డబ్బు.. మనిషిని ఎందాకైన తీసుకెళ్తుంది. మనిషి పుట్టక నుంచి మరణం వరకూ అంతా డబ్బుతోనే ముడిపడి ఉండటంతో ప్రతీ ఒక్కరూ ఎలా సంపాదించాలని ఆలోచనలు చేస్తూ ఉంటారు. అయితే ప్రపంచ మానవాళి అధిక శాతం సమయాన్ని డబ్బు సంపాదనకే కేటాయిస్తూ ఉంటారు. ఇక అదే డబ్బు అప్పనంగా వస్తుందంటే చాలు అడ్డదారులను వెతుకున్నారు కొందరు కంత్రీగాళ్లు. ఇలాంటి దారిలోనే వెళ్లి రూ. 20 కోట్ల ఆస్తిని కాజేయాలని భావించాడో నయా మోసగాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం ఇస్సాపాలేం గ్రామం. ఇదే ఊరిలో ఉండే 90 సంవత్సరాల బండ్లమూరి వెంకాయమ్మకు రూ.20 కోట్లు విలువ చేసే 9 ఎకరాల పొలం ఉంది. ఇక ఈ ఆస్థిని కాజేయాలని భావించాడు వరుసకు మనవడయ్యే బండ్లమూరి కోటయ్య. దీంతో ఈ ముసలవ్వ ఆస్తిపై కన్నేసిన ఈ కేటుగాడు స్థానిక పంచాయితి కార్యదర్శి సాయంతో 2018లో బతికున్న వెంకాయమ్మను చనిపోయినట్లు డేత్ సర్టిఫికేట్ పుట్టించాడు.
దీంతో పాటు స్థానిక రెవెన్యూ అధికారుల అండదండలతో దొంగచాటును 2020 లో బండ్లమూరి వెంకాయమ్మ పేరు మీదున్న 9 ఎకరాల భూమి తన పేరు మీద రాసుకుని భద్రంగా భూమి పత్రాలు వచ్చేలా ప్రయత్నాలు చేశాడు. ఇక తను అనుకున్నట్లే తన పేరు మీద వచ్చిన ఆ 9 ఎకరాల భూమి పాస్ బుక్ లను జాగ్రత్తగా బీరువాలో దాచుకుని చంకలు గుద్దుకున్నాడు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ విషయాన్ని పసిగట్టాడు స్థానిక వీఆర్వో అధికారి జనార్దన్.
బండ్లమూరి వెంకాయమ్మ మేనల్లుడి సాయంతో వీఆర్వో ఈ అక్రమ పాసు పుస్తకాల తీగ లాగితే డొంక కదిలింది. ఇక తప్పుడు పత్రాలతో తన భూమిని లాగేసుకున్న బండ్లమూరి కోటయ్య నుంచి నా 9 ఎకరాల భూమిని నాకు దక్కేలా చూడాలని కోరుతూ నర్సరావుపేట ఆర్డీఓకు ఫిర్యాదు చేసింది బండ్లమూరి వెంకాయమ్మ. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
