ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని సినీ రంగంలో ధృవతారగా ఓ వెలుగు వెలిగి.. చివరకు అందరూ ఉన్నా అనాథలా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిన అలనాటి స్టార్ నటి కానన్ దేవి వర్థంతి నేడు (జూలై 17). ఈ సందర్భంగా ఆమె జీవితం గురించి ఇప్పుడు చూద్దాం.
సినిమా అంటే రంగుల ప్రపంచం.. ఎన్నో ఆశలు, కలలతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం తేలికే కానీ అవకాశం రావడం కష్టం. వచ్చిన దాన్ని ఎలాంటి అడ్డంకులు లేకుండా చివరి వరకు నిలబెట్టుకోవడం, కాస్త నేమ్, ఫేమ్ వచ్చాక దాన్ని కాపాడుకోవడం మరింత కష్టం. సినిమా వాళ్ల జీవితాలు బయటకి కనిపించినంత సంతోషంగా ఏమీ ఉండవ్. పరిశీలిస్తే ప్రతి ఒక్కరూ సినిమా కష్టాలు పడ్డవారే. తెరమీద ఎలా కనిపించినా, తెరవెనుక జాగ్రత్తగా లేకపోతే మాత్రం చాలా కష్టం అని ఎందరో మహామహుల జీవిత గాధల్ని చూస్తే తెలుస్తోంది. చిన్నతనం నుండే కష్టాలు, వేశ్యాగృహాల దగ్గర్లో నివాసం.. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని సినీ రంగంలో ధృవతారగా ఓ వెలుగు వెలిగి.. చివరకు అందరూ ఉన్నా అనాథలా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిన అలనాటి స్టార్ నటి కానన్ దేవి వర్థంతి నేడు (జూలై 17). ఈ సందర్భంగా ఆమె జీవితం గురించి ఇప్పుడు చూద్దాం.
తండ్రి మరణంతో కష్టాలపాలు..
పశ్చిమబెంగాల్‌లోని హౌరాలో ఓ నిరుపేద కుటుంబంలో 1916 ఏప్రిల్ 22న జన్మించింది కానన్ దేవి. రతన్ చంద్రదాస్, రాజో బాలదాస్ తల్లిదండ్రులు. తండ్రి ఆమెకు సంగీతంలో శిక్షణ ఇచ్చేవాడు. కొంత కాలానికే ఆయన మరణించడంతో ఇంటికి పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఆర్థిక కష్టాలు వెంటాడాయి. ఇంటి అద్దె కూడా కట్టలేకపోవడంతో యజమాని ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు.
పసి ప్రాయంలో పని మనిషిగా..
బతుకుదెరువు కోసం ధనవంతుల ఇంట్లో పనిమనుషులుగా చేరారు కానన్, ఆమె తల్లి. తలదాచుకోవడానికి నిలువ నీడ లేక అల్లాడిపోతున్న వారికి ఓ బంధువు ఇల్లిచ్చి అందులో నివాసముండమన్నాడు. ఆ బంధువే రాబంధువవుతాడని గ్రహించలేకపోయారు.. పసి పిల్ల అని కూడా చూడకుండా కానన్‌తో, ఆమె తల్లితో వెట్టి చాకిరీ చేయించేవాడు. వారితో అసభ్యంగా ప్రవర్తించేవాడు. అతడి ఆగడాలు భరించలేక అక్కడి నుండి బయటకు వచ్చేశారు.
బాలనటి నుంచి స్టార్ హీరోయిన్‌గా..
ఎక్కడికి వెళ్లాలో దిక్కుతోచని స్థితిలో కలకత్తా వదిలి హౌరా వెళ్లిపోయారు. అక్కడ వేశ్యాగృహాలకు దగ్గర్లో ఓ గది అద్దెకు తీసుకుని జీవించసాగారు. వీరికి పరిచయస్థుడైన తులసీ బెనర్జీ, కానన్ దేవి సినిమాల్లో రాణించగలదని గ్రహించాడు. అప్పుడు కానన్ వయసు 10 ఏళ్లు. మదన్ మూవీ స్టూడియో ‘జైదేవ్’ అనే సినిమాలో అవకాశమిచ్చింది. ఇందుకుగానూ తనకు నెలకి రూ.5 చొప్పున జీతమిచ్చారు. 1928-31 మధ్య బాలనటిగా పలు చిత్రాలు చేసింది. అదే సమయంలో గాయనిగానూ సత్తా చాటింది. ‘శంకరాచార్య’, ‘రిషిర ప్రేమ్’, ‘జోరేబరత్’, ‘విష్ణుమాయ’, ‘ప్రహ్లాద్’ వంటి పలు చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మేడమ్ అని పిలిపించుకున్న ఫస్ట్ హీరోయిన్..
21 ఏళ్లకే కథానాయికగా మారిన కానన్ దేవి అందానికి, నటనకి దాసోహం కాని వారు లేరంటే అతిశయోక్తి కాదు. తక్కువ టైంలోనే సిల్వర్ స్క్రీన్ సూపర్ స్టార్ అయిపోయింది. అప్పట్లోనే పాట పాడినందుకు రూ. లక్ష, సినిమాలో నటించినందుకు రూ. 5 లక్షల తీసుకునేది. ఓవరాల్‌గా 40 పాటలు పాడింది. 57 సినిమాలు చేసింది. హీరోలకు సలాం కొడుతున్న రోజుల్లో ‘మేడమ్’ అని పిలుపించుకున్న ఫస్ట్ హీరోయిన్ ఈమెనే. కేఎల్ సెఘల్, పంకజ్ మాలిక్, ప్రథమేశ్ బరువా, పహరి సాన్యల్, అశోక్ కుమార్, చబీ బిస్వాస్ లాంటి హీరోలతో నటించి.. హీరోలకు తీసిపోని స్థాయిలో కోటీశ్వరురాలిగా ఎదిగింది.
కలిసిరాని వైవాహిక జీవితం..
కానన్ దేవి 1940లో బ్రహ్మ సమాజ సభ్యులు హిరంబ చంద్ర మిత్ర కుమారుడైన అశోక్ మిత్రాను వివాహం చేసుకుంది. సంసార జీవితం సజావుగా సాగలేదు. ఐదేళ్ల తర్వాత విడాకులిచ్చేసింది. 1949లో బెంగాల్ గవర్నర్ దగ్గర ఏడీసీగా పని చేసిన హరిదాస్ భట్టాచార్జితో పెళ్లి పీటలెక్కింది. కానన్‌తో పెళ్లి తర్వాత హరిదాస్ దర్శకుడిగా చేసినప్పటికీ, అందరూ అతడిని కానన్ భర్తగానే గుర్తించారు. ఇది జీర్ణించుకోలేక 1987లో భార్య ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. వీరిద్దరూ వేర్వేరుగా ఉన్నా విడాకులు మాత్రం తీసుకోలేదు. 1992 జూలై 17న 76 ఏళ్ల వయసులో కానన్ దేవి అనారోగ్యంతో కన్నుమూసింది. కనీసం ఆమెను చివరి చూపు చూసేందుకు కూడా హరిదాస్ రాలేదు. ఎంతోమంది ప్రేక్షాభిమానులను సంపాదించుకున్న కానన్ అనాధగా తనువు చాలించింది. ఆమె చిత్ర పరిశ్రమకు అందించిన సేవలకు గుర్తుగా 2011లో తపాలా శాఖ కానన్ దేవి పేరిట ఓ స్టాంపును విడుదల చేసింది.