తెలుగు ఫిలిం ఛాంబర్ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. సోమవారం (రేపటి) నుండి తెలుగు సినిమా షూటింగ్స్ అన్ని బంద్ కు పిలుపునిచ్చాయి. దీంతో ఆగస్టు 1వ తేదీ నుండి సినిమా షూటింగ్స్ అన్ని నిలిచిపోనున్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సినిమాలు సైతం షూటింగ్ ని నిలిపివేయాలని ఫిలిం ఛాంబర్ ఆదేశించింది. ఫిలిం జనరల్ బాడీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాత దిల్ రాజు తెలిపారు.
ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ వచ్చిన తర్వాత చాలా మార్పులొచ్చాయి. దాంట్లో ప్రేక్షకులు, ఓటిటిలు, టికెట్ ధరలు, షూటింగ్ లో జరుగుతున్న వేస్టేజ్.. ఇలా చాలా సమస్యలపై చర్చలు జరిపి, పరిష్కరించుకొని ముందుకెళ్లాల్సి ఉంది. కావున రేపటి నుండి(ఆగష్టు 1) తెలుగు సినిమా షూటింగ్స్ ని మేమే ఆపుకుంటున్నాం. ఈ సమస్యలను పరిష్కరించుకుంటూ మళ్లీ ఎప్పుడు షూటింగ్స్ ప్రారంభిస్తామో మీడియా ముఖంగా తెలియజేస్తాము.
దీనిపై చిన్న నిర్మాతల నుండి పెద్ద నిర్మాతల వరకు అందరూ ఒకే మాటమీద ఉండటానికి జరిగిన జనరల్ బాడీ మీటింగ్ లో మద్దతు తెలిపారు. వాళ్లందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది నిర్మాతల సమస్య. అందరం కూర్చొని మాట్లాడుకుంటూ త్వరలోనే ఈ సమస్యలకి పరిష్కారం కనుక్కోవాల్సి ఉంది.” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఫిలిం ఛాంబర్ తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఆగష్టు 1 నుండి సినిమా షూటింగ్స్ ఆపేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.