ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగాలు దొరకడం అంటే అదో పెద్ద రావణ కాష్టం అయిపోయింది. ఊరొదిలి సిటీ వచ్చి చాలీ చాలని జీతాలకి చిన్న చిన్న ఉద్యోగాలు చేయడానికి మనసొప్పుకోదు. అలా అని ఖాళీగా ఉంటే ముద్ద దిగని పరిస్థితి. పోనీ వ్యాపారం చేద్దామంటే అంబానీ, అదానీల రేంజ్ కాదు. బ్యాంకులు కూడా ఈ మధ్య తరగతి వాళ్ళని నమ్మి లోన్లు ఇవ్వవు. ఆస్తులు ఏమైనా ఉంటే తనఖా పెట్టాలి. పోనీ రిస్క్ చేసి పెడదామన్నా గానీ ఖచ్చితంగా లాభాలు వచ్చే వ్యాపారాలు ఎక్కడున్నాయి? ఏ వ్యాపారం చూసినా కష్టమే, ఏ వ్యాపారిని చూసిన నష్టమే అని అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యం ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వ సంబంధ వ్యాపారం.. పైగా డబ్బుకి గ్యారంటీ ఉండే బిజినెస్ ఐడియా ఉంటే బాగుణ్ణు అని మీరు భావిస్తున్నట్లైతే గనుక ఇదే మంచి అవకాశం.
మీరు ఉన్న ఊర్లోనే ఉంటూ ఈ వ్యాపారం చేస్తూ నెలకి రూ. 50 వేలు సంపాదించుకోవచ్చు. ప్రస్తుతం బ్యాంక్ సేవలు అనేవి ప్రతీ ఒక్కరికీ అత్యవసరం అయిపోయాయి. గ్రామాల్లో బ్యాంకులు ఉండవు. బ్యాంకు సేవల కోసం మండలానికి వెళ్లాల్సిన పరిస్థితి. ఈ సిచ్యువేషన్ ని మీరు క్యాష్ చేసుకుంటే అద్భుతమైన ఉపాధి దొరుకుతుంది. మండలాల్లో, పట్టణాల్లో ఉండేవి బ్యాంకులైతే.. గ్రామాల్లో ఉండేవి మినీ బ్యాంకులు. ఈ మినీ బ్యాంక్ అనేది కస్టమర్ కి సర్వీస్ పాయింట్ గా పని చేస్తుంది. దీన్ని బ్యాంక్ సీఎస్పీ లేదా బ్యాంకింగ్ కరస్పాండెంట్ అవుట్ లెట్ అని అంటారు. ఇక ఈ వ్యాపారం చేసే వాళ్ళని సీఎస్పీ ఆపరేటర్ అని, బ్యాంక్ మిత్ర అని, బ్యాంకింగ్ కరస్పాండెంట్ అని అంటారు.
ప్రజలకు బ్యాంకులు బ్యాంకింగ్ సేవలను అందించలేని ప్రాంతాల్లో కూడా బ్యాంకు సేవలు అందించాలన్న లక్ష్యంతో ఈ బ్యాంక్ మిత్ర బ్యాంకులను నియమిస్తుంది. గ్రామాల్లో ఉన్న వారికి బ్యాంకు ఖాతాలు తెరవడం, బీమా పాలసీలు కట్టించడం, నగదు డిపాజిట్ చేయడం వంటి బ్యాంకింగ్ సేవల కోసం బ్యాంక్ అసోసియేట్ లు ఉంటారు. ఇప్పటికే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం కింద కస్టమర్ సర్వీస్ సెంటర్లను ప్రారంభించింది. బ్యాంకు సేవలు లేని గ్రామాల్లో మినీ బ్యాంకుని ఏర్పాటు చేసుకోవచ్చు. మినీ బ్యాంకు తెరవడం కోసం 250 నుంచి 300 చదరపు అడుగుల స్థలం, కౌంటర్, కంప్యూటర్ లేదా డెస్క్ టాప్, ప్రింటర్, స్కానర్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. అయితే దీనికి రూ. 1.25 లక్షలు ఖర్చవుతుంది. బ్యాంకులు రుణాలు కూడా ఇస్తాయి. మినీ బ్యాంకుని నగరాల్లో వార్డుల్లో పెట్టుకోవచ్చు, గ్రామాల్లో పెట్టుకోవచ్చు.
పొదుపు ఖాతా, ఫించను ఖాతాలు తెరవడం, రిక్కరింగ్ డిపాజిట్లు, ఫిక్సిడ్ డిపాజిట్లు, నగదు డిపాజిట్, విత్ డ్రా, ఓవర్ డ్రాఫ్ట్, కిసాన్ క్రెడిట్ కార్డు, బీమా పాలసీలు, మ్యూచువల్ ఫండ్స్,క్రెడిట్ కార్డు సర్వీసులు వంటివి ఈ మినీ బ్యాంకు ద్వారా అందుబాటులో ఉంటాయి. ఒక్కో బ్యాంకు నుండి నెలకు 5 వేలకు పైగా ఆదాయం పొందవచ్చు. కస్టమర్ బ్యాంకు ఖాతా తెరిచినప్పటి నుంచి జరిగే ప్రతీ లావాదేవీ దగ్గర ప్రత్యేక కమిషన్ కూడా ఉంటుంది. చుట్టుపక్కల గ్రామాలు ఎక్కువగా ఉంటే.. ఎక్కువ లాభాలు పొందవచ్చు. బ్యాంకు వాళ్ళు ఇచ్చే జీతం కాకుండా.. బ్యాంకు సేవలు అందించడం ద్వారా వచ్చే కమిషనే ఎక్కువ ఉంటుంది. మినీ బ్యాంకుని ప్రారంభించడం కోసం ముందుగా సంబంధిత వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు బ్యాంక్ కరస్పాండెంట్ లేదా బ్యాంక్ మిత్రగా పని చేయవచ్చు.