ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం.. జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ.. పారదర్శక పాలన అందిస్తున్నామన్నారు. కొత్త లక్ష్యాలను నిర్దేశించుకునే సమయమని.. రేపు అనేది అందరికీ భరోసా ఇవ్వాలని సీఎం జగన్ అన్నారు. హక్కులు అందరికీ సమానంగా అందాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మేలు జరిగేలా చూస్తున్నామన్నారు. 26 నెలల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని సీఎం జగన్ అన్నారు.
నెలనెలా ఒకటో తేదీనే గడప వద్దే పింఛన్ అందిస్తున్నాం. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా లక్షా 30 వేల శాశ్వత ఉద్యోగాలిచ్చాం. విత్తనం నుంచి పంట అమ్మే వరకు ఆర్బీకేల ద్వారా సేవలు అందిస్తున్నాం. ఏపీ అమూల్ పాలవెల్లువతో పాడి రైతులకు అండగా నిలిచామని సీఎం అన్నారు. ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.1,039 కోట్లు చెల్లించామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.

రైతుభరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున అందిస్తున్నామన్నారు. వ్యవసాయ రంగంపై రూ.83 వేల కోట్ల వ్యయం చేసినట్లు సీఎం తెలిపారు. రైతులకు పగటిపూటే నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామన్నారు. 31 లక్షల మంది రైతులకు వైఎస్సార్ ఉచిత పంటల బీమా అందించామని సీఎం పేర్కొన్నారు. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, ధాన్యం కొనుగోలు సేకరణ కోసం రూ.33 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు.
“నాడు–నేడు” ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చాం. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడులను మారుస్తున్నాం. అక్కాచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చినట్లు సీఎం అన్నారు. అమ్మఒడి ద్వారా రెండేళ్లలో రూ.13వేల కోట్లు, వైఎస్సార్ చేయూత ద్వారా రూ.9వేల కోట్లు ఇచ్చామన్నారు. మహిళల భద్రతకు దిశా చట్టం, దిశా పోలీస్స్టేషన్లు, దిశా యాప్లు తీసుకొచ్చాం. 5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారందరినీ ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొచ్చాం. గ్రామాల్లో వైఎస్సార్ విలేజ్ క్లినిక్ల నిర్మాణం జరుగుతోంది. కరోనాను ఆరోగ్యశ్రీలోకి తెచ్చి ఉచితంగా చికిత్స అందించినట్లు సీఎం జగన్ తెలిపారు.
