సామాన్యుడి దగ్గరి నుంచి మల్టీ బిలియనీర్ వరకు దేశం మొత్తం ఎంతగానో ఎదురు చూసిన బడ్జెట్ రానే వచ్చింది. బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెన్‌ను ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం 2023-2024 సంవత్సరానికి గాను 45.03 లక్షల కోట్ల రూపాయలతో ఈ బడ్జెను తయారుచేసింది. ఈ సంవత్సరం దాదాపు 9 రాష్ట్రాల్లో శాసన సభ ఎన్నికలు ఉండటంతో కేంద్రం ఎంతో జాగ్రత్తగా ఈ బడ్జెన్ రూపొందించింది. అమృత్ కాల్ బడ్జెట్‌గా దీనికి నామ కరణం కూడా చేసింది. ఈ బడ్జెట్‌లో మొత్తం ఏడు అంశాలకు ప్రాధాన్యత ఇచ్చింది. ‘ అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ అమృత కాలంలో ఈ బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నట్లు’ బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మరి, కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన 2023-2024 బడ్జెట్ అన్ని వర్గాలను మెప్పించిందా? లేదా?.. ఈ కొత్త బడ్జెట్‌తో ఏ రంగానికి ఎంత వరకు లాభం చేకూరనుంది..
వ్యవసాయ రంగంపై మళ్లీ చిన్నచూపు
కేంద్ర ప్రభుత్వం 2023-2024 సంవత్సరానికి గానూ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి 1.15 లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం దాదాపు 9 లక్షల కోట్ల రూపాయలు తక్కువగా వ్యవసాయ రంగానికి కేటాయింపులు జరిగాయి. వ్యవసాయ ఆధారిత దేశంగా పేరొందిన భారత్‌లో అసలు వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత లేకపోవటం గమనార్హం. దేశంలో వ్యవసాయ రంగం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కొన్ని ప్రాంతాల్లో సరైన నీటి వసతి లేక పంటలు పండక జనం వలస పోతున్నారు. మరికొన్ని చోట్ల వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేక రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతుల సగటు ఆదాయం 7 వేల రూపాయలకు కూడా మించటంలేదు. రైతులు వ్యవసాయం మానేస్తే బాగుంటుందేమో అన్న అభిప్రాయంలో ఉన్నారు. తిండి పెట్టే వ్యవసాయ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తోందని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. వ్యవసాయానికి ఓ కొత్త దారి అవసరమని ఆర్థిక సర్వేలు చెబుతున్నా కేంద్రం దీనిపై దృష్టిపెట్టక పోవటం వ్యవసాయం రంగాన్ని దూరం పెట్టడమేనని అంటున్నారు.
ఇక్కడ మరో విషయం ఏంటంటే.. వ్యవసాయ రుణ మంజురు లక్ష్యాన్ని 11 శాతం అంటే 20 లక్షల కోట్లకు పెంచింది. గత సంవత్సరం ఈ లక్ష్యం 18 లక్షల కోట్లు ఉండేది. ఇప్పుడు రెండు లక్షల కోట్లు పెరిగింది. ఇది సంతోషకరమైన విషయమే. అయితే, ఈ లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు చేరుకుంటోంది. అసలు రైతులకు ఏమేరకు బ్యాంకుల నుంచి రుణాలు అందుతున్నాయి అన్న దానిపై అసలు క్లారిటీ లేదు. దేశ వ్యాప్తంగా చాలా చోట్ల రైతులకు పంట రుణాలు అందటం లేదు. రుణాలు ఇవ్వకపోవటానికి బ్యాంకులు ఏవేవో కారణాలు చెబుతున్నాయి. లక్ష్యాలను పెట్టుకున్నా కేంద్రం ఆ లక్ష్యాలను చేరుకునే దిశగా అడుగులు వేయటం లేదన్నది స్పష్టం అవుతోందంటున్నారు వ్యవసాయ రంగ నిపుణులు.
గ్రామీణాభివృద్ధి డొల్లే..
భారత దేశం అంటేనే గ్రామాల దేశం. అలాంటి దేశంలో గ్రామీణాభివృద్ధి కరువవుతోంది. ప్రభుత్వాలు గ్రామాలను పట్టించుకోవటం లేదు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే బుధవారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధి శాఖకు కేటాయింపులు తగ్గటం. పోయిన సంవత్సరం కంటే ఈ సారి భారీగా కేటాంపులు తగ్గాయి. పోయిన 2022-2023 సంవత్సరానికి దాదాపు 1.81 లక్షల కోట్లు కేటాయింపులు జరగ్గా.. 2023-2024 సంవత్సరానికి గాను కేవలం 1.57 లక్షల కోట్ల కేటాయింపులు జరిగాయి. పోయిన సారి కంటే ఈ సారి దాదాపు 13 శాతం కేటాయింపులు తగ్గాయి.
ఎంతో మంది గ్రామీణ ప్రజల కడుపు నింపుతున్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హమీ పథకం విషయంలోనూ ప్రభుత్వం చిన్న చూపుగా వ్యవహరించింది. కేటాయింపుల్లో భారీగా కోతలు విధించింది. 2022-2023 సంవత్సరానికి గానూ ప్రభుత్వం 89 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. కానీ, 2023-2024 సంవత్సరానికి గాను ఆ కేటాయింపులు 60వేల కోట్ల రూపాయలకు పడిపోయాయి. అంటే దాదాపు 32 శాతం మేర కేటాయింపులు తగ్గిపోయాయి. ఉపాధి హామీకి వెళ్లేవారి సంఖ్య పెరుగుతున్న సమయంలో కేటాయింపుల ద్వారా ఏ మేరకు లబ్ధి చేకూరుతుందన్నది ప్రభుత్వానికే తెలియాలి.
గ్రామీణ ప్రాంతాలలోని రోడ్ల అభివృద్ధి విషయంలోనూ ప్రభుత్వం సరైన కేటాయింపులు చేయలేదు. ఖర్చులు రోజు రోజుకు పెరుగుతున్న ఈ సమయంలో కూడా పోయిన సారి కేటాయించిన మొత్తమే కేటాయించింది. 22-23 సంవత్సరానికి గాను 19 వేల కోట్లు కేటాయించగా.. ఈ సారి కూడా అంతే మొత్తం కేటాయించింది. కానీ, 2023-24 సంవత్సరానికి గాను 38 వేల కిలోమీటర్ల పక్కారోడ్లను నిర్మించటాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఆరోగ్య రంగం భేష్!
ఆరోగ్య రంగం విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందు చూపుగా వ్యవహరించింది. కరోనా మహమ్మారి అనుభవాల కారణంగా ఆరోగ్య రంగంపై ప్రభుత్వం ఎక్కువగా దృష్టి సారిస్తోంది. అందుకే కేటాయింపులను కూడా గతేడాదికంటే ఎక్కువ చేసింది. 2022-2023 సంవత్సరం 79 వేల కోట్ల రూపాయలు కేటాయించగా.. 2023-2024 సంవత్సరానికి గానూ 89 వేల కోట్లకు పెంచింది. ఆరోగ్య రంగానికి సంబంధించిన మరికొన్ని విషయాల్లోనూ ప్రభుత్వం మంచి నిర్ణయమే తీసుకుంది.
విద్యారంగానికి కొత్త రోజులు
విద్యా రంగం విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం గొప్ప మనసును చాటుకుంది. ఇంత మొత్తం విద్యారంగానికి కేటాయింపులు జరగటం ఇదే ప్రథమం. ఈ సారి ప్రభుత్వం దాదాపు 1.12 లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది. పోయిన సారి కంటే ఈ సారి పది వేల కోట్ల రూపాయల కేటాయింపులు పెరిగాయి. ప్రభుత్వం విద‍్య విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నట్లు దీన్ని బట్టే తెలుస్తుంది. వీటిలో పాఠశాల విద్యకు 68 వేల కోట్లు, ఉన్నత విద్యకు 44 వేల కోట్లు కేటాయించింది. దీంతో చదువుకోవాలనుకునే వారి కల మరింత సుగమం అవుతుంది.
పేదలకు మళ్లీ ఒట్టి చెయ్యి.. నిత్యావసరాలను పట్టించుకోని కేంద్రం
‘‘ దేశంలో ఉన్న కోట్ల మంది పేదలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ తయారుచేసి ఉంటే బాగుండేదని ’’ బీఎస్‌పీ అధినేత్రి మాయావతి అన్నారు. నిత్యావసరాల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. సగటు మధ్య తరగతి వ్యక్తి కోరుకున్న, ఆశించినవి ఏమీ జరగలేదు. తినే ఆహారం విషయంలో.. వేసుకునే దుస్తుల విషయంలో.. కిరాణా, పాదరక్షలు, పాత్రలు, మందులు, వంటగ్యాస్, పెట్రోల్, డీజెల్‌లకు సంబంధించిన జీఎస్టీ విషయంలో ఎలాంటి తగ్గింపు లేదు. అంతేకాదు! పేదలకు ప్రత్యక్ష నగదు బదిలీ’ వంటివి కూడా లేకపోవటం గమనార్హం.
వేతన జీవులకు గుడ్డిలో మెల్ల సంతోషం..
వేతన జీవుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కొంత జాలీ చూపిందని చెప్పొచ్చు. పన్ను స్లాబుల విషయంలో మార్పులు తీసుకువచ్చింది. గతంలో 5 లక్షల రూపాయలు ఆదాయం దాటితే పన్ను చెల్లించాల్సి వచ్చేది. అయితే, కొత్త బడ్జెట్ ప్రకారం ఏడు లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ, 7 లక్షల 10 వేల రూపాయలు సంపాదిస్తే మాత్రం 16 వేల రూపాయలు పన్ను కట్టాల్సి వస్తుంది. అంటే పది వేల రూపాయల తేడా 16 వేల రూపాయలకు చిల్లు పెడుతుందన్న మాట. దీన్ని కొంత మంది వేతన జీవులు తీవ్రంగా తప్పు బడుతున్నారు. మేధావులు మాత్రమే ఇలాంటి బడ్జెన్ తయారు చేస్తారంటూ విమర్శిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలకు తీరని అన్యాయం..
ఎప్పటిలాగే ఈ సారి కూడా తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని చెప్పొచ్చు. 15వ ఆర్థిక సంఘ సూత్రాల ప్రకారం.. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం మొత్తం అన్ని రాష్ట్రా లకూ కలిపి రూ.1021,448.16 కోట్లు పంపిణీ చేస్తుండగా, అందులో ఆంధ్రప్రదేశ్ వాటా రూ. 41, 338 కోట్లు, తెలంగాణ వాటా రూ. 21,470 కోట్లుగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలు కేంద్రానికి అందిస్తున్న ఆదాయానికి.. రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కేటాయింపులకు ఎక్కడా పొంతన ఉండలేదు.
మహిళలకు షాక్ !
మహిళలకు బంగారం వెండి వస్తువులంటే ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎవరి స్తోమతను బట్టి వారు బంగారం, వెండి ఆభరణాలను కొనుక్కుంటూ ఉంటారు. పండగలు, పబ్బాలు, శుభకార్యాలకు బంగారం, వెండి వస్తువుల ప్రాధాన్యత ఉండనే ఉంటుంది. ముఖ్యంగా పెళ్లిళ్ల సమయంలో బంగారు వస్తువులు తప్పని సరిగా కొనాల్సి వస్తుంది. అలాంటి బంగారం, వెండి విషయంలో కేంద్రం షాకింగ్ న్యూస్ చెప్పింది. బంగారం, వెండి, వజ్రాల ధరలపై కస్టమ్స్ డ్యూటీ పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఫ్యూర్ 24 క్యారెట్ల బంగారం ధర 58 వేలకు చేరుకోగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 53 వేల వైపు తొంగిచూస్తోంది. ఇప్పుడు కస్టమ్స్ డ్యూటీ పెరగడంతో బంగారం, వెండి, వజ్రాల ధరలు ఆకాశాన్ని తాకనున్నాయి. ఇది కేవలం మహిళలకు మాత్రమే కాదు. బంగారం కొనాలనుకునే ఓ మధ్య తరగతి వ్యక్తికి షాక్ లాంటిది.
ఎలక్ట్రానిక్స్ వస్తువుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం నిజంగా ఓ గుడ్‌న్యూసే. ఎందుకంటే జనం ఎక్కువగా వాడే ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గటం వల్ల సగటు మధ్య తరగతి వ్యక్తులకు మేలు జరిగినట్టే. టీవీలు, మొబైల్ ఫోన్లు వంటి ప్రధాన ఎలక్ట్రానిక్ వస్తువుల మీద కస్టమ్ డ్యూటీని ప్రభుత్వం తగ్గించింది. దీని వల్ల టీవీ, ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు భారీగా తగ్గనున్నాయి. దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ భాగాల మీద కస్టమ్ డ్యూటీ తగ్గించడంతో ఎలక్ట్రానిక్స్ మర్కెట్ లో ఆయా వస్తువుల ధరలు తగ్గుతాయి. ముఖ్యంగా దేశీయంగా తయారయ్యే టీవీ సెట్స్‌ల ధరలు 5 శాతం తగ్గనున్నాయి. కేంద్ర మేకిన్ ఇండియాకు ప్రాధాన్యత ఇస్తూ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ప్రస్తుత సమాజంలో ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా ఓ నిత్యావసరం అయిపోయాయి కాబట్టి.. కేంద్రం నిర్ణయం సంతోషకరమే..
బడ్జెట్‌పై ప్రముఖుల అభిప్రాయం :
ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ దేశ అవసరాలు, అభివృద్ధికి తగ్గట్టుగా కాకుండా ఎన్నికలను, పెట్టుబడి దారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడిందని ప్రతి పక్షాలు విమర్శిస్తున్నాయి. బడ్జెట్‌ను మేనిఫెస్టోగా చేసేసిందని ప్రతి పక్ష పార్టీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏది ఏమైనప్పటికి కేంద్ర ప్రవేశ పెట్టిన 2023-2024 బడ్జెట్ కొంచెం ఇష్టం కొంచెం కష్టంగా ఉంది. మరి, కేంద్ర ప్రవేశ పెట్టిన 2023-2024 బడ్జెట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.