సాధారణంగా మనం ప్రయాణించేటప్పుడు బస్సుల్లో, రైళ్లలో, విమానాల్లో కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అదీకాక కొన్ని నిషేధిత వస్తువులను వెంట తీసుకురావద్దని సదరు సంస్థలు ముందుగానే హెచ్చరిస్తుంటాయి. అయితే చాలా మందికి అంతుచిక్కని విషయం ఏంటంటే? విమానాల్లో ప్రయాణించేటప్పుడు మీ సెల్ ఫోన్స్ ను స్విచ్ ఆఫ్ చేయమని మీకు పదేపదే.. అనౌన్స్ మెంట్స్ వస్తుంటాయి. దానితో పాటుగా ఎయిర్ హోస్టెస్ కూడా మీకు చెబుతుంటారు. ముఖ్యంగా విమానం గాల్లోకి ఎగురుతున్నప్పుడు, నేలపైకి దిగుతున్నప్పుడు మీ ఫోన్ కచ్చితంగా స్విచ్ ఆఫ్ చేయమని లేదా ఎరోప్లేన్ మోడ్ లో పెట్టమని చెప్తుంటారు. అలా ఎందుకు చెబుతారో చాలా మందికి తెలీదు. దీని వెనక ఉన్న సైంటిఫిక్ కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
విమానంలో చాలా మంది సెల్ ఫోన్ యూజ్ చేస్తుంటారు. కానీ విమానం టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో మీ ఫోన్స్ ను స్విచ్ ఆఫ్ చేయమంటారు సదరు సిబ్బంది. అయితే ప్లైట్స్ లో ఎలక్ట్రానిక్ పరికరాల వాడకాన్ని అధికారికంగా నిషేధించలేదు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA).కానీ ప్లైట్ అటెండెంట్స్ మాత్రం మీ మెుబైల్ ను స్విచ్ ఆఫ్ చేయండి అని చెబుతుంటారు. ఎందుకంటే భద్రత కారణాలను దృష్టిలో పెట్టుకుని వారు ఈ విధమైన అనౌన్స్ మెంట్స్ చేస్తుంటారు. దీనికి ప్రధాన కారణం సెల్ ఫోన్స్, వివిధ ఎలక్ట్రానిక్ పరికరాలు విడుదల చేసే రేడియో తరంగాలే. సెల్ ఫోన్ లో, ఎలక్ట్రానిక్ పరికరాలు విడుదల చేసే రేడియో తరంగాలు, విమానంలోని నావిగేషన్ కు ఉపయోగించే రేడియో తరంగాలు దాదాపుగా ఒకే ఫ్రీక్వెన్సీలో ఉంటాయి. దాంతో కాక్ పిట్ లో ఉండే ఏరోనాటికల్ వ్యవస్థకు ఇది అంతరాయం కలిగించవచ్చు. ఇది ప్రమాదానికి దారితీసే అవకాశాలను సృష్టిస్తుంది.
పైగా విమానం ఎత్తుకు పోయే కొద్ది సెల్ ఫోన్స్ ఎక్కువ మెుత్తంలో సిగ్నల్స్ ను పంపుతాయి.. దాంతో సిగ్నల్స్ ట్రాఫిక్ ఏర్పడుతుంది. ఇక విమానంలో వినియోగించే టెక్నికల్ వ్యవస్థకి ఇది అంతరాయం కలిగించవచ్చు. అందుకే విమానం టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో మీ ఫోన్స్ ను స్విచ్ ఆఫ్ చేయమని చెప్పేది. అయితే సెల్ ఫోన్ సిగ్నల్స్ కారణంగా ఇప్పటి వరకు ప్రమాదాలు జరిగిన సంఘటనలు చరిత్రలో లేవు. కాకపోతే.. విమాన ప్రయాణంలో టేకాఫ్, ల్యాండింగ్ అనే ప్రక్రియ చాలా కీలకమైంది. అందుకే ముందు జాగ్రత్తగా ఇలా ఫోన్స్ ను ఆఫ్ చేయమని చెబుతారు. అయితే ప్రస్తుతం అనేక విమానయాన సంస్థలు తమ విమానాల్లో వై-ఫై సేవలను కూడా ప్రారంభించాయి. ఏది ఏమైనప్పటికీ సిబ్బంది చెప్పినట్లుగా మీ ఫోన్ ను ఆఫ్ చేయడం మంచిది.