సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తమను కాపాడాలంటూ బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు.
సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కాంప్లెక్స్ లోని 7,8 అంతస్తుల్లో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. బట్టల షోరూం, గోదాంలో మంటలు ఎగసిపడుతుండడంతో స్వప్నలోక్ కాంప్లెక్స్ పరిసరాల్లో పొగలు దట్టంగా అలుముకున్నాయి. ఎనిమిది నుంచి పది మంది వ్యక్తులు మంటల్లో చిక్కుకుపోయినట్లు సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పని చేసే వారు లోపల మంటల్లో చిక్కుకున్నారని యజమానులు చెబుతున్నారు. కమర్షియల్ కాంప్లెక్స్ లో పలు ఆఫీసులు, వాణిజ్య సముదాయాలు ఉన్నాయి.
సెల్ ఫోన్ లో టార్చ్ లైట్ పట్టుకుని వెలుతురు చూపిస్తూ తమను కాపాడాలంటూ బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటన స్థలానికి ఫైర్ ఇంజన్లతో సిబ్బంది వచ్చారు. నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. మంటలు మిగతా అంతస్తులకు వ్యాపించకుండా సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. కాంప్లెక్స్ వెనుక ఉన్న బస్తీలో ఉన్న జనాన్ని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ప్రమాదం వెనుక కారణాలు ఏంటో తెలియాల్సి ఉంది.
