సాధారణంగా మన పరిసరాల్లో జరిగే గాన కచేరిలు, ఇతర ఈవెంట్స్ చూసి తెగ ఎంజాయ్ చేస్తుంటాము. కళాకారులు చేసి వివిధ ప్రదర్శనలు చూసి ఆశ్చర్యానికి లోనవుతుంటాము. అయితే కొందరు వారి ప్రతిభకు మెచ్చి ఈవెంట్స్ మధ్యలోనే తమకు తోచినంత డబ్బులు ఇస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో అభిమానులు సంతోషానికి హద్దులేకుండా పోతుంది. దీంతో కళారుల ప్రదర్శనకు మంత్రముగ్ధులైన అభిమానులు వారిపై కరెన్సీ నోట్ల వెదజల్లుతుంటారు. తాజాగా గుజరాత్ లో కూడా అలాంటి ఘటన ఒకటి జరిగింది. అక్కడ ఓ కార్యక్రమంలో కచేరి నిర్వహిస్తున్న వారిపై అభిమానులు నోట్ల వర్షం కురిపించారు. దాదాపు రూ.50 లక్షలు కరెన్సీ నోట్లను కళాకారులపై చల్లారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గుజరాత్ రాష్ట్రం నవ్‌సారి జిల్లాలోని సుపా గ్రామంలో స్వామి వివేకానంద ఐ మందిర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం భజన్ కార్యక్రమం జరిగింది. కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి కోసం విరాళాలు సేకరించే ఉద్దేశంతో ఈ గాన కచేరి ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో ప్రముఖ గాయకుడు కీర్తిదాన్ గధ్వి.. తనదైన గానంతో అందరి ఆకట్టుకున్నారు. అంతేకాక ఈ కచేరిని వీక్షించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు వచ్చారు. ఈ క్రమంలో గాన కచేరిలో అభిమానులు ఆనందం కట్టలు తెంచుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన వారు సంగీత కళాకారులపై కరెన్సీ నోట్ల వర్షం కురిపించారు. గాయకుడు కీర్తిదాన్ గధ్విపై చాలా సమయంలో పాటు డబ్బులను వెదజల్లారు.
అలా అభిమానులు వెదజల్లిన డబ్బులను లెక్కించగా దాదాపు రూ.50 లక్షలు సమకూరినట్లు ట్రస్ట్ పేర్కొంది. కచేరి ద్వారా సమకూరిన డబ్బుల ను ట్రస్ట్ సేవలకు వినియోగిస్తామని తెలిపింది. కాగా, సంగీత కచేరిలో అభిమానులు డబ్బులు వెదజల్లుతున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి.. ఇలా కళాకారులపై అభిమానంతో లక్షల్లో కరెన్సీ నోట్ల వర్షం కురిపించడంపై మీ అభిప్రాయాలాను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.