Adipurush: ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదిపురుష్’. ప్రముఖ హిందీ దర్శకుడు ఓం రౌవత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక, ఈ సినిమా షూటింగ్ శరావేగంగా సాగుతోంది. అయితే, ఆదిపురుష్‌కు సినిమాకు సంబంధించి ప్రభాస్ ఫ్యాన్స్ చాలా గుర్రుగా ఉన్నారు. షూటింగ్ మొదలైనప్పటినుంచి సినిమా టీం తమ హీరోకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ ఇవ్వటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. చాలా సార్లు సోషల్‌మీడియా వేదికగా కంప్లైంట్‌లు ఇవ్వటమో కాకుండా ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ఒక చిన్న అప్‌డేట్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో చాలా నెలల తర్వాత సినిమా టీం ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. శుక్రవారం సినిమాకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ రానుంది. ఈ మేరకు ప్రముఖ జర్నలిస్ట్ హిమేష్ మన్‌కద్ తన ట్విటర్ ఖాతాలో ‘‘ ఎక్స్‌క్లూజివ్‌గా ఆది పురుష్ ఫ్యాన్స్ అందరికీ.. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. శుక్రవారం ఉదయం 7.11 గంటలకు ఆదిపురుష్ టీజర్ పోస్టర్ రిలీజ్ కాబోతోంది. మీరు సిద్ధమేనా’’ అని పేర్కొన్నాడు. ఈ అప్‌డేట్‌తో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. రేపు విడుదలవ్వనున్న టీజర్ పోస్టర్‌లో తమ హీరో లుక్ ఎలా ఉండనుందో ఇప్పటినుంచే ఊహించేసుకుంటున్నారు.
చాలా రోజుల తర్వాత మంచి అప్‌డేట్ రాబోతుండటంతో ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఆదిపురుష్ సినిమా దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. సీత పాత్రలో కృతిసనన్, రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. టీ సిరీస్ ప్రొడక్షన్ కంపెనీ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమా అతి త్వరలో ప్యాన్ ఇండియా లెవెల్‌లో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. తెలుగు ప్రేక్షకులతో పాటు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
EXCLUSIVE – ALL YOU ADIPURUSH FANS – THE MUCH AWAITED DAY IS HERE – #Adipurush teaser poster out TOMORROW, at 7.11 am. Are you READY??? Teaser on Sunday. #Prabhas #KritiSanon #SaifAliKhan #OmRaut #TSeries #BhushanKumar
— Himesh (@HimeshMankad) September 29, 2022