీలం రంగు చార ఉంటే.. ఆ టూత్ పేస్ట్ లో మెడిసిన్స్, సహజ పదార్థాలతో కూడిన మిశ్రమంతో తయారు చేయబడింది అని అంటారు. పచ్చ రంగుని ఎలాంటి రసాయనాలు లేకుండా పూర్తిగా సహజసిద్ధంగా తయారు చేయబడిందని అంటారు. ఎరుపు రంగు చార ఉంటే.. సహజ సిద్ధంగా, రసాయనాలు కలిపి చేసిన పేస్ట్ అని అంటారు. నలుపు రంగు ఉంటే రసాయనాలు, సహజ సిద్ధ పదార్థాలు, మెడిసిన్స్ అన్నీ కలిపి చేసిన పేస్ట్ అని అంటారు. కానీ ఇది నిజం కాదు.
టూత్ పేస్ట్ కలర్ కోడింగ్ అనేది లేదు. కలర్ కోడింగ్ ను బట్టి టూత్ పేస్ట్ ఎలా తయారైందో చెప్పలేము. దీని వల్ల టూత్ పేస్ట్ లో ఉపయోగించిన పదార్థాలు ఏమిటో అనేవి నిర్ణయించలేము. మరి ఈ రంగు చారలను ఎందుకు పెడతారు? అంటే ఇవి సాధారణంగా హై స్పీడ్ మెషినరీ మీద లైట్ బీమ్ సెన్సార్లు ద్వారా చదవబడతాయి. ఈ కోడ్ ల వల్ల టూత్ పేస్ట్ అడుగు భాగాన్ని ఎక్కడ మడత పెట్టాలో.. ఎక్కడ కట్ చేయాలో మెషిన్ కి తెలుస్తుంది. మీరు గమనిస్తే.. ఈ పేస్ట్ లన్నీ మెషిన్ మీద వరుసగా ఒకదానితో ఒకటి కలిపి ఉండి.. వేరే మెషిన్ దగ్గరకు థ్రెడ్ తో కూడిన కంటైనర్ మీద వెళ్తుంటాయి. కటింగ్ మెషిన్ దగ్గర ఒక్కో పేస్ట్ ని కట్ చేస్తుంటుంది. ఇక ఆయింట్మెంట్లను ఐతే మడతపెడుతుంది. ఆయింట్మెంట్లు గమనిస్తే అవి అడుగు భాగంలో రెండు లేయర్లుగా మడతపెట్టి ఉంటాయి. చారలను బట్టి ఖచ్చితంగా ఎక్కడ మడతబెట్టాలి? ఎక్కడ కట్ చేయాలి అని మెషిన్ డిసైడ్ అవుతుంది. ఇది తయారీ విధానంలో భాగమే తప్ప.. ఈ రంగుల చారలకు, టూత్ పేస్ట్ లో వాడిన మూలకాలకు ఎటువంటి సంబంధం లేదు.
అలాంటప్పుడు రంగుల చారలే ఎందుకు ఉంటాయి అంటే.. దీని వెనుక ఎలాంటి రహస్యం లేదు. ఒక్కో కంపెనీ ఒక్కో రంగుని అనుసరిస్తుంది. అయితే టూత్ పేస్ట్ లోపల ఉండే పేస్ట్ రంగు రంగుల లైన్స్ తో వస్తుంది. పేస్ట్ ని పిండినప్పుడు తెలుపు, నలుపు లైన్స్ తో మిక్స్ అయిన పేస్ట్ వస్తుంది. అయితే ఇది డిజైన్ కోసం చేసింది కాదు. ఒక్కో లైన్ కి ఒక్కో పర్పస్ ఉంది. టూత్ పేస్ట్ లో ఉన్న నీలం లైన్, నోటి దుర్వాసనను పోగొట్టే రసాయనంతో చేసిందని సూచిస్తుంది. తెలుపు రంగు.. క్యావిటీ నుంచి రక్షించే రసాయనంతో చేసిందని సూచిస్తుంది. నోటి నుంచి మంచి వాసన రావడం కోసం ఒక రకమైన రసాయనంతో తయారు చేసిందని ఎరుపు రంగు సూచిస్తుంది.
తెల్లని రంగు టూత్ పేస్టుల్లో కూడా ఈ గుణాలన్నీ ఉంటాయి. కానీ ఈ పేస్ట్ లో రంగు లైన్లు అనేవి ఉండవు. అయితే వివిధ రంగు లైన్లు ఉండే పేస్టులను ఎక్కువ మంది ఇష్టపడుతున్నారని పరిశోధనలో తేలింది. అందుకే టూత్ పేస్టులని వివిధ రంగులతో తయారు చేస్తున్నారని కూడా అర్థం చేసుకోవచ్చు. రసాయనాలకే రంగులు వేస్తారు. అదన్నమాట విషయం. టూత్ పేస్ట్ అడుగు భాగంలో ఉండే చారల వెనుక ఉన్న రహస్యం. చారలను బట్టి టూత్ పేస్ట్ ఏ పదార్థాలతో తయారైందో చెప్పలేము. ఒకవేళ ఏ పదార్థాలతో తయారైందో తెలుసుకోవాలంటే టూత్ పేస్టు వెనుక భాగంలో రాసి ఉంటాయి. అవి చూసి తెలుసుకోవడమే. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.