జీవితం అంటేనే కష్టసుఖాల కలయికతో సాగే ప్రయాణం. అలాంటి జీవిత ప్రయాణంలో ఎదురయ్యే సమస్యలపై ధైర్యంగా పోరాడుతూ ముందుకు సాగాలి. అయితే కొందరి జీవితాల్లో కష్టాలు మాత్రమే నిత్యం పలకరిస్తూ ఉంటాయి. అలా కష్టాలను సైతం ఎదుర్కొంటూ మొండిగా ముందుకెళ్తున్న కొందర్ని.. విధి మరింతా దీన స్థితిలోకి నెట్టేస్తుంది. అచ్చం అలాగే ఓ కుటుంబం విషయంలో జరిగింది. భర్త గుండె జబ్బుతో బాధ పడుతుండటంతో కుటుంబ పోషణ మొత్తం ఆ ఇంటి ఇల్లాలిపై పడింది. కూలీ పనులు చేస్తూ అతి కష్టం మీద కుటుంబాన్ని పోషిస్తుంది. ఈ క్రమంలో ఓ డ్రైవర్ నిర్లక్ష్యానికి ఆ మహిళ బలై పోయింది. ఆమె మృతితో ఆ కుటుంబ పరిస్థితి గందరగోళంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం కె శివరానికి చెందిన గీతమ్మ(35) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్ద కుమారుడు 4వ తరగతి, రెండో వాడు 2వ తరగతి, ముడో పిల్లవాడు అంగన్ వాడీకి వెళ్తున్నారు. గీతమ్మ భర్త తిప్పేస్వామి కొన్నేళ్లుగా గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. దీంతో భర్తతో పాటు ముగ్గురు పిల్లల పోషణ ఆమెపై పడింది. కుటుంబ పోషణ కోసం కూలీ పనులకు వెళ్తుండేది. ఈ క్రమంలో గురువారం ఉదయం తమ గ్రామానికి చెందిన 27 మందితో కలిసి గీతమ్మ కూలీగా ట్రాక్టర్ ఎక్కి రంగాపురం గ్రామ రైతు పొలానికి బయలు దేరింది. మార్గం మధ్యలో ట్రాక్టర్ డ్రైవర్ నాగరాజు నిర్లక్ష్యంగా ఫోన్ మాట్లాడుతూ.. వేగంగా నడుపుతున్నాడు. ఇదే సమయంలో అతడి చేతిలోని సెల్ ఫోన్ జారింది. దానిని పట్టుకునేందు నాగరాజు స్టీరింగ్ వదిలి కిందకి వంగాడు.
దీంతో అదుపుతప్పిన ట్రాక్టర్ రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ క్రమంలో గీతమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంలో 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో మహాలక్ష్మి అనే 6 నెలల గర్భిణీ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనాల్లో మడకశిర, హిందూపురం ఆసుపత్రులకు తరలించారు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ ప్రమాదంలో గీతమ్మ మరణించడంతో ఆమె కుటుంబం అంధకారంలోకి వెళ్లింది. అభం శుభం తెలియని ఆ చిన్నారుల భవిష్యత్తు ఎలాగని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.
