నందమూరి తారకరత్న చివరి కోరిక నెరవేరకుండానే తుది శ్వాస విడిచారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పిన తారకరత్న ఆ కోరిక తీరకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
నందమూరి తారకరత్న చిన్న వయసులోనే మరణిస్తారని ఎవరూ ఊహించలేదు. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన తిరిగి వస్తారనే అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో ఆయన మరణం అందరినీ కలచివేసింది. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు ఆ మృత్యువు ఒడిలోకే వెళ్లిపోయారు. తారకరత్న మృతితో ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. తారకరత్న పార్థివ దేహాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్ లోని ఆయన నివాసానికి తరలించారు. ప్రముఖులంతా ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. సోమవారం ఉదయం అభిమానుల సందర్శనార్థం తారకరత్న భౌతిక కాయాన్ని ఫిల్మ్ ఛాంబర్ లో ఉంచనున్నారు. అదే రోజు సాయంత్రం ఫిల్మ్ నగర్ లోని మహా ప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఇదిలా ఉంటే తారకరత్న తన ఆఖరి కోరిక నెరవేరకుండానే తుది శ్వాస విడిచారు. ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన తారకరత్న.. యువరత్న, తారక్, భద్రాద్రి రాముడు వంటి సినిమాల్లో నటించారు. అమరావతి సినిమాలో తనదైన తారకరత్న నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాలో తారకరత్న విలన్ గా నటించి అదరహో అనిపించారు. ఉత్తమ విలన్ గా నంది అవార్డు కూడా గెలుచుకున్నారు. సినిమాలే కాకుండా 9 అవర్స్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించి మెప్పించారు. ఒక పక్క నటుడిగా ఉంటూనే.. రాజకీయాల్లో కూడా చురుగ్గా వ్యవహరిస్తూ వచ్చారు. టీడీపీ పార్టీ ప్రచార కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. తారకరత్న దూకుడు చూసి రాజకీయాల్లో రాణించడం గ్యారంటీ అని అనుకున్నారు. ఆ మాటల ప్రవాహాన్ని చూసి సినీ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఆశ్చర్యపోయారు.
దీంతో తారకరత్న ఫుల్ టైం పాలిటిక్స్ లో అడుగుపెడతారని అనుకున్నారు. అనుకున్నట్టే తారకరత్న కూడా ప్రజా సేవ చేసేందుకు ఆసక్తి ఉందని చెప్పారు. చంద్రబాబు నాయుడు కూడా తారకరత్న లాంటి యువకుడు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. తారకరత్న కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అని చంద్రబాబుని అడిగారట. ఈ విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో తారకరత్న కూడా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. చంద్రబాబు కూడా సుముఖంగానే ఉన్నారు. అయితే ఆ కోరిక నెరవేరకుండానే తారకరత్న మరణించారు.