రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎక్కడ చూసినా వర్షం నీరు ప్రవహిస్తోంది. చాలా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల చెరువుల కట్టలు తెగుతున్నాయి. కొన్ని గ్రామాల్లో వాగులు పొంగి ఊర్లకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. వాగులు దాటేందుకు గ్రామస్థులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. అలా వాగు దాటేందుకు ప్రయత్నించిన మహిళ పెను ప్రమాదానికి గురైంది. ఆమెను కాపాడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం అందుగుల పేటలో ఈ ఘటన జరిగింది. అందుగుల పేటలో ఇటీవల కురిసిన వర్షాలకు వాగు పొంగి పొర్లుతోంది. గ్రామానికి ఉన్న ప్రధాన రహదారిపైగా వాగు ప్రవహిస్తోంది. అటుగా వెళ్లేందుకు కూడా వీలులేకుండా పోయింది. అయితే ఆ వాగును దాటేందుకు ఓ మహిళ ప్రయత్నించింది. ఆమె దాటే క్రమంలో నీటి ప్రవాహానికి కాలు జారి కొట్టుకుపోయింది. వంతెనకు పక్కన ఉన్న సేఫ్టీ దిమ్మెను పట్టుకుని ఆగిపోయింది. అటుగా వెళ్తున్న గ్రామస్థులు ఆమెను చూసి కాపాడే ప్రయత్నం చేశారు. అందరూ కలిసికట్టుగా చేతులు పట్టుకుని వాగు ప్రవాహంలో నిల్చుని తాడు సాయంతో ఆ మహిళను కాపాడారు. అందరూ కలిసి చేయిచేయి కలిపి ఆ మహిళను వాగు ప్రవాహం నుంచి ఒడ్డు చేర్చారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
