తెలుగు సినిమా చరిత్రలో నిర్మాతగా అశ్వినీదత్‌కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించారు. అయితే ఆయన కెరీర్‌లో కొన్ని యావరేజ్‌లు, ఫ్లాపులు కూడా ఆయన్ని పలకరించాయి. కానీ శక్తి పలకరించినంత క్లోజ్‌గా మరే మూవీ ఆయన్ని పలకరించలేదట. ఏకంగా ఊరొదిలిపెట్టి పోవాల్సిన పరిస్థితి వచ్చిందట. శక్తి సినిమా దెబ్బకి అశ్వినీదత్ ఏడేళ్ళు ఇండస్ట్రీకి దూరమయ్యారు. టిఎఫ్‌పిసికి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ శక్తి ఎంత పెద్ద డిజాస్టరో మనకి తెలిసిందే. ఎన్టీఆరే కాదు, ఆ సినిమాని నిర్మించిన ప్రొడ్యూసర్ కూడా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు. అంతలా అపజయాన్ని మూటగట్టుకుంది. ఈ సినిమా దెబ్బకి ఆల్మోస్ట్ హైదరాబాద్ వదిలి విజయవాడ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని, అయితే తనకి అప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండడంతో ఈ శక్తి ఊబి నుంచి బయట పడ్డానని అశ్వినీదత్ అన్నారు. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారమే లేకపోతే తాను ఎప్పుడో హైదరాబాద్ వదిలి అన్నీ సర్దుకుని విజయవాడ వెళ్ళిపోయేవాడినని అన్నారు.
అయితే ఇక సినిమాలు చేయకూడదు అనుకున్న సమయంలో నాగ్ అశ్విన్ వచ్చాడని, అతను వచ్చాక లైఫ్ బాగుందని అన్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమాతో భారీ సక్సెస్‌ను అందుకున్న అశ్వినీదత్ ఆ తర్వాత మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాకి పార్టనర్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించి మరో సక్సెస్ అందుకున్నారు. వైజయంతి మూవీస్ , స్వప్న సినిమా బ్యానర్లు రెండూ ఈయనవే అన్న విషయం తెలిసిందే.
ఈయన పర్యవేక్షణలో ఆయన కూతుర్లైన ప్రియాంక దత్, స్వప్న దత్‌లు స్వప్న సినిమా బ్యానర్‌పై.. ఎవడే సుబ్రమణ్యం, మహానటి, జాతిరత్నాలు సినిమాలు చేశారు. జాతిరత్నాలు సినిమా కూడా అశ్వినీదత్‌కు లాభాలను తెచ్చిపెట్టింది. ఇలా వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న అశ్వినీదత్ ఇప్పుడు హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీతా రామం’ సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. దుల్కర్ సల్మాన్ హీరోగా, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సుమంత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీని వైజయంతి మూవీస్, స్వప్న సినిమా సంయుక్త బ్యానర్స్‌లో అశ్వినీదత్ నిర్మించారు.
అంతేకాదు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో, ప్రభాస్ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న “ప్రాజెక్ట్ కె” సినిమాకి అశ్వినీదత్ నిర్మాతగా ఉన్నారు. ఈ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతి ఇంకా పెరిగిపోతుందని, ఇప్పటివరకూ ఉన్న రికార్డులను తిరగరాస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో అమితాబ్ బచ్చన్ నటిస్తుండడం విశేషం. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో హీరోయిన్‌గా దీపికా పదుకునే, దిశా పటానీ నటిస్తున్నారు. మరి శక్తి సినిమాపై వ్యాఖ్యలు చేసిన అశ్వినీదత్‌పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.