మహిళా దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పూనమ్ కౌర్ మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి. ప్రభుత్వంపై పరోక్షంగా సెటైర్లు వేశారు పూనమ్ కౌర్. ఆ వివరాలు..
నటి పూనమ్ కౌర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. సినిమాలతో పాటు, సొసైటీలో చోటు చేసుకునే సంఘటనలపై కూడా స్పందిస్తూ ఉంటారు. కొన్ని సార్లు ఆమె చేసే ట్వీట్లు.. అర్థం కాకుండా ఉంటాయి. వివాదాలకు అడ్డగా మారతాయి. ఇక రాహుల్ గాంధీ జోడో యాత్ర సందర్భంగా పూనమ్ కౌర్ ఆయనను కలవడం.. ఆ సందర్భంగా చోటు చేసుకున్న ఓ సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇక తాజాగా రాజ్ భవన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పూనమ్ హాజరైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తీవ్ర భావోద్వేగానికి గురవ్వడమే కాక.. తాజాగా తెలంగాణలో చోటు చేసుకుంటున్న ఘటనలపై స్పందించింది. ప్రసుత్తం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.
ఈ సందర్భంగా పూనమ్ కౌర్ మాట్లాడుతూ.. ‘‘నేను పుట్టింది తెలంగాణలోనే. ఇక్కడే జన్మించాను.. ఇక్కడే పెరిగాను.. ఇక్కడే బతుకుతున్నారు. కానీ చాలా మంది నా మతాన్ని చూపించి.. నన్ను పంజాబీ అంటూ ఈ రాష్ట్రం నుంచి వేరు చేసి మాట్లాడతారు. వారి మాటలు నన్ను ఎంతో బాధిస్తాయి. కానీ నేను మీ అందరిలానే తెలంగాణ బిడ్డని. మళ్లీ చెబుతున్నా.. దయచేసి మైనారిటీ అని, సిక్కు అని.. నన్ను వేరు చేసి చూడవద్దని వేడుకుంటున్నా’’ అంటూ.. వేదికపైనే ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం ఆమె మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అలానే ఇటీవల మృతి చెందిన వైద్య విద్యార్థిని ప్రీతిని తలచుకుని పూనమ్ కౌర్ ఎమోషనల్ అయ్యారు. ‘‘రాజకీయ స్వార్థం కోసం మహిళల్ని తొక్కేస్తున్నారు. అలా బలవుతున్న వాళ్లల్లో నేను ఒకదాన్ని. బాధితులకు రాజకీయ అండదండలుంటేనే పట్టించుకుంటారా.. తెలంగాణను సాధించుకుంది.. తెలంగాణ బిడ్డల కోసమే కదా.. మరి మీ బిడ్డలు మాత్రమే ఎదగాలంటే ఎలా. చేనేతకు ప్రోత్సాహం గురించి సీఎం మాట్లాడతారు. దాని కోసం ఉద్యమం చేస్తున్న నేను మాట్లాడతాను అంటే ఎందుకు టైమ్ ఇవ్వరు’’ అని ప్రశ్నించారు పూనమ్ కౌర్.
అంతేకాక ‘‘ప్రీతి, దిశ ఘటనలు ఇక్కడే ఎందుకు జరుగుతున్నాయి. తెలంగాణ వచ్చాక.. తెలంగాణ వాళ్లను వదిలేస్తున్నారు. మాది తెలంగాణ కాదా.. మేం తెలంగాణ బిడ్డలం కాదా. సినిమా ఇండస్ట్రీలోనూ అంతే. మీకిష్టమైన వాళ్లకు, ముంబై అమ్మాయిలకే ఆఫర్లు ఇస్తారా.. అమ్మాయిలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తే.. ముందు సతాయించిన మనిషిని చంపేయండి. భరించలేని స్థితిలో కత్తి పడితే తప్పులేదు’’ అంటూ పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై నెటిజనులు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.
నేను తెలంగాణలో పుట్టాను.. నేను తెలంగాణ బిడ్డనే
నేను పంజాబీని అని, సిక్కుని అని.. మతం పేరు మీద నన్ను తెలంగాణ నుండి వేరుచేద్దాం అని చూస్తున్నారు – పూనమ్ కౌర్#PoonamKaur #Telangana pic.twitter.com/jExlCJ82vp
— Telugu Scribe (@TeluguScribe) March 6, 2023
ఇక పూనమ్ కౌర్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రసుత్తం ఆమె ఆధ్యాత్మిక పర్యటనలు చేస్తూ.. తాను సందర్శించిన దేవాలయాల ప్రాముఖ్యతను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇక నటిగా మాత్రం ఆమె చేతిలో ఇప్పుడు ఎలాంటి సినిమాలు లేవు. ఇక ఆమె చివరిగా కనిపించిన చిత్రం ‘నాతిచరామి’. లేడీ, మెసేజ్ ఓరియంటెడ్‌గా తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు 20 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదలైంది. మరి పూనమ్ కౌర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.