ప్రయాణీకులకు ఇండియన్ రైల్వేస్ షాక్ ఇస్తోంది. ఇకపై ఇష్టమొచ్చినంత లగేజ్ తీసుకెళ్లందుకు వీలుండదు. విమానాల తరహా వ్యవస్థ అమలుకు శ్రీకారం చుట్టింది. ఎవరు ఎంత లగేజ్ తీసుకెళ్లవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇండియన్ రైల్వేస్ నుంచి ప్రయాణీకులకు కీలకమైన అప్‌డేట్ వెలువడింది. ఇప్పటి వరకూ రైలు ప్రయాణాల్లో ఎంత కావాలంటే అంత లగేజ్ తీసుకెళ్లేందుకు వీలుండేది. ఇకపై దీనికి రైల్వే శాఖ చెక్ పెడుతోంది. లగేజ్ విషయంలో విమానాల తరహా వ్యవస్థ ప్రవేశపెట్టింది. ఇక నుంచి రైల్వే ప్రయాణీకులు నిర్దేశిత లగేజ్ పరిమితుల్ని కఠినంగా పాటించాల్సి ఉంటుంది. తాజా నిబంధనల ప్రకారం ప్రయాణీకులు ప్రతి రైల్వే స్టేషన్‌లో ఉండే ఎలక్ట్రానిక్ కాటాల వద్ద బరువు చెక్ చేసుకోవల్సి ఉంటుంది. నిర్దేశిత బరువు కంటే ఎక్కువగా ఉంటే అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
తొలిదశలో ఈ రైల్వే స్టేషన్లలో..
భారతీయ రైల్వే తొలి దశలో ప్రయోగాత్మకంగా నార్త్ సెంట్రల్ జోన్ పరిధిలోని ప్రయాగ్ రాజ్, ప్రయాగ్ రాజ్ ఛియోకి, సుబేదార్ గంజ్, కాన్పూర్ సెంట్రల్, మీర్జాపూర్, తుండ్లా, అలీఘర్ జంక్షన్, గోవింద్ పురి, ఇటావా స్టేషన్లలో అమలు చేయనున్నారు. నిర్దేశిత బరువు ఉంటేనే ప్రయాణీకులను అనుమతిస్తారు. నిర్దేశిత బరువుతో పాటు నిర్దేశిత పరిమాణం కూడా ఉండాలి. లేకపోతే అదనంగా ఛార్జీలు చెల్లించాలి.
లగేజ్ ధరలు ఇలా
ఏసీ ఫస్ట్ క్లాస్ కేటగరీలో ప్రయాణీకులకు 70 కిలోల వరకు బరువుకు అనుమతి ఉంటుంది. అదే ఏసీ సెకండ్ క్లాస్ అయితే 50 కిలోలు, ఏసీ థర్డ్ క్లాస్ అయితే 40 కిలోల వరకు అనుమతి ఉంటుంది. జనరల్ కేటగరీ ప్రయాణీకులకు మాత్రం కేవలం 30 కిలోల వరకే అనుమతి ఉంటుంది. పరిమాణం పెద్దదిగా ఉంటే బరువుతో సంబంధం ఉండదు. జరిమానా చెల్లించిన తరువాతే తీసుకెళ్లేందుకు వీలుంటుంది.