అన్నా చెల్లెళ్ళు , అక్కా తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగనే రాఖీ పండుగ. ఒకప్పుడు ఉత్తర, పశ్చిమ భారత దేశాలకే పరిమితమైన ఈ పండుగను ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరూ ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరి తన సోదరుడు హోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ రాఖీ కట్టి ఎల్లప్పుడూ అన్నకు అండగా ఉంటానని చెప్తుంది. సోదరి కట్టిన రక్షాబంధనాన్ని స్వీకరించిన అన్న తానెప్పుడూ చెల్లెలికి రక్షగా ఉంటానని ఈ పండుగ ద్వారా తెలియజేస్తారు.
సమాజంలో మానవతా విలువలు మంటగలుస్తున్న నేటి రోజుల్లో రాఖీ పౌర్ణమి వంటి పండుగలు జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సోదర సోదరీమణుల మధ్య ఉండే అనుబంధానికి, ప్రేమానురాగాలకు అద్దం పట్టే పండుగ కావడంతో మానవ సంబంధాల మెరుగుదలకు, విచక్షణకు ఇది ఎంతో దోహదం చేస్తుంది. రాఖీ పండుగను రక్తం పంచుకుని పుట్టిన సోదర సోదరీమణుల మధ్య జరుపుకోవాలని లేదు. ఏ బంధుత్వం లేకపోయినా సోదరుడు, సోదరి అన్న భావన ఉన్న ప్రతి ఒక్కరూ రక్షాబంధనాన్ని కట్టి వారి క్షేమాన్ని కోరుకోవచ్చు. ఆత్మీయుల మధ్య అనుబంధాలకు, ఐకమత్యానికి, పరస్పర సహకారానికి చిహ్నంగా రక్షాబంధనం నిలుస్తుంది.
ఈ సంవత్సరం రాఖీ పౌర్ణమి ఆగస్టు 11న రానుంది. ఈ క్రమంలో రక్షాబంధన్ ఎలా మొదలైంది?.. దీని విశిష్టత ఏంటి? మహాభారతంలో ఈ పండుగ ప్రస్తావన ఉందా అన్న విషయాలు ఇపుడు తెలుసుకుందాం..
వాస్తవానికి భారతదేశంలో రాఖీపౌర్ణమి లేదా రక్షాబంధన్ ఎపుడు ప్రారంభమైందో, ఎలా ప్రారంభమైందో తెలిపే నిర్దిష్ట సాక్ష్యాలు లేవు. కానీ, పురాణాలలో మాత్రం దీనిపై విభిన్న రకాల కథలున్నాయి. వృతాసురుడితో ఇంద్రుడు యుద్ధం చేస్తున్నప్పుడు ఓడిపోయే పరిస్థితి వస్తే.. అప్పుడు తన భర్తకు విజయం చేకూరాలని కోరుతూ ఇంద్రుని భార్య శచీదేవి ఓ పవిత్రమైన దారాన్ని మంత్రించి అతడి కుడిచేతి మణికట్టుకి కట్టిందట. దీంతో ఆయన రాక్షసులను ఓడించి, విజయం సాధించారని అలా ‘రాఖీ పౌర్ణమి’ పుట్టిందని చెబుతారు.
మహాభారతంలో ద్రౌపది, శ్రీకృష్ణుల అన్నాచెల్లెళ్ల అనుబంధం గొప్పది. శిశుపాలుడిని శిక్షించే క్రమంలో తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలికి గాయమై రక్తం ధారగా కారుతుంది. అక్కడే ఉన్న సత్యభామ, రుక్మిణి మొదలైనవారు కంగారుపడి గాయానికి మందుపూయడానికి తలో దిక్కున వెళ్లి వెదుకుతుంటే ద్రౌపది తన చీర కొంగు చింపి వేలికి కట్టు కట్టిందట. దీనికి కృతజ్ఞతగా భగవానుడు ఆమెకు ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇస్తాడు. అందుకే కురు సభలో ద్రౌపది వస్త్రాపహరణానికి దుశ్శాసనుడు ప్రయత్నిస్తే ఆమెను పరంధాముడు ఆదుకున్నాడని.. మరొక కథ.
రాక్షస రాజు బలి చక్రవర్తి భూమండలాన్ని ఆక్రమించినప్పుడు దానవుల నుంచి మానవులను రక్షించడానికి శ్రీమహావిష్ణువు వైకుంఠాన్ని వదిలి వామనుడి రూపంలో భూమి మీదకి వస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి ఒక బ్రాహ్మణ యువతి రూపంలో రాక్షస రాజైన బలి చక్రవర్తి దగ్గరికి వెళుతుంది. శ్రావణ పౌర్ణమి రోజు బలి చక్రవర్తికి పవిత్రదారాన్ని చేతికి కట్టి, తానెవరో చెబుతుంది. తన భర్తని ఎలాగైనా తిరిగి వైకుంఠానికి పంపించాలని కోరుతుంది. అప్పుడు బలి ఆమె కోసం తన రాజ్యాన్ని వదిలి, మానవులకు విముక్తి కలిగిస్తాడు. అలా విష్ణుమూర్తిని వైకుంఠానికి వెళ్లమని కోరతాడు.. ఇలా విభిన్న రకాలుగా ‘రాఖీ పౌర్ణమి’ పుట్టిందని చెపుతారు. రక్షాబంధన్ పండుగపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Raksha Bandhan 2022: రక్షాబంధన్ సంధర్బంగా తక్కువ ధరలో బెస్ట్ గిఫ్ట్స్ మీకోసం..
ఇదీ చదవండి: రక్షాబంధన్ సందర్భంగా తక్కువ ధరలో బెస్ట్ రాఖీలు ఇలా బుక్ చేసుకోండి!