కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. పోయినట్లే పోయిన మహమ్మారి మరోసారి సెకండ్ వేవ్ రూపంలో విజృంభిస్తోంది. ఏడాది కాలంగా యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న మహమ్మారి. కోట్ల మందికి సోకి లక్షల మంది ప్రాణాలను బలికొంది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రెండో దశలో కోవిడ్ మహమ్మారి ప్రభావం టాలీవుడ్‌పై తీవ్రంగా ఉంది. కనీసం ప్రతీరోజూ ఒక సెలబ్రిటీ అయినా కరోనా బారినా పడుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ వైరస్ వ్యాప్తిని మాత్రం అరికట్టలేకపోతున్నారు. లాక్‌డౌన్ కారణంగా షోలు లేక ఉపాధి కోల్పోయిన డ్యాన్సర్లకు తనవంతు సహాయాన్ని అందించేందుకు ప్రముఖ కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్ ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రూపు డ్యాన్సర్లు, టీవీ షోలు చేసే డ్యాన్సర్లకు ఈ సమయంలో పని దొరకడం చాలా కష్టంగా మారిందని చెప్పుకొచ్చారు.
ఏదైనా టీవీ షోలు, కార్యక్రమాలు జరిగితే తప్ప వాళ్లకు పని ఉండదన్న శేఖర్ మాస్టర్.. భోజనానికి కూడా డబ్బులు లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. డ్యాన్స్‌నే నమ్ముకుని ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్‌కు వచ్చిన డ్యాన్సర్లదీ అదే పరిస్థితి. వారంతా ప్రస్తుతం సినిమా షూటింగ్‌లు లేక టీవీ షోలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారు ఎవరున్నా తనను సంప్రదించాలని సూచించారు. వారికి తమ టీమ్ కావాల్సిన సరకులు అందిస్తుందని ఆయన చెప్పారు. ఇందుకోసం ఆయన కొన్ని ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంచారు. అలాగే ప్రస్తుతం పరిస్థితులు బాగాలేవని అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావొద్దని, ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తగా ఉండాలని కోరారు.