వరంగల్- ఒక్కోసారి రాజకీయ నాయకులు ఏంమాట్లాడతారో వారికే తెలియదు. కొన్ని సందర్బాల్లో కావాలని కొందరు మాట్లాడితే, కొన్ని సమయాల్లో అనుకోకుండా ఎదో మాట్లాడితే, ఇంకేదో అవుతుంది. చిన్న మాట కూడా చిలికి చిలికి గాలి వాన అయిన సందర్బాలు మనం చాలా చూశాం. ఇదిగో తెలంగాణ మంత్రి ఓ మహిళా అధికారిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.
వరంగల్ జిల్లాలో పల్లే ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామ సభలో ఓ మహిళా అధికారిపై మంత్రి ఎర్రబెల్లి అనుచిత వ్యాఖ్యలు చేశారు. మహిళా ఎంపీడీఓ ను.. మేడం బాగానే ఊపుతున్నావ్.. ఈడ ఊపుతలేవ్.. అంటూ ఎర్రబెల్లి దయాకర్ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. మంత్రి మహిళా అధికారిపై అలా కామెంట్ చేయగానే అధికారులు నవ్వి ఊరుకోవడం కలకలం రేపుతోంది.

ఆ మాటల ద్వారా ద్వంద్వార్థాలు ధ్వనిస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక మహిళా అధికారి పట్ల మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేయడం, పక్కనే ఉన్న సహచర ప్రజా ప్రతినిధులు నవ్వడం వివాదాస్పదమవుతోంది. బాధ్యాతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు తీరుపై జనం మండిపడుతున్నారు.
ఈ ఘటనపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. తనపై ఉద్దేశ పూర్వకంగా కొంత మంది బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆ మహిళా అధికారి ఫ్యామిలీతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని, అందుకే అంత చనువుగా క్యాజువల్ గా కామెంట్ చేశానని వివరణ ఇచ్చారు ఎర్రబెల్లి.
