దిగ్గజ బ్యాంకు దివాలా తీసింది. దీంతో ఈ బ్యాంకుకు చెందిన అనుబంధ సంస్థను అమ్మకానికి పెట్టారు. అయితే ఆ సంస్థ కేవలం రూ.99కే అమ్ముడుపోయింది. దీని వెనుక ఉన్న కారణం ఏంటంటే..!
అమెరికా బ్యాంకింగ్ రంగంలో సంక్షోభం ఏర్పడింది. అక్కడి దిగ్గజ బ్యాంకులు ఒకదాని తర్వాత ఒకటి మూతపడటం ఆందోళన రేకెత్తిస్తోంది. ముఖ్యంగా సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్‌వీబీ) మూసివేతపై స్టార్టప్ సంస్థలు, ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ బ్యాంక్ మూసివేత ప్రభావం సుమారు 10 వేల స్టార్టప్‌లపై పడుతుందని అంచనా. ఈ బ్యాంక్ బంద్ అవ్వడం వల్ల లక్ష మంది ఉద్యోగులు లేఆఫ్స్‌కు గురయ్యే ప్రమాదం ఉందని వై కాంబినేటర్ అనే కంపెనీ తెలిపింది. ఈ సంస్థ ఇండియాలోని 200 స్టార్టప్‌లతో పాటు యూఎస్‌లో వేలాది స్టార్టప్స్‌లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టింది.
ఇదిలాఉండగా.. దివాలా తీసిన సిలికాన్ వ్యాలీ బ్యాంకు అనుబంధ సంస్థ అయిన ఎస్‌వీబీ యూకే విషయంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ చర్యలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఎస్వీబీని వేరే సంస్థకు అమ్మేసింది. దీన్ని బ్రిటిష్ మల్టీనేషనల్ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్ హోల్డింగ్ కంపెనీ హెచ్ఎస్బీసీ కొనుగోలు చేసింది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సిలికాన్ వ్యాలీకి చెందిన ఎస్‌వీబీ బ్యాంకును దక్కించుకున్నామని హెచ్ఎస్బీసీ తెలిపింది. ఈ డీల్ విలువ కేవలం ఒక్క పౌండ్ (భారత కరెన్సీలో సుమారుగా రూ.99) కావడం గమనార్హం. డిపాజిటర్లకు రక్షణ కల్పించే ఉద్దేశంతోనే హెచ్‌ఎస్‌బీసీకి సిలికాన్ వ్యాలీ యూకేను విక్రయించామని యూకే ట్రెజరీ, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఓ ప్రకటనలో వెల్లడించాయి.
అద్భుతమైన స్ట్రాటజిక్ సెన్స్‌తో ఈ డీల్ కుదిరిందని హెచ్ఎస్బీసీ సీఈవో క్విన్ తెలిపారు. యూకే బిజినెస్, కమర్షియల్ బ్యాంకింగ్ ఫ్రాంచైజీని మరింత బలోపేతం చేసేందుకు ఈ డీల్ దోహదపడుతుందని చెప్పారు. డీల్ పూర్తయిన నేపథ్యంలో ఎస్‌వీబీ యూకే కస్టమర్లు, ఎంప్లాయీస్‌ను తమ సంస్థలోకి ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఈ డీల్‌లో పన్ను చెల్లింపుదారుల సొమ్మును ఏమాత్రం ఉపయోగించలేదని ట్రెజరీ చీఫ్ జెరెమీ హంట్ తెలిపారు. ఈ డీల్‌లో ఎస్‌వీబీ అప్పులు, ఆస్తులను లావాదేవీల నుంచి మినహాయించామని స్పష్టం చేశారు.