కుక్క అంటే విశ్వాసానికి ప్రతీక అని పెద్దలు చెప్తుంటారు. ఒక్కసారి వాటిని పెంచుకోవటం మొదలు పెట్టారంటే చాలు.. అవి తమ జీవితాంతం యజమానులకు విశ్వస పాత్రులుగా ఉండి పోతాయి. మనిషికైన కొన్ని సందర్భాల్లో విశ్వాసం ఉండకపోవచ్చు.. కానీ శునకాలు అలా కాదు. తమ యజమానుల కోసం ప్రాణాలను సైతం అర్పిస్తాయి. అటువంటి ఓ ఘటనే కృష్ణ జిల్లాలో చోటు చేసుకుంది. ఓ శునకం తమ యజమాని ఇంట్లోకి వచ్చిన పామును అడ్డుకుని పోరాడి ప్రాణాలనే కోల్పోయింది. వివరాల్లోకి వెళితే..
నందిగామకు చెందిన వ్యాపారి నర్వనేని మురళికి పట్టణ శివారులో ఓ గెస్ట్ హౌస్ ఉంది. అక్కడ రెండు శునకాలను ఆరేళ్లుగా పెంచుకుంటున్నాడు. అవి అక్కడే ఉంటూ గెస్ట్ హౌస్ కి కాపలా కాస్తున్నాయి. శనివారం అర్థరాత్రి సమయంలో గెస్ట్ హౌస్ లోకి దాదాపు ఆరడుగుల పోడవైన తాచు పాము వచ్చింది. రెండు శునకాల్లోని కైజర్ అనే కుక్క, పామును పసిగట్టి దానితో పోరాటానికి దిగింది.
ఇలా కొట్లాడే సమయంలో కైజర్ పాము కాటుకు గురైయింది. అయిన పట్టువదలకుండా పాముతో కొట్లాడి దానిని చంపేసింది. ఈ క్రమంలో కైజర్ కూడా ప్రాణాలు కోల్పోయింది. ఆదివారం ఉదయం గెస్ట్ హౌస్కు వెళ్లిన యజమాని, అక్కడి దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. యజమాని కోసం ప్రాణాలకు తెగించి మరీ పోరాడిన శునకాన్ని సంప్రదాయబద్ధంగా ఖననం చేశారు. విశ్వాసం కోసం శునకం ప్రాణాలను సైతం అర్పించిన ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
