తీవ్రమైన నడుము నొప్పి, మూత్రం పోసేటప్పడు మంట వస్తుండడంతో ఆస్పత్రికి వెళ్లాడో వ్యక్తి. అవసరమైన స్కానింగ్‌లు తీస్తే కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు తేలింది. ఆ రాయిని తీసివేసేందకు సర్జరీ అవసరమని చెప్పి, ఏకంగా కిడ్నీనే తీసేశాడు ఆ వైద్యుడు. అతని నిర్లక్ష్యం కారణంగా ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వైద్య వృత్తికే కళకం తెచ్చే ఈ ఘటన గుజరాత్లో చోటు చేసుకుంది. ఖేడా జిల్లా వాంగ్రోలి గ్రామానికి చెందిన దేవేంద్రభాయ్ రావల్ అనారోగ్యంతో బాధపడుతూ బాలాసినూర్లోని కేఎంజీ జనరల్ ఆస్పత్రికి వెళ్లాడు. డాక్టర్ శివ్భాయ్ పటేల్ అతన్ని పరీక్షించి, కిడ్నీలో 14 ఎంఎం రాయి ఉందని సర్జరీ అవసరమని చెప్పాడు. సర్జీరి పూర్తి చేశాడు.

దాని తర్వాత మరింత నొప్పి రావడంతో రావల్ అహ్మదాబాద్‌లోని ఐకేడీఆర్సీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పూర్తి స్థాయి పరీక్షలు జరిపిన వైద్యులు అతని ఎడమ కిడ్నీ తొలగించినట్లు నిర్ధారించారు. కొన్ని రోజులకు రావల్ మరణించాడు. దీంతో అతని భార్య కోర్డును ఆశ్రయించింది. కేసు విచారించిన కోర్టు వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే రావల్ మృతి చెందినట్లు, నష్టపరిహారంగా అతని భార్యకు రూ.11.23 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. రావల్ 2011 మేలో ఆస్పత్రిలో చేరి 2012లో మరణించాడు. అప్పటి నుంచి కేసు కోర్టులో నడుస్తుంది. ఇప్పుడు కోర్టు తీర్పు ఇస్తూ 2012 నుంచి రూ.11.23 లక్షలపై వడ్డీ చెల్లించాలని ఆదేశించింది.
