వనపర్తి జిల్లాలో చోటు చేసుకున్న పరువు హత్య తీవ్ర కలకలం రేపుతోంది. ప్రేమ పేరుతో కుటుంబ పరువు తీస్తుందంటూ కన్నకూతురిని తండ్రి నరికి చంపేశాడు. కాళ్లు, చేతులు కట్టేసి గొంతు కోసి.. అత్యంత పాశవికంగా హతమార్చాడు. ఈ ఘటన పెబ్బేరు మండలం పాతపల్లిలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పాతపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్ దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కూతుళ్లు కాగా, ఓ కుమారుడు ఉన్నారు. వీరిలో రెండవ కూతురు గీత(16) పెబ్బేరులోని మోడల్ స్కూల్లో పదవ తరగతి చదువుతోంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఒక యువకుడితో ప్రేమలో పడింది.
గీత ప్రేమించిన యువకుడు వారీ సామజిక వర్గానికి చెందివాడిగా తెలుస్తోంది. ఈ యువకుడు వీరికి బంధువు అవుతాడని సమాచారం. గత రెండు మూడు రోజులుగా ఇంట్లో ఈ విషయమై గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. కుటుంబ పరువు తీయకంటూ తండ్రి, కుటుంబ సభ్యులు గీతకు పలు మార్లు నచ్చజెప్పే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. కానీ గీత ఇవేవీ పట్టించుకోకుండా తిరిగి తన ప్రేమను కొనసాగిస్తానని మారాం చేసినట్లు సమాచారం. దీంతో ఆగ్రహానికి లోనైన తండ్రి, మొదట కూతురు కాళ్లు, చేతులు కట్టేసి.. అపై గొడ్డలితో పీక కోసి.. తరువాత తల నరికినట్లు సమాచారం. ఈ ఘటనలో గీత అక్కడికక్కడే మరణించింది.
ఆపై తండ్రి నేరుగా పెబ్బేరు పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపి లొంగిపోయినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసిన స్థానిక పోలీసులు, డీఎస్పీ ఆనంద్ రెడ్డితో సహా సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను తెలుసుకున్నారు. హత్యకు ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకోవడంతో పాటు, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సొంత కూతురిని తండ్రి హత్య చేయడంతో గ్రామంలో ఒక్కసారిగా భయాందోళన వాతావరణం నెలకొంది. కాగా ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.