‘అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించలేరు, జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదు’.. ఇది జస్ట్ సినిమా డైలాగ్. కానీ చాలామందికి కనెక్ట్ అయ్యే డైలాగ్. ఎందుకంటే ప్రతి ఒక్కరూ లైఫ్ లో చాలా కష్టపడతారు. నలుగురిలో పేరు తెచ్చుకోవాలని ఆరాటపడతారు. కాకపోతే కొందరు సక్సెస్ అవుతారు. చాలామందికి ఇన్సిపిరేషన్ అవుతారు. ఇదంతా ఎందుకు చెబుతున్నాం అంటే.. ‘లవ్ టుడే’ అని ఈ మధ్యే ఓ మూవీ వచ్చింది. అందులో హీరోని చూస్తే పక్కింటి అబ్బాయిలా అనిపిస్తాడు. ఇప్పుడు స్టడీస్ కంప్లీట్ చేసిన కుర్రాడిలా కనిపిస్తాడు. కానీ లైఫ్ లో ఎన్నో కష్టాలు పడిన తర్వాతే ఈ స్టేజీకి వచ్చాడు. ఇప్పుడు తెలుగు, తమిళం అనే తేడా లేకుండా వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. సినిమా ఇండస్ట్రీలోకి ఎంతో కష్టపడితే గానీ రావడం కుదిరేది కాదు. టెక్నాలజీ మన జీవితాల్లోకి వచ్చిన తర్వాత ట్రెండ్ మారింది. కుర్రాళ్ల క్రియేటివిటి బయటకొచ్చింది. ఉన్నంత సదుపాయాలతోనే షార్ట్ ఫిల్మ్స్ తీసేవారు. ఓ పదేళ్ల ముందు మొదలైన ఈ ట్రెండ్ ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. అలా ఏదో సరదాకి తీసిన షార్ట్ ఫిల్మ్స్.. వాళ్లకు చాలా పేరు తీసుకొచ్చాయి. ఇంకా చెప్పాలంటే అవార్డులు కూడా తెచ్చిపెట్టాయి. వాళ్లకు లైఫ్ మీద ఓ హోప్ క్రియేట్ చేశాయి. అలా కుర్రాళ్లు కాస్త చాలామంది ఇండస్ట్రీలోకి వచ్చారు. అద్భుతాలు సృష్టిస్తున్నారు.
ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి ప్రదీప్ రంగనాథన్. తమిళనాడుకు చెందిన నటుడు-దర్శకుడు. ఇతడిని చూస్తే ఎవరికీ డైరెక్టర్ అని అస్సలు అనిపించదు. ఎందుకంటే చూడటానికి ఇంజనీరింగ్ స్టూడెంట్ లా కనిపిస్తాడు. తన యాక్టింగ్, సినిమాలతో మాత్రం వావ్ అనిపిస్తాడు. అది మనోడి టాలెంట్. రీసెంట్ గా ‘లవ్ టుడే’ అని ఓ సినిమా తీశాడు. తమిళంలో నవంబరు 4న రిలీజైన ఈ మూవీ బడ్జెట్ రూ.5 కోట్లు. కానీ రెండే రెండు వారాల్లో ఏకంగా రూ.50 కోట్ల వసూలు చేసింది. ఈ సినిమా స్టోరీ గురించి చెప్పాలంటే చాలా సింపుల్. కానీ యూత్ కు అలా కనెక్ట్ అయిపోయింది. ఇక తాజాగా తెలుగులో రిలీజ్ చేయగా ఇక్కడ కూడా హిట్ టాక్ తెచ్చుకుని రోజురోజుకు వసూళ్లు పెంచుకుంటూ పోతుంది.
కాలేజ్ చదివేటప్పుడు ప్రదీప్ అందరిలాంటి కుర్రాడే. మిడిల్ క్లాస్ నుంచి వచ్చాడు కాబట్టి మనోడు కెరీర్ పరంగా కాస్త ఆలోచనలో ఉండేవాడు. కానీ మరోపక్క నుంచి సినిమా అనే పురుగు తెగ తిరిగేది. అందుకే బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉండగానే.. ‘వాట్సాప్ కాదల్’ (వాట్సాప్ ప్రేమ) అనే షార్ట్ ఫిల్మ్ తీసి తన యూట్యూబ్ లో దాదాపు ఎనిమిదేళ్ల క్రితమే అప్ లోడ్ చేశాడు. షార్ట్ ఫిల్మ్ ట్రెండ్ బాగా ఉన్న ఆ టైంలో చాలా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కూడా ‘కాలేజ్ డైరీస్’, ‘హైవే కాదలీ’ అనే షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశాడు. ఇక ఇదే ఊపులో ఓ స్టోరీ రెడీ చేసుకుని డైరెక్టర్ అవుదామని బయలుదేరాడు. అదే ‘కోమలి’. పలువురు ప్రొడ్యూసర్స్ దగ్గరకు తిరిగి తిరిగి.. ఫైనల్ గా ఓ నిర్మాత, ప్రదీప్ స్టోరీ ఓకే చేశారు.
అలా 23 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ గా ఫస్ట్ ఛాన్స్ దక్కించుకున్నాడు. సాధారణంగా మిడిల్ క్లాస్ కుర్రాళ్లు ఎవరైనా సరే ఆ ఏజ్ లో లైఫ్ లో సెటిలైపోవాలని చూస్తారు. కానీ నచ్చిన పనికోసం కష్టపడి, డైరెక్టర్ గా మనోడు ఛాన్స్ కొట్టాడు. జయం రవి, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్స్ ని హీరోహీరోయిన్లు పెట్టి సినిమా తీశాడు. 2019లో రిలీజైన ఈ మూవీతో హిట్ కూడా కొట్టాడు. దీని తర్వాత మనోడికి చాలా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. కానీ ఇతడు అస్సలు తొందరపడలేదు. ‘కోమలి’ నిర్మాత అయితే ప్రదీప్ కు కారు కూడా గిఫ్ట్ గా ఇచ్చాడు. కానీ అతడు మాత్రం సింపుల్ గా నో చెప్పేశాడు.
‘కోమలి తర్వాత నాకు కారు గిఫ్ట్ గా ఇచ్చారు. కానీ నేను దాన్ని రిటర్న్ ఇచ్చేశాను. ఎందుకంటే పెట్రోల్ కొట్టించడానికి నా దగ్గర అంత డబ్బులేవు. అందుకే కారు ఖరీదు ఎంతో అంత డబ్బులు నాకు ఇచ్చేయమని చెప్పాను. ఎందుకంటే ఆ మొత్తంతో మరో మూడేళ్ల పాటు నేను బతికేస్తాను’ అని ప్రదీప్ సదరు నిర్మాతతో చెప్పాడు. ‘లవ్ టుడే’ ప్రమోషన్స్ సందర్భంగా తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టాడు. ఇది విన్న చాలామంది నెటిజన్స్.. గుండెల్ని టచ్ చేశావ్ బ్రదర్ అని కామెంట్స్ పెడుతున్నారు.
అలానే 2019లో ‘కోమలి’ తీస్తే.. మూడేళ్లకు ‘లవ్ టుడే’ సినిమా తీశాడు. ఫస్ట్ సినిమాతో డైరెక్టర్ గా హిట్ కొడితే.. రెండో చిత్రంతో డైరెక్టర్ కమ్ హీరోగా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు కూడా త్వరగా మరో సినిమా తీయడానికి రెడీగా లేడు. ఎందుకంటే తన నచ్చినప్పుడు మరో సినిమా తీస్తానని చెబుతున్నాడు. ‘ఆశపడటంలో తప్పు లేదు కానీ దాన్ని సాధించుకోవడానికి చాలా కష్టపడాలి. ఒకవేళ అలా చేస్తే నువ్వు అనుకున్నది కచ్చితంగా సాధిస్తావు’ అని చెప్పే ప్రదీప్.. మనలాంటి చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్లకు ఫెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ లా కనిపిస్తున్నాడు. మరి ప్రదీప్ రంగనాథన్ లైఫ్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.