గౌతమ్ అదానీ.. గత కొంత కాలంగా ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది. మన దేశంలోనే కాక.. ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా గుర్తింపు పొందాడు అదానీ. గత కొన్ని రోజులుగా ఆయన సంపద రాకేట్ వేగంతో పెరుగుతోంది. అయితే అదానీ నేడు పొందిన ఈ గుర్తింపు ఆయనకు ఊరికే రాలేదు. ఎంతో కష్టపడి.. ఒక్కో మెట్టు పైకెక్కుతూ ఈ స్థాయికి చేరుకున్నారు. చిన్నతనంలో కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉపాధి కోసం ముంబై వచ్చాడు. చదువు మధ్యలోనే ఆపేసి.. వ్యాపారంలోకి రావాల్సి వచ్చింది. ‘‘కుటుంబ పరిస్థితుల కారణంగా.. చదువు ఆపేశాను. అదే దారిలో వెళ్లి ఉంటే.. నేను ఇంకా గొప్పగా ఎదిగి ఉండేవాడిని’’ అంటాడు అదానీ.
అదానీ.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. వ్యాపారంలో రాణిస్తూ.. నేడు ప్రపంచ బిలియనీర్ జాబితాలోకి చేరాడు. అయితే ఆయన జీవితంలో.. కొన్ని భయనాక సంఘటనలు చోటు చేసుకున్నాయి. అవేంటంటే.. డబ్బు కోసం ఒకసారి ఆయనను కిడ్నాప్ చేయగా.. మరోసారి ఉగ్రదాడి నుంచి బయటపడ్డాడు. డబ్బు కోసం అండర్ వరల్డ్ డాన్ అదానీని కిడ్నాప్ చేశారు. ఈ సంఘటన 1997లో చోటు చేసుకుంది. అదానీ ఆస్తి గురించి తెలుసుకున్న అండర్ వరల్డ్ డాన్ ఫజ్లూ రెహ్మాన్, అదానీని కిడ్నాప్ చేశాడు.
1.5 మిలియన్ డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే ఇలా కిడ్నాప్‌కు గురైతే ఎవరైనా ఎంత కంగారు పడతారు. కానీ అదానీ మాత్రం ఎంతో ప్రశాంతంగా ఉన్నాడట. తన కిడ్నాప్ జరిగిన రోజు కూడా చాలా ప్రశాంతంగా నిద్రపోయాడట. ఓ ఇంటర్వ్యూలో ఆయన దీని గురించి మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి సంఘటనలను త్వరగా మర్చిపోవడానికి ట్రై చేస్తాను. ఆరోజు కూడా అదే పని చేశాను’’ అని తెలిపాడు.
తాజ్ హోటల్‌లో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని కుదిపేసింది. ముష్కరులు.. హోటల్లోకి చేరుకుని.. కాల్పులకు తెగ బడ్డారు. ఈ ఘటనలో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. అదానీ అదృష్టం బాగుండి.. ఆ దాడి నుంచి తప్పించుకున్నాడు. తాజ్ హోటల్ సంఘటన జరిగిన రోజున.. అదానీ.. దుబాయ్ నుంచి వచ్చిన తన స్నేహితులను కలవడం కోసం అదే హోటల్‌కు వెళ్లారు. వారితో కలిసి డిన్నర్ చేసి.. బిల్లు కట్టేందుకు లేచారు. అయితే కాఫీ తాగడం కోసం.. మళ్లీ వెళ్లి కూర్చున్నాడు. అదే సమయంలో తాజ్ హోటల్‌లో ఉగ్రవాదులు దాడులకు దిగారు. వారి కళ్లేదురుగానే కాల్పులు జరిపారు. ఒకవేళ బిల్లు కట్టడానికి వెళ్లి ఉంటే.. ఉగ్రవాదుల చేతిలో బందీ అయ్యేవాడు. అలా తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు అదానీ.