టాలీవుడ్ లో సెన్సిటివ్ కథలను తెరపై అందంగా ప్రెజెంట్ చేయగల దర్శకులు చాలా తక్కువ కనిపిస్తారు. అలాంటి దర్శకులలో ఒకరు మోహనకృష్ణ ఇంద్రగంటి. దాదాపు ఆయన సినిమాలన్నీ సెన్సిటివ్ థింగ్స్, ఎమోషన్స్ పైనే ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ ఉంటాయి. అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్, జెంటిల్ మెన్, సమ్మోహనం లాంటి సినిమాలతో తన మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ఇక హీరో సుధీర్ బాబుతో సమ్మోహనం, వి సినిమాల తర్వాత.. ఇప్పుడు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే మూవీ తెరకెక్కించాడు. సుధీర్ బాబు, కృతిశెట్టి జంటగా నటించిన ఈ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమాలో ఇంద్రగంటి ఎలాంటి మ్యాజిక్ చేశారో రివ్యూలో చూద్దాం!
ఈ సినిమా కథ టైటిల్ లో చెప్పినట్లుగానే ఓ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. వరుస కమర్షియల్ హిట్స్ తో సక్సెస్ లో ఉన్న ఫిల్మ్ మేకర్ నవీన్(సుధీర్ బాబు).. తన నెక్స్ట్ సినిమాను ఓ కొత్తమ్మాయితో తీయాలని అనుకుంటాడు. ఈ క్రమంలో ఓరోజు ఐ డాక్టర్ అలేఖ్య(కృతిశెట్టి)కు సంబంధించి ఓ యాక్టింగ్ వీడియో లభిస్తుంది. దీంతో చూడగానే తన నెక్స్ట్ అలేఖ్యనే హీరోయిన్ అని ఫిక్స్ అయిపోయి.. ఆమెను కలుస్తాడు. కానీ.. తనకు యాక్టింగ్ తనకు, తన ఫ్యామిలీకి ఇష్టం లేదని చెప్పి షాకిస్తుంది. అప్పటినుండి అలేఖ్య వెనుక తిరుగుతూ ఆమెను ఎలాగైనా సినిమాకు ఒప్పించాలని ట్రై చేస్తుంటాడు నవీన్.
ఈ నేపథ్యంలో అలేఖ్య గురించి, ఆమె ఫ్యామిలీ గురించి కొన్ని షాకింగ్ విషయాలు నవీన్ కి తెలుస్తాయి. దీంతో ఖచ్చితంగా తను అనుకున్న కథను అలేఖ్యతోనే తీయాలని నిర్ణయించుకుంటాడు. మరి యాక్టింగ్ అంటే ఇష్టం లేదని చెప్పిన అలేఖ్యను నవీన్ సినిమా కోసం ఒప్పించాడా లేదా? అసలు యాక్టింగ్ అంటే అలేఖ్యకు ఎందుకు ఇష్టం లేదు? అలేఖ్య ఫ్యామిలీ గురించి నవీన్ కి తెలిసిన షాకింగ్ విషయాలు ఏంటి? ఇంతకీ నవీన్ దగ్గరున్న వీడియోలో ఏముంది? చివరికి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అంటూ నవీన్ ఎలాంటి సందేశం ఇచ్చాడు? అనేది తెరపై చూడాల్సిందే.
సాధారణంగా హీరోలకు ఫ్యాన్స్ ఉండటం.. హీరోలపై ఇష్టంతో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తుండటం అనేది చూస్తూనే ఉంటాం. కానీ.. డైరెక్టర్స్ పై అభిమానంతో.. ఇష్టంతో జనాలు థియేటర్లకు వెళ్లడం అనేది కొందరి విషయంలోనే జరుగుతుంది. హీరోహీరోయిన్లు ఎవరున్నా డైరెక్టర్ ఎవరు? అని కనుక్కొని వెళ్లే సినిమాలుంటాయి. అలాంటి ఫ్యాన్ బేస్ కలిగిన దర్శకులలో ఇంద్రగంటి మోహనకృష్ణ ఖచ్చితంగా ఉంటారు. ఈయన సినిమాలకు హీరోలతో పనిలేదు.. అక్కడ దర్శకుడిగా ఇంద్రగంటి పేరు కనిపిస్తే చాలు అనిపిస్తుంటారు. అందుకే స్టార్ హీరోలు లేకుండానే ఇంద్రగంటి సబ్జెక్టు, టేకింగ్ తో ఆకట్టుకుంటారు.
ఇప్పటివరకు కమర్షియల్ జానర్ జోలికి వెళ్లని ఇంద్రగంటి.. సెన్సిబుల్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఎందుకంటే.. ఆయన తీసిన సినిమాలన్నీ సెన్సిటివ్ థింగ్స్, ఎమోషన్స్ పైనే ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే మూవీ కూడా ఆ జానర్ కి చెందిందే. పెద్దగా లోతైన విషయాల గురించి ప్రస్తావించకుండా.. ఓ అమ్మాయి లైఫ్ లో ఏం జరిగింది..? అనేది ఎంటర్టైనింగ్ అండ్ ఎమోషనల్ గా చెప్పే ప్రయత్నం చేశారు డైరెక్టర్. ఇంద్రగంటి సినిమాలంటే కాస్త స్లో అనిపించినా.. చూసినాకొద్దీ ఇందులో ఏదో పెద్ద విషయమే దాగుందనే ఫీల్ కలుగుతుంది.
సినిమాను హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ట్ అయ్యింది. సక్సెస్ ఫుల్ ఫిల్మ్ మేకర్ గా నవీన్ క్యారెక్టర్ లో సుధీర్ బాబు ఇంట్రడక్షన్ తో సినిమా మొదలైంది. కానీ.. సీరియస్ సబ్జెక్టులో హీరో తీసిన సినిమాల పేర్లు సిల్లీగా అనిపిస్తాయి. ఎందుకంటే.. అతని సినిమాలు చూసి ఇన్స్పైర్ అయినట్లు ఓ సీన్ లో చూపిస్తారు. ఇక హీరో నెక్స్ట్ సినిమా కోసం కొత్తమ్మాయిని వెతకడం.. ఇతనికి డాక్టర్ అలేఖ్య పాత్రలో కృతిశెట్టి పరిచయం అవ్వడం కొత్తగా అనిపిస్తుంది. అలా ఫస్ట్ హాఫ్ అంతా హీరో నవీన్, డాక్టర్ అలేఖ్య, సినిమా అనే అంశాల చుట్టూ సాగుతుంది. కానీ.. అనూహ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ లో అదిరిపోయే ట్విస్టు రివీల్ అవుతుంది.
ఇక సెకండాఫ్ లో ట్విస్టుతో మైండ్ బ్లాక్ అయిన నవీన్.. ఎలాగైనా తను అనుకున్న కథను అలేఖ్యతోనే చెప్పించాలని ప్రయత్నాలు చేయడం.. ఇంతలో ఆమె ఫ్యామిలీ అడ్డురావడం ఇంటరెస్టింగ్ గా అనిపిస్తాయి. మధ్యలో కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ తర్వాత.. సినిమా కోసం అలేఖ్యను ఒప్పుకోవడం కన్విన్సింగ్ గానే అనిపిస్తుంది. కానీ.. హీరోయిన్ కి యాక్టింగ్ ఇష్టం లేకపోయినా.. హీరో ఆమె వెనకే తిరగడం అనేది జనాలకు బుర్రపాడు చేయొచ్చు. అదిగాక సినిమాలో ఓ ఐటమ్ సాంగ్.. ఇంద్రగంటి సినిమాలలో ఎలాంటి ప్లీజంట్ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటాయో తెలుసు. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ ఉన్నా.. అది కథకు, ఆ సందర్భానికి అనవసరం.. ఆ సాంగ్ లేకపోయినా పర్వాలేదు అనిపిస్తుంది.
ఇక హీరోయిన్ ఫ్యామిలీ ఎందుకు సినిమాలను, సినిమావాళ్లను ద్వేషిస్తుంది? అని చెప్పిన కారణం ఎమోషనల్ గా టచ్ చేస్తుంది. కానీ.. హీరో చివరికి హీరోయిన్ ని ఒప్పించి సినిమా చేయడం.. ఆ విషయం ఫ్యామిలీకి తెలిసి ఇండస్ట్రీలో పరిస్థితులు ఎలా ఉంటాయో చూపించిన విధానం బాగుంది. కానీ.. ఆల్రెడీ ఇలాంటి సీన్స్ గతంలోనే చూసేశాం కదా అనిపిస్తుంది. ఎందుకంటే.. ఆడపిల్లలను సినిమాల్లోకి పంపకపోవడం, ఇండస్ట్రీలోకి వస్తే వాళ్లు ఫేస్ చేసే ప్రాబ్లెమ్స్ పై గతంలో చాలా సినిమాlలు వచ్చాయి. కానీ.. ఇంటర్వెల్ లో రివీల్ చేసిన ఒక్క ట్విస్టుతో సెకండాఫ్ అంతా రన్ అవుతుంది. అందులోనూ స్క్రీన్ ప్లే నెమ్మదిగా సాగుతున్న ఫీలింగ్ కలగకమానదు.
ఇక క్లైమాక్స్ లో ఎమోషనల్ టచ్ పీక్స్ లోకి వెళ్తుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా కనెక్ట్ అవుతాయి. కానీ.. ఎక్కడో ఆడియన్స్ కి ఇంకా సరిపోలేదు అనిపిస్తుంది. మొత్తానికి ఆ అమ్మాయి గురించి ఇంద్రగంటి చెప్పిన కథ పర్వాలేదు.. బట్ ఓకే అనే ఫీల్ తో బయటికి వస్తారు. ఇదిలా ఉండగా.. ఫిల్మ్ మేకర్ నవీన్ పాత్రకు సుధీర్ బాబు గొప్పగా కాదుగాని.. ఓకే అనిపించాడు. డాక్టర్ అలేఖ్య పాత్రలో కృతిశెట్టి మంచి నటన కనబరచింది. ప్రీవియస్ సినిమాలతో పోల్చుకుంటే చాలా డెవలప్ మెంట్ కనిపిస్తుంది. వెన్నెల కిషోర్ కామెడీ బాగుంది. కానీ.. హీరోయిన్ తండ్రిగా శ్రీకాంత్ అయ్యంగార్ ది బెస్ట్ ఇచ్చాడని చెప్పవచ్చు.
అలాగే మిగతా యాక్టర్స్ అంతా వారి పాత్రల పరిధిమేరా ఆకట్టుకున్నారు. ఈ సినిమాకు మేజర్ ప్లస్ అంటే.. విజువల్స్, వివేక్ సాగర్ మ్యూజిక్(ఐటమ్ సాంగ్ మినహాయించి). సినిమాటోగ్రఫీ బాగుంది. పెద్దగా రిస్క్ లేకుండా తక్కువ లొకేషన్స్ లో సినిమా తీశారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అయితే.. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి మ్యాజిక్ ఈ సినిమాలో మిస్ అయ్యిందనే చెప్పాలి. ఓ కొత్త ట్విస్టు చుట్టూ రొటీన్ స్టోరీని అల్లుకున్నాడు.. అక్కడక్కడా డైలాగ్స్ మాత్రం ఆకట్టుకుంటాయి. డైరెక్టర్ గా ఇంద్రగంటి వందశాతం ట్రై చేసాడేమో.. కానీ.. ఎక్కడో కథాకథనాలలో పట్టు మిస్ అయ్యిందేమో అనిపిస్తుంది.
రేటింగ్: 2/5
గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!