వీడు మాములోడు కాదు బాసూ! ఎవరైనా ఉద్యోగంలో చేరితే ఏం చేస్తారు. టైంకి వచ్చి చక్కగా పనిచేసి.. మళ్లీ టైంకి ఇంటికి వెళ్లిపోతారు. బాసు మెప్పు పొందాలని ప్రయత్నిస్తారు. కానీ మనోడు మాత్రం అలా కాదు. అన్నం పెట్టిన కంపెనీకి ఎలా కన్నం వేద్దామా అని ఆలోచించాడు. ఆలోచన వరకే అయితే మనం ఇప్పుడు అతడి గురించి మాట్లాడుకునే వాళ్లం కాదు. అదను చూసి దాదాపు ఏడేళ్ల పాటు మోసం చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో కోట్లకు కోట్లు పక్కదారి పట్టించారు. చివరకు స్వయంగా వెళ్లి కోర్టులో లొంగిపోయాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే… భారత సంతతికి వ్యక్తి ధీరేంద్ర ప్రసాద్.. కాలిఫోర్నియాలోని యాపిల్ సంస్థలో 2008-18 వరకు పనిచేశాడు. ఉద్యోగంలో చేరిన మూడేళ్ల వరకు బాగానే పనిచేశాడు. కానీ మనసులో ఎక్కడో దొంగబుద్ధి పుట్టింది. దీంతో 2011 నుంచి దొంగ ఇన్ వాయిస్ లు సృష్టించడం, ఎలక్ట్రానిక్ భాగాలు దొంగిలించడం, ఆపిల్ సర్వీసెస్ కి డబ్బులు వసూలు చేయడం లాంటివి చేశాడు. ఇలా జాబ్ మానేసినంత వరకు మోసం చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో 2011-18 మధ్య దాదాపు 17 మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే.. దాదాపు రూ.140 కోట్లకు పైగా దోచుకున్నాడు.
ఇక యాపిల్ సంస్థలో ఉద్యోగం మానేసిన నాలుగేళ్లకు అంటే తాజాగా.. తన చేసిన మోసం విషయంలో పశ్చాత్తాపడ్డాడు. కాలిఫోర్నియా పోలీసులు ముందు లొంగిపోయాడు. దీంతో కోర్టు విచారణ చేయగా.. ఈ పని చేసింది తాను ఒక్కడినే కాదని, మరో ఇద్దరు కూడా ఉన్నారని బయటపెట్టాడు. వారి పేర్లు రాబర్ట్ గేరీ హన్సన్, డాన్ ఎమ్ బేకర్ అని, వాళ్లు కూడా కాలిఫోర్నియాలో ఉంటున్నారని చెప్పేశాడు. దీంతో వారిద్దరిపై కూడా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.కస్టడీలోకి తీసుకున్నారు. ఇకపోతే ప్రసాద్ కేసులో వచ్చే హియరింగ్ 2023 మార్చి 14న ఉంది. అప్పటివరకు ఇతడు పోలీసు కస్టడీలో ఉంచనున్నారు.